Skip to content
జాతీయం వార్తలు

Editorial: ఓటర్లూ.. పారాహుషార్‌!

Prajapaksham 25 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Editorial: ఓటర్లూ.. పారాహుషార్‌!

ai generated image

అనేక సందేహాలు, అనుమానాల నడుమ ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – సర్‌) ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది. ఓటర్ల జాబితాను సమగ్ర ప్రక్షాళన జరిపే ఉద్దేశంతో సర్‌ ప్రక్రియను దేశవ్యాప్తంగా గతేడాది జూన్‌, సెప్టెంబర్‌ మాసాలలో బిహార్‌ రాష్ట్రంలో మొదటి దశను నిర్వహించారు. ఆ తరువాత అక్టోబర్‌ మాసంలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ పూర్తయింది. మొదటి రెండు దశల్లో 5 కోట్లకు పైగా ఓటర్లను తొలగించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల తొలగింపు ప్రక్రియ వివాదాస్పదమైంది.

ప్రస్తుతం 13 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకొని 59 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన ‘సర్‌’ ప్రక్రియను ‘సర్‌ 3’ కింద చేపట్టారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదలైంది. 2006 మే 12వ తేదీని ఆధారంగా తీసుకొని, 2026 అక్టోబర్‌ 1 నాటికి సర్‌ పూర్తయిన తరువాత తాజా పరిచిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్‌ ప్రకటించనుంది.

తెలంగాణలో చివరి సారిగా 2002లో సర్‌ ప్రక్రియ జరిగింది. ప్రస్తుత సర్‌ ప్రక్రియకు అదే మూలాధారం కానుంది. ఇప్పుడు తెలంగాణలో 3.38 కోట్ల ఓటర్లు ఉన్నారు. అయితే, సర్‌ ప్రక్రియ చేపట్టకుముందు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తయింది. అంటే, సర్‌ 2002 ఓటరు జాబితాలో ఉన్న ఓటర్ల పేర్లను, ప్రస్తుత ఓటర్ల పేర్లతో సరిపోల్చి చూడడం. తద్వారా 2.38 లక్షల ఓటర్ల వివరాలు సరిపోయాయి. 89.88 లక్షల మంది ఓటర్ల వివరాలు తేలాల్సి ఉంది.

ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. పేర్లు సరిపోలకపోవడమో, తండ్రి పేరు, వయసు, అడ్రస్‌ తదితర పొరపాట్ల కారణంగానో, కొందరు మరణించిన కారణంగానో, ఇతరత్రా కారణాలతోనో వాటిని ఎనామలీస్‌ జాబితాలో పెట్టారు. అంటే, అవి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లే. ఇంటి పేరు 2002 జాబితాలో పేరు వెనక ఉండి, తాజా జాబితాలో ముందు ఉండడంతో తన పేరునే ఎనామలీస్‌ జాబితాలో పెట్టారని స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతుండడం పరిస్థితి తీవ్రతను తెలియపరుస్తోంది. ఆయన తన గుర్తింపును నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటి వరకు సర్‌ ప్రక్రియలో దేశంలోనే అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి 83.86 లక్షల మంది ఓటర్లు తగ్గిపోయారు. అందులో 60 లక్షల మంది వరకు మరణించిన వారు ఉండగా, 27 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి. వారి గురించి సుప్రీం కోర్టులో నాటి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాదించగా, అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేక ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసి పరిష్కరించాలని ఆదేశించినా, పెద్దగా ప్రయోజనకరంగా లేకపోయింది. ఇది ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందని ఓటమి పాలైన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆక్రోశం అరణ్యరోదనగా మారింది.

ప్రస్తుతం గురువారం నుంచి ప్రారంభమై, వచ్చే నెల 24 వరకు బిఎల్‌ఒలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్క ఓటరుకూ ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చి, నింపిన తరువాత తీసుకోవడం వారి బాధ్యత. అంటే, అందరూ కొత్తగా ఓటర్లుగా నమోదైతున్నట్లే లెక్క! సర్‌ ప్రక్రియ చేపట్టే ముందు ఓటర్‌ మ్యాపింగ్‌లో సరిపోలిన వారు కాక, సరిపోలని వారు తమ గుర్తింపును నిరూపించుకోవాల్సిన పరిస్థితి.

అయితే, ఇందుకు కొన్ని గుర్తింపు పత్రాల జాబితాను ప్రకటించినప్పటికీ, అందులో 1987కు పూర్వపు పత్రాలు చూపమనడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. పెద్ద కష్టమే కాదని అధికారులు చెబుతున్నప్పటికీ, ఆ పత్రాలను తీసుకురావడం అంత సులభమేమీ కాదు.

రాష్ట్ర మంతటా ఒక ఎత్తైతే, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో సర్‌ మరొక ఎత్తు. 2002 తరువాత జిల్లాల నుంచి ప్రజలు ఉపాధి, ఉజ్వల భవిష్యత్తును వెతుక్కుంటూ పెద్ద ఎత్తున రాజధాని హైదరాబాద్‌కు వలసలు వచ్చారు. ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్న సర్‌ 2002 ఓటర్ల జాబితాల్లో ఆయా కుటుంబాల ఓట్లు సొంతూళ్లలోనే ఎక్కువ. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత కూడా స్థిరనివాసం ఉండక, అనేక చోట్ల అద్దెలు ఉండడం పరిపాటి. అలాంటి వారు తమ గుర్తింపును నిరూపించుకోవడం సవాలుగా మారనుంది. వీరి విషయంలో గుర్తింపు పత్రాల సమస్యను సులభతరం చేయాల్సిన అవసరం ఎన్నికల కమిషన్‌పైనే ఉంది. ప్రక్రియ చేపట్టే కొలదీ ఎదురయ్యే సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపించాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్‌ మహానగరంలో మరో చిక్కుముడి కూడా ఉంది. తెలంగాణ జిల్లాల నుంచి మాదిరిగానే, 2002 నుంచి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వలసలు వచ్చారు. రాష్ట్ర విభజన తరువాత కూడా అక్కడా, ఇక్కడా రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి సంఖ్య ఎక్కువే. ఈ విషయాన్ని ఇప్పటికే బిఆర్‌ఎస్‌ ప్రతినిధి వర్గం ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో రెండు చోట్ల ఉన్న ఓట్లను డూప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కమిషన్‌ గుర్తించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఓట్లకు కూడా ఈ ప్రక్రియ చేపట్టాలని బిఆర్‌ఎస్‌ సూచించింది.

నిజానికి సర్‌ ప్రక్రియ చేపట్టడం మంచిదే. ఒకటి కంటే ఎక్కువ ఓట్లను, మరణించిన ఓటర్ల పేర్లను, ఇతర చోట్లకు వలస వెళ్లినా కొనసాగుతున్న ఓట్లను తొలగించాల్సిందే. అయితే, దీనికి దేశభక్తి ముసుగు కప్పేందుకు ఇతర దేశం నుంచి అక్రమంగా నివసిస్తున్న వారిని ఏరివేసేందుకు సర్‌ చేపట్టినట్లు ప్రచారం విషయాన్ని భూతద్దంలో చూపెట్టడమే. అక్రమ నివాసితులను ఏరివేసేందుకు మరింత మెరుగైన చర్యలు తీసుకోవచ్చు.

గతంలో సర్‌ సందర్భంగా ఓట్ల తొలగింపులు, గుర్తింపు పత్రాలకు సంబంధించి ఇప్పటి మాదిరిగా గందరగోళం, ప్రజల్లో ఆందోళనకు దారితీసిన దాఖలాలు లేవు. మరి ఈసారే సర్‌ విషయంలో ఎందుకింత రగడ జరుగుతోందనే ప్రశ్న ఉద్భవిస్తోంది. ఇందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్‌ను ఎన్నికల్లో విజయం సాధించుకునేందుకు ఒక అస్త్రంగా వాడుతున్నట్లు అనేక వ్యాసాలు వచ్చాయి. అందుకు ఉదాహరణగా పశ్చిమబెంగాల్‌, బిహార్‌ ఎన్నికల ఫలితాలపై అనేక మంది మేధావులు విశ్లేషణలు చేశారు.

తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన బిజెపి ప్రభుత్వం ఓటర్ల జాబితాను సంక్షేమ పథకాలకు ముడిపెట్టింది. సర్‌ ప్రక్రియ కింద ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన లబ్దిదారులకు గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ, మహిళలకు నగదు బదిలీ పథకాన్ని రద్దు చేస్తామని నోటిఫికేషన్‌లు ఇచ్చింది.

అసలు భయం అదే. ఎందుకంటే, సర్‌ ప్రక్రియ కింద ఎక్కువగా ఓట్లు కోల్పోయేది వలస కార్మికులు, నిరుపేద వర్గాలే. పొట్టకూటి కోసం ఎక్కడికి బడితే అక్కడ తిరిగే ఆ కుటుంబాలు 2002 జాబితాతో సరిపోల్చే ఆధారాలు సమకూర్చుకోవడం కష్టం. కాబట్టి సంక్షేమ పథకాలలో వేటు వేస్తే నష్టపోయేది వాళ్లే.

కాబట్టి తెలంగాణ ఓటర్లు నెలరోజుల పాటు జరిగే సర్‌ ప్రక్రియ సందర్భంగా అత్యంత అప్రమత్తతతో వ్యవహరించి, ఓటు హక్కును కోల్పోకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని ఇతర రాష్ట్రాల అనుభవాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *