Skip to content
జాతీయం వార్తలు

అయోధ్య రామ మందిర విరాళాల స్కాం… స్వతంత్ర విచారణకు సీపీఐ డిమాండ్

Prajapaksham 27 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
అయోధ్య రామ మందిర విరాళాల స్కాం… స్వతంత్ర విచారణకు సీపీఐ డిమాండ్

CPI Demands Judicial Probe into Ayodhya Ram Temple Donation Case

అయోధ్య రామ మందిర విరాళాల అవకతవకల వ్యవహారంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం సాగుతున్న విచారణను “జవాబుదారీతనం ముసుగులో జరుగుతున్న కప్పిపుచ్చుడు చర్య”గా ఆ పార్టీ అభివర్ణించింది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీనియర్ అధికారుల పాత్రపై తక్షణమే ఒక స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని, వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని శుక్రవారం డిమాండ్ చేసింది.

తమ జాతీయ కార్యాలయం నుంచి జారీ చేసిన ఒక అధికారిక ప్రకటనలో.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికల ఆధారంగా ఇటీవల కొంతమంది బ్యాంకు ఉద్యోగులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కేవలం “మంచుకొండ అంచు” (పైకి కనిపిస్తున్న కొద్ది భాగం) మాత్రమేనని సీపీఐ స్పష్టం చేసింది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ సీనియర్ సభ్యులైన చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు కేవలం రాజీనామాలు చేస్తే ఏమాత్రం సరిపోదని తేల్చిచెప్పింది. ప్రస్తుత దర్యాప్తు తీరును తప్పుబడుతూ.. ఈ కేసును విచారిస్తున్న సిట్ (SIT) బృందం, ట్రస్ట్‌లో పదవీరీత్యా సభ్యుడిగా ఉన్న అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ (DM) పరిధిలోనే పనిచేస్తుందని.. కాబట్టి ఈ అంతర్గత దర్యాప్తు స్వతహాగా రాజీపడిందని విమర్శించింది. ఇటువంటి విచారణ ప్రజల విశ్వాసాన్ని ఏమాత్రం పొందలేదని పార్టీ వాదించింది.

దేశవిదేశాల నుంచి వచ్చే సామాన్య భక్తులు ఎలాంటి రసీదులు తీసుకోకుండానే టన్నుల కొద్దీ బంగారం, వెండితో పాటు భారీ పరిమాణంలో నగదును స్వామివారికి విరాళంగా ఇస్తున్నట్లు వస్తున్న నివేదికలను సీపీఐ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కుంభకోణం యొక్క అసలు పరిమాణం ప్రస్తుతం వెల్లడైన ₹79.85 లక్షల కంటే చాలా పెద్దదని ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మంది భక్తుల పవిత్ర విశ్వాసాన్ని, వారు సమర్పించిన కానుకలను ఎలాంటి శిక్షాభయం లేకుండా ఇలా దుర్వినియోగం చేయడం వెనుక పెద్దల హస్తం ఉందని నొక్కిచెప్పింది.

ఈ చర్యలు కేవలం జూనియర్ అధికారులకో లేదా బ్యాంకు సిబ్బందికో పరిమితం కాకుండా, దీని వెనుక ఉన్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ సీనియర్ నాయకత్వానికి కూడా చట్టపరమైన విచారణను విస్తరించాలని డిమాండ్ చేసింది. అందువల్ల, ఈ మొత్తం దర్యాప్తును పారదర్శకత కోసం తక్షణమే ఒక స్వతంత్ర న్యాయ సంస్థకు బదిలీ చేయాలంటూ తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *