Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

Indian Flag Code: భారత జాతీయ జెండా నియమాలు ఏంటి? మూడు రంగుల జెండాను ఎగురవేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

Prajapaksham 13 Aug 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Indian Flag Code: భారత జాతీయ జెండా నియమాలు ఏంటి? మూడు రంగుల జెండాను ఎగురవేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

Indian Flag Code: Essential Rules Before Hoisting the Tiranga

Indian Flag Code: స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాలు వచ్చాయంటే దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు, ప్రైవేటు సంస్థలు.. ఇలా ఎక్కడ చూసినా జాతీయ జెండా కనిపిస్తుంది. అయితే జాతీయ జెండాను ఎగురవేయడానికి, ప్రదర్శించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. భారత జాతీయ పతాక వినియోగం, ప్రదర్శనకు ప్రధానంగా Flag Code of India, 2002, అలాగే Prevention of Insults to National Honour Act, 1971 వర్తిస్తాయి.

ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేయవచ్చా?

అవును. సాధారణ పౌరులు, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు జాతీయ జెండాను అన్ని రోజుల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ ప్రదర్శించవచ్చు. అయితే జెండా గౌరవం, ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉండాలి. ముఖ్యంగా 2022లో చేసిన సవరణ తర్వాత, ఇంటిపై లేదా బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించే జాతీయ జెండాను పగలు, రాత్రి కూడా ఎగురవేయడానికి అనుమతి ఉంది.

జెండా ఎలా ఉండాలి?

జాతీయ జెండా చతురస్రంగా కాకుండా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. దాని పొడవు-వెడల్పు నిష్పత్తి 3:2గా ఉండాలి. జెండా పరిమాణం ఏదైనా ఉండవచ్చు కానీ ఈ నిష్పత్తి తప్పక పాటించాలి. జాతీయ జెండా తయారీకి ప్రస్తుతం చేతితో నేసిన/చేతితో వడికిన ఖాదీతో పాటు కాటన్, పాలిస్టర్, ఉన్ని, సిల్క్ లేదా ఖాదీ బంటింగ్, అలాగే అనుమతించబడిన మెషిన్‌మేడ్ వస్త్రాలను ఉపయోగించవచ్చు. 2021 సవరణ ద్వారా పాలిస్టర్, మెషిన్‌మేడ్ జెండాలకు కూడా అనుమతి వచ్చింది.

జెండాను నేలపై పడేయకూడదు

జాతీయ పతాకం నేలను, నీటిని తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. జెండాను గౌరవంగా, శుభ్రంగా, సక్రమంగా ప్రదర్శించాలి. చినిగిపోయిన, మురికిగా మారిన, చిరిగిన లేదా పాడైపోయిన జెండాను ప్రదర్శించకూడదు. అధికారిక మార్గదర్శకాల ప్రకారం damaged or dishevelled Flag shall not be displayed.

జెండాను వస్తువులుగా ఉపయోగించకూడదు

జాతీయ పతాకాన్ని కేవలం అలంకరణ కోసం ఉపయోగించడం, దానిపై అక్షరాలు లేదా ఇతర చిత్రాలు రాయడం, దుస్తులు లేదా ఇతర వస్తువుల రూపంలో అనుచితంగా ఉపయోగించడం వంటి చర్యలు జాతీయ జెండా గౌరవానికి విరుద్ధంగా ఉండవచ్చు. జెండాను టేబుల్, కుర్చీ, వేదిక లేదా ఇతర వస్తువులను కప్పేందుకు ఉపయోగించకూడదు. అలాగే నేలను తుడిచేందుకు, వస్తువులను చుట్టేందుకు వంటి పనులకు ఉపయోగించడం పూర్తిగా అనుచితం.

ఇంటిపై జెండా ఎగురవేసేటప్పుడు..

ఇంటి పైకప్పుపై లేదా బహిరంగ ప్రదేశంలో జాతీయ జెండాను ఎగురవేస్తే అది స్పష్టంగా కనిపించేలా, గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి. జెండా ఇతర వస్తువుల కింద లేదా వాటితో కలిసిపోయేలా ఉండకూడదు. అంటే జైండా పైన ఏ వస్తువులు ఉండకూడదు. జాతీయ జెండా ఎక్కడ ప్రదర్శించినా position of honour లో ఉండాలని Flag Code స్పష్టం చేస్తుంది.

కాగితపు జెండాలతో ఏం చేయాలి?

స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాల్లో పిల్లలు, ప్రజలు కాగితపు చిన్న జాతీయ జెండాలను ఉపయోగించడం సాధారణం. ప్రభుత్వం వాటిని ఉపయోగించడాన్ని అనుమతిస్తుంది. అయితే కార్యక్రమం పూర్తయిన తర్వాత వాటిని రోడ్లపై, చెత్తకుప్పల్లో లేదా నేలపై పడేయకూడదు. కాగితపు జెండాలను కూడా జాతీయ పతాక గౌరవానికి అనుగుణంగా ప్రైవేటుగా, గౌరవప్రదమైన రీతిలో పారవేయాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

జెండాను తలకిందులుగా పెట్టకూడదు

జాతీయ పతాకాన్ని ప్రదర్శించేటప్పుడు కాషాయం రంగు పైభాగంలో, ఆకుపచ్చ రంగు కింది భాగంలో ఉండాలి. తలకిందులుగా జెండాను ఎగురవేయడం జాతీయ పతాకాన్ని అవమానించే విధంగా పరిగణించబడుతుంది. అలాగే జెండాను ఎగురవేసే ముందు అది సరిగ్గా మడిచి ఉందా, చక్రం సరైన దిశలో ఉందా, జెండాకు ఏదైనా నష్టం జరిగిందా అనే విషయాలను పరిశీలించడం మంచిది.

జాతీయ జెండాను అవమానిస్తే?

జాతీయ జెండా వినియోగం కేవలం సాధారణ ఆచారాల ద్వారా మాత్రమే కాకుండా Prevention of Insults to National Honour Act, 1971 వంటి చట్టాల పరిధిలో కూడా ఉంటుంది. జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా దాని గౌరవానికి భంగం కలిగించే చర్యలు చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు.

గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన నియమాలు

త్రివర్ణాన్ని ఎగురవేసేటప్పుడు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి:

జెండా ఎప్పుడూ గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి.
కాషాయం పైభాగంలోనే ఉండాలి.
జెండా నేలను లేదా నీటిని తాకకూడదు.
చిరిగిన, మురికిగా లేదా పాడైపోయిన జెండాను ప్రదర్శించకూడదు.
జెండాపై రాయడం లేదా చిత్రాలు ముద్రించడం చేయకూడదు.
జెండాను అలంకరణ వస్తువుగా అనుచితంగా ఉపయోగించకూడదు.
జెండాను ఇతర వస్తువులు కప్పేలా ప్రదర్శించకూడదు.
ఇంటిపై జాతీయ జెండాను పగలు, రాత్రి కూడా ఎగురవేయవచ్చు.
జెండా పొడవు-వెడల్పు నిష్పత్తి 3:2 ఉండాలి.
కార్యక్రమం తర్వాత కాగితపు జెండాలను రోడ్లపై పడేయకుండా గౌరవప్రదంగా పారవేయాలి.

దేశభక్తి అంటే జెండా ఎగురవేయడం మాత్రమే కాదు..

త్రివర్ణ పతాకం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీక. అందుకే ఆ జెండాను ఎగురవేసే ప్రతి ఒక్కరూ దాని గౌరవాన్ని కాపాడటం కూడా తమ బాధ్యతగా భావించాలి.

జెండా మన చేతిలోకి వచ్చినప్పుడు అది కేవలం ఒక వస్త్రం కాదు.. కోట్లాది భారతీయుల గౌరవం, స్వాతంత్ర్యం, సార్వభౌమత్వానికి ప్రతీక.

జై హింద్!