Skip to content
తెలంగాణ వార్తలు

సింగరేణి విషయాలపై హరీష్ రావు దుష్ప్రచారం.. మండిపడిన MLA కూనంనేని సాంబశివరావు

Prajapaksham 26 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
సింగరేణి విషయాలపై హరీష్ రావు దుష్ప్రచారం.. మండిపడిన MLA కూనంనేని సాంబశివరావు

MLA Kunamneni Sambasiva Rao Accuses Harish Rao of Spreading Misinformation on Singareni Issues

40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే ప్రచారం పూర్తిగా అసత్యం

75 లక్షల టన్నుల బొగ్గు మాయం ఆరోపణలకు సమాధానం చెప్పాలి

సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మెకు పిలుపు

రాజకీయ స్వార్ధం కోసమే టిబిజికెఎస్ ఏర్పాటు

బిఆర్ సింగరేణిలో రాజకీయ జోక్యం మొదలైంది
గనులు, కార్మికులు తగ్గడానికి బిఆర్ కారణం
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎం ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు

సింగరేణికి సంబంధించిన విషయాలపై బిఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎఐటియుసి అనుబంధ కార్మిక యూనియన్ తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎం ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని హరీష్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఒక్క బొగ్గు పెల్ల కూడా దొంగతనం జరిగే అవకాశం లేదన్నారు. సింగరేణి సంస్థ విధివిధానాలకు రుణాలు, రేటింగ్ లేదా ఇంకేదో దాని కోసం 40 లక్షల టన్నుల బొగ్గు లేనిది ఉన్నట్టు సింగరేణి చూపించినట్లు కనబడుతుందని, కానీ దొంగతనం జరిగినట్టు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం అభ్యంతరకరమన్నారు. “సింగరేణిలో ఇప్పుడు స్కామ్ జరిగింది అంటే బిఆర్ ప్రభుత్వ హయంలో 75 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఎక్కువ చూపించారు.
అప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్ 2017లో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 75 లక్షల టన్నుల బొగ్గు ఎక్కువగా ఉన్నదని చూపెట్టారని “ఇది సత్యం స్కాం లాంటి” దని ఆనాటి కేంద్ర విజిలెన్స్ కమిషన్ కే చౌదరి కి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇప్పుడు 45 లక్షల టన్నులు అయితే అప్పుడు 75 లక్షల టన్నులు, ఇప్పుడు 45 లక్షల స్కాం అయితే 75 లక్షల టన్నుల బొగ్గు స్కాం కాదా, ఇప్పుడు హరీష్ రావు ఒప్పుకుంటాడా ఏదైనా అంశం మాట్లాడేటప్పుడు దాని పూర్వాపరాలు తెలుసుకొని మాట్లాడాలి. అది స్కామ్ అని హరీష్ రావు ఎందుకు అనడంలేదు. ఇప్పుడు దొంగతనం జరిగింది అంటే అప్పుడు కూడా దొంగతనం చేసినట్టే కదా” అని సాంబశివరావు ప్రశ్నించారు. హరీష్ రావు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైందికాదని, ఆయన అసత్యాలు చెప్పడం మానేసి, బొగ్గు నిల్వలపై అనుమానం ఉంటే సిబిఐ విచారణ కొరవచ్చని సాంబశివరావు ఆయన సూచించారు.
సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి కె.రాజ్ ఇటీవలి కాలంలో సింగరేణిలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు. సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బొగ్గు నిల్వలపై ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో జరిగే అంశమని, దీనిపై సింగరేణి సంస్థను ఇప్పటికే హెచ్చరించామన్నారు. ఈ విషయాలతో తమకేమీ సంబంధంలేదని, హరీష్ రావుతో కూడా తనకు ఎలాంటి పంచాయతీ లేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే టిజిబికెఎస్ యూనియన్ పంచాయతీ కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బ తీయొద్దని, కార్మికులను అవమానించినట్టుగా మాట్లాడొద్దని ఆయన అన్నారు. ప్రస్తుతం బిఆర్ ఎస్ నేత దాసోజు శ్రవణ్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో బిఆర్ హయంలో సింగరేణి సంస్థలో 75 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.చౌదరికి లేఖ రాశారని, ఆ స్కామ్ ‘లైక్ సత్యం స్కామ్’ అని ఆయన పేరు పెట్టారని, దీనిపై హరీష్ సమాధానం చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.

సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మెకు పిలుపు
సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మెకు పిలుపునిస్తామని సంస్థను హెచ్చరించినట్లు సాంబశివరావు వెల్లడించారు. హరీష్ తనను సింగరేణి పక్షమా? స్కామ్ పక్షమా? అని ప్రశ్నిస్తున్నారని, నేను కమ్యూనిస్టుగా ఏ పక్షం ఉంటాను గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించి మాట్లాడాలని అన్నారు. తాను ఎల్లప్పుడూ కార్మికుల పక్షమే అని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి పేరుతో 26 వేల కోట్లు జెన్ కో వంటి సంస్థల పేరుతో బిఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందని, గత పదేళ్లు బిఆర్ ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు.

రాజకీయ స్వార్ధం కోసమే టిబిజికెఎస్ ఏర్పాటు
తెలంగాణ ఉద్యమ సమయంలో కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని (టిబిజికెఎస్)బిఆర్ ఎస్ ఏర్పాటు చేసిందని, అనంతరం దానిని మూసివేశారని సాంబశివరావు గుర్తు చేశారు. కానీ1948లో ప్రారంభమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే ఉందని, కార్మికులకు అండగా నిలబడుతున్నదని అన్నారు. కార్మికుల హక్కుల పోరాటంలో అనేక మంది నాయకులు, కార్మికులు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఒకటి రెండు సార్లు మాత్రమే టిజిబికెఎస్ గెలిచిందని, గత 80 సంవత్సరాల నుండి సజీవంగా ఉన్న యూనియన్ కార్మికులు తమ గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తుస్తున్నారు. సందర్భాల్లో తమ యూనియనే గెలిచిందన్నారు. ఓడిపోయిన టిజిబికెఎస్ నాయకులు వెంటనే ఇతర యూనియన్ వెళ్ళిపోయారని, కానీ ఎంత మంది చనిపోయినా, ఇబ్బందుకు ఎదురైనా తాము జెండా మార్చలేదని ఆయన వివరించారు.
బిఆర్ సింగరేణిలో రాజకీయ జోక్యం మొదలైంది
సింగరేణి సంస్థలో 2014 కంటే ముందు రాజకీయ జోక్యం లేదని, బిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరాతనే సంస్థలో రాజకీయ జోక్యం మొదలైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అది మరింతగా విస్తరించిందని సాంబశివరావు ఆగ్రహవ వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ 11 గనులు ఉన్న సింగరేణి సంస్థను 30 గనులుగా అభివృద్ధి చేయడంతో పాటు 67 వేలు ఉన్న కార్మికుల సంఖ్యను 1 లక్షకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, బిఆర్ ప్రభుత్వ పదేళ్ల హయంలో గనుల సంఖ్యను పెంచకపోగా, కార్మికుల సంఖ్య 40 వేలకు తగ్గిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గనులు, కార్మికులు తగ్గడానికి బిఆర్ ఎస్ కారణం
సింగరేణి సంస్థలో గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్య కారణం గతంలోని బిఆర్ ప్రభుత్వమేనని కూనంనేని సాంబశివరావు చెప్పారు. గతంలో దేశంలో ఎక్కడ గనులు ఉన్నా వాటిపై కేవలం సింగరేణి సంస్థకే అధికారం ఉండేదని, కానీ 2015లో గనుల వేలం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మైన్స్, మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ యాక్ట్ (ఎంఎండిఆర్) చట్టంతో పలు గనులపై ప్రైవేట్ సంస్థలకు అధికారం దక్కిందని, అందుకు అప్పటి బిఆర్ ఎస్ ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించిందనే విషయం బిఆర్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఫలితంగా సింగరేణి ఊపిరి తీసినట్టు అయ్యిందని, ఆ తర్వాత వేలంలో పాల్గొనవద్దని వదిలేశారని, అలా రెండు గనులను కొల్పోయామన్నారు. తాడిచర్ల, రామకృష్ణాపురంలో ని గనులను ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పిందన్నారు. సింగరేణి ఉన్నా కొన్ని గనులను ప్రవేట్ సంస్థలకు ఇచ్చారన్నారు. ఇదిలా ఉండగా, రాజకీయాల కోసం నేతలు మాట్లాడుతుంటారని, ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర నీటి వాటాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరని సాంబశివరావు ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

సీతారామయ్య మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ పార్టీలు సింగరేణి సంస్థను రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని విమర్శించారు. బిజెపి, బిఆర్ ఎస్ కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు సింగరేణిపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని, అసలు సింగరేణి సంస్థకు ఈ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని సవాల్ చేశారు. బిఆర్ ఎస్ హయంలో సింగరేణి సంస్థకు రూ.26 వేల కోట్లు అప్పు పెట్టికపోతే, దానిపై ప్రస్తుత డిపూటీ సిఎం భట్టి విక్రమార్క మంచిర్యాలలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కెసిఆర్ ప్రశ్నించారని, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.26 వేల కోట్ల అప్పులను రూ.56 వేల కోట్లకు పెంచిందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం సింగరేణి కార్మికుల, యాజమాన్యం ప్రతిష్టను దెబ్బతీయొద్దని హితవు పలికారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ 11 ఏరియాల్లో (జిల్లాల్లో) విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలో రాజకీయంగా లబ్ది పొందేందుకు మాజీ మంత్రి హరీష్ వర్కర్స్ యూనియన్ మరియు యూనియన్ గౌరవ అధ్యక్షులు సాంబశివరావు పైన దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇకనైనా రాజకీయ నేతలు సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించి, సింగరేణిని పరిరక్షించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *