Skip to content
తెలంగాణ వార్తలు

హెల్త్‌కార్డుల జారీలో స్పష్టమైన ఉత్తర్వులేవి?

Prajapaksham 27 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
హెల్త్‌కార్డుల జారీలో స్పష్టమైన ఉత్తర్వులేవి?

Telangana Govt logo

మహాశయా!
మెరుగైన వైద్యం కోసం ఉపాధ్యాయులు చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం అందించిన ఉచిత హెల్త్‌ కార్డులు అలంకారప్రాయంగా మారడంతో కాంగ్రెస్‌ సర్కారు జారీచేసే హెల్త్‌ కార్డులపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కార్డులు అమలులోకి రాకముందే మే నెల వేతనంలో ప్రీమియం మినహాయించడంతో ఉపాధ్యాయ వర్గంలో ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన జ్వాలలు ఉవ్వెతున్న ఎగిసిపడ్డాయి. అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులలో వైద్యం అందుతుందా? ఔట్‌ పేషెంట్‌కు హెల్త్‌ కార్డుల సౌకర్యం వర్తిస్తుందా? భార్య, భర్తలు ఇరువురు ఉద్యోగస్తులైతే ఒకరి నుండి ప్రీమియం మినహాయింపు అవకాశం ఇవ్వకుండా ఇరువురు నుండి ప్రీమియం మినహాయించడం పట్ల ఉపాధ్యాయులు ప్రభుత్వ వైఖరిపట్ల అసంతృప్తిగా ఉన్నారనేది నిర్వివాదాంశం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున హెల్త్‌ కార్డుల ఇస్తానని ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి. నేటికి హెల్త్‌ కార్డులు అందించక పోవడం శోచనీయం. ఇటీవలే ప్రభుత్వం హెల్త్‌ కేర్‌ టెస్టును ఏర్పాటు చేస్తూ జీవో.40ను విడుదలచేస్తూ టెస్టులో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్య సంఘాలకు చెందిన నాయకులకు చోటివ్వడం ముదావహం. అయితే సి.పి.యస్‌ ఉద్యోగ సంఘాలకు కూడా ట్రస్టులో అవకాశం కల్పిస్తే బాగుండేది అను అభిప్రాయాలు క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. వైద్యం అందించే ఆసుపత్రుల జాబితతో కూడిన విధివిధానాలను స్పష్టంగా విడుదల చేయాలని, అలాగే ప్రస్తుతానికి మహిళా ఉపాధ్యాయుల విషయంలో అత్త, మామలను ఆన్‌లైన్‌ నమోదులో డిపెండెంట్‌లుగా స్వీకరిస్తున్నప్పటికీ దీనిపై కూడా స్పష్టమయిన ఉత్తర్వులు విడుదలచేస్తూ, భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగస్తులైతే ఒకరి నుండే ప్రీమియం మినహాయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇక సిపిఎస్‌ ఉపాధ్యాయుల విషయానికి వస్తే సర్వీసులో ఉన్నప్పుడు వారి నుండి కూడా నెలవారి ప్రీమియం మినహాయిస్తూ వైద్యం అందిస్తున్న ప్రభుత్వం ఉద్యోగ విరమణ చెందిన తరువాత వైద్యం పరిస్థితి ఏమిటి అన్న ఆందోళనలో వారున్నారు. పెన్షన్‌ ఎంతొస్తుందో తెలియదు కావున వైద్యం అందించలేమనే ప్రభుత్వం యొక్క దాటవేత ధోరణి సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. సర్వీసు, ఫ్యామిలీ పెన్షనర్లు వారిపై ఆధారపడే కుటుంబ సభ్యులకు కూడా మెరుగైన వైద్యం అందించాలని పెన్షనర్ల సంఘాలు కూడా కోరుతున్నాయి. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనే ఆరోగ్య సమస్యలు అధికం కావున ఔట్‌ పేషెంట్‌ సౌకర్యాన్ని కూడా అందించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుత కాలంలో పెరిగిన వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని గరిష్ట పరిమితి మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మెరుగైన వైద్యం అందితేనే ఉద్యోగులు ఆరోగ్యంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగలరు. కాలయాపన లేకుండా ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలతో కూడిన ఉత్తర్వులను విడుదల చేయాలి. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి. ఎయిడెడ్‌ మోడల్‌ స్కూల్‌, ఇతర మేనేజ్‌మెంట్‌లలో పనిచేసే ఉపాధ్యాయులకు ఈ అవకాశాన్ని కల్పించాలి. ఉద్యోగికి అందే వైద్య మొత్తాన్ని రెండు లక్షలకు కాకుండా మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని కోరుతున్నాను.
సుధాకర్‌.ఏ.వి. రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు, స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ తెలంగాణ స్టేట్‌ (STUTS)