Skip to content
ప్రపంచం వార్తలు

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం.. ఒక్క రాత్రే మాస్కో మీద 660 డ్రోన్లతో ఉక్రెయిన్‌ భీకర దాడి

Prajapaksham 26 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం.. ఒక్క రాత్రే మాస్కో మీద 660 డ్రోన్లతో ఉక్రెయిన్‌ భీకర దాడి

Russia Reports One of the Biggest Ukrainian Drone Attacks on Its Territory

ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య ఐదేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధం మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రష్యా సైనిక స్థావరాలు, ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ల దాడికి తెగబడింది. రష్యా చేతుల్లో ఉన్న క్రిమియా ద్వీపకల్పంతో పాటు రష్యావ్యాప్తంగా ఉన్న 12 కీలక ప్రాంతాలపై ఉక్రెయిన్ ఒకే రాత్రి ఏకంగా 660 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది.

రాజధాని మాస్కో, అజోవ్ తీర ప్రాంతాలు, నల్ల సముద్ర తీర నగరాలను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ ఈ వ్యూహాత్మక దాడులు నిర్వహించింది. మాస్కో నగరం వైపు దూసుకొచ్చిన 47 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చివేశాయని మాస్కో మేయర్ సర్జీ సోబ్యానిన్ ప్రకటించారు. అయితే, మాస్కోకు దక్షిణంగా 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులా ప్రాంతంలోని నోవోమోస్కోవ్‌స్కీలో గల ఒక ప్రధాన కెమికల్ ప్లాంట్ (అజోట్ కెమికల్ ప్లాంట్), అక్కడి విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్లు నేరుగా దాడి చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడుల వల్ల రష్యాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు ఇంధన కొరత కూడా ఏర్పడినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయంగా జరిగిన శాంతి ప్రయత్నాలు ఆశించిన పురోగతి సాధించకపోవడంతో ఉక్రెయిన్ ఈ దూకుడు వ్యూహాన్ని ఎంచుకుంది. ఈ భారీ దాడులకు కొన్ని గంటల ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. రష్యాను శాంతి చర్చల వైపునకు లాగడమే లక్ష్యంగా ఉక్రెయిన్ భద్రతా సంస్థ (SSU) ఆధ్వర్యంలో 40 రోజుల పాటు సాగే ఒక సుదీర్ఘ ప్రత్యేక ఆపరేషన్‌కు తాను ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ 40 రోజుల్లో రష్యా భూభాగంపై తమ దాడులు మరింత ఉద్ధృతంగా, అత్యంత తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్‌పై క్షిపణులు, గైడెడ్ బాంబులతో ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంపై రష్యా జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన 189 రష్యన్ డ్రోన్లలో 174 డ్రోన్లను తమ రక్షణ దళాలు అడ్డుకున్నాయని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. అయినప్పటికీ కొన్ని రష్యన్ బాలిస్టిక్ క్షిపణులు కీవ్, ఒడెస్సా, సుమీ ప్రాంతాల్లోని నివాస గృహాలపై పడటంతో భారీ నష్టం వాటిల్లింది.

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న ఈ దాడులను నిరసిస్తూ ఐరోపా సమాఖ్య (యూరోపియన్ యూనియన్) రష్యాపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై విధిస్తూ వస్తున్న ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను మరో ఏడాది పాటు, అంటే 2027 జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా పోటాపోటీగా దాడులు చేసుకుంటుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *