నీట్ కేసులో కేంద్ర మంత్రిని కాపాడుతున్న ఆ ఇద్దరు..అంత స్పెషల్ ఏముంది..?
dharmendra pradhan ( AI Generated)
నీట్ ఎగ్జాం పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరీక్ష నిర్వహణలో పూర్తిగా కేంద్ర విద్యాశాఖ వైఫల్యమే కారణమని చెప్పవచ్చు. ఈ పేపర్ లీకేజీ తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ పేపర్ లీకేజీ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి, కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఒక నూతన రాజకీయ పార్టీకి పురుడు పోసుకునేందుకు దోహదపడింది. అది కాస్త నేడు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారేందుకు సిద్ధమవుతోంది. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని అటు ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం చూడవచ్చు. అయితే, గతంలో పలు ఆరోపణలు వచ్చిన కేంద్ర మంత్రుల చేత రాజీనామాలు చేయించిన బీజేపీ అధిష్ఠానం, ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటూ ఆయనకు అండగా నిలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది అని చెప్పవచ్చు.
మే మూడో తేదీన 22 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, వాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన వ్యవహారం దేశమంతటా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ప్రశ్నలు, అలాగే ఎగ్జామ్‌లో వచ్చిన ప్రశ్నలు మ్యాచ్ అవడంతో ఈ లీకేజీ వ్యవహారం బయటకు పొక్కి మొత్తం రసాభాస అయింది. ఈ పేపర్ లీకేజీ పైన అటు దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవడంతో పరిస్థితిని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం, మే 12వ తేదీన నీట్ పరీక్షను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వ్యవహారం సీరియస్‌గా మారడంతో దీని వెనక ఉన్న ఒక పెద్ద మాఫియా నెట్‌వర్క్‌ను ఛేదించాలని కేంద్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించింది.
మరోవైపు, ఈ లీకేజీ వ్యవహారం పైన సీబీఐ దర్యాప్తు చేపట్టగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అంతర్గత లోపాల వల్లనే ఈ లీకేజీ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. ముఖ్యంగా పలువురు అధికారులు, కోచింగ్ సెంటర్ల నిర్వహకులు, సబ్జెక్ట్ నిపుణులను అరెస్టు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమం అన్ని రాష్ట్రాలకు పాకింది. ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని ‘గో బ్యాక్ ధర్మేంద్ర ప్రధాన్’ పేరిట పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తోంది. అటు ఈ నిరసన ప్రదర్శనలకు పెద్ద ఎత్తున యువత తరలిరావడం బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది అని చెప్పవచ్చు.
అయితే, ఇంత జరిగినా కూడా ప్రతిపక్షాలు రాజీనామా కోసం ఎంత ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, ధర్మేంద్ర ప్రధాన్‌కు మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదం మాత్రం పూర్తిగా ఉందని తెలుస్తోంది. వారిద్దరి ప్రోత్సాహంతోనే ధర్మేంద్ర ప్రధాన్ బేషరతుగా పదవిలో కొనసాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి ముఖ్య కారణం మోదీ క్యాబినెట్‌లో ధర్మేంద్ర ప్రధాన్ ఒక ట్రబుల్ షూటర్‌గా ఉన్నారు. ఎలాంటి హడావిడి లేకుండా తెరవెనక ఎన్నికల వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర చాలా చురుకుగా ఉంది అని చెప్పవచ్చు.
బీహార్‌లో జేడీయూ-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు సక్సెస్ చేయడంతో పాటు, హర్యానాలో అధికార వ్యతిరేకతను సైతం అధిగమించి బీజేపీని హ్యాట్రిక్ విజయాల దిశగా కొనసాగించడంలో ధర్మేంద్ర ప్రధాన్ వేసిన వ్యూహాలే కారణమని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన నందిగ్రామ్ ఎన్నికల బాధ్యతను ధర్మేంద్ర ప్రధాన్ తన భుజాన వేసుకొని సీఎం మమతా బెనర్జీని ఓడించడంలో సక్సెస్ అయ్యారు.
ఇక అలాగే బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ఇన్ని కీలక విజయాలు అందించిన నేతను వదులుకోవడానికి ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం సిద్ధంగా లేదు అని చెప్పవచ్చు. ఎన్ని విమర్శలు వచ్చినా ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం పదవిలోనే కొనసాగుతూ ఉండటం అటు బీజేపీ వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మంత్రి చేత రాజీనామా చేయిస్తే ప్రతిపక్షాలదే పైచేయి అవుతుందని అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏమాత్రం ఆరోపణలు వచ్చినా కేంద్ర మంత్రులను చకచకా పదవుల నుంచి తొలగించి ప్రక్షాళన చేసే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా, ఎన్ని ఆరోపణలు వచ్చినా మంత్రులను కొనసాగిస్తుండటం చూడవచ్చు. అయితే, ఇప్పటికిప్పుడు అదరాబాదరగా నిర్ణయం తీసుకునే బదులు, వేచి చూసే ధోరణిలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.