తెలంగాణ ఓటర్ల జాబితా ప్రక్షాళన.. కోటికి పైగా ఓట్లు గల్లంతు.. ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ..
Voter List
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియడంతో ఓటర్ల జాబితా ప్రక్షాళన కీలక దశకు చేరుకుంది. సర్వే ప్రాథమిక ఫలితాలు, డిజిటలైజేషన్ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఏకంగా కోటికి పైగా ఓట్లు తొలిగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరణాలు, అడ్రస్ లభించకపోవడం, శాశ్వత వలసలు, ఒకే వ్యక్తికి బహుళ ప్రదేశాల్లో ఓట్లు ఉండటమే ఈ భారీ గల్లంతుకు ప్రధాన కారణాలుగా తేలింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధిక ప్రభావం:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 3.38 కోట్ల ఓటర్లలో దాదాపు 2.64 కోట్ల మంది (78.3 శాతం) ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజ్ కాగా.. మిగిలిన 73.39 లక్షలకు పైగా ఓట్లు ‘అన్‌కలెక్టబుల్’ (సేకరించలేని) విభాగంలోకి చేరాయి. ఈ ఓట్లన్నీ ఆగస్టు 17న విడుదల కానున్న ముసాయిదా జాబితా నుంచి పూర్తిగా తొలగించనున్నారు. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఓట్ల తొలగింపు అత్యధికంగా నమోదైంది.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 1.14 కోట్ల మంది ఓటర్లలో 43 లక్షలకు పైగా ఓటర్ల పత్రాలు లభించకపోవడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లు మారడం, గేటెడ్ కమ్యూనిటీల్లో అందుబాటులో లేకపోవడం, శాశ్వత వలసల కారణంగానే ఇక్కడ గల్లంతు సంఖ్య పెరిగింది.
అన్‌కలెక్టబుల్ జాబితాలో ప్రధాన కారణాలు:
సేకరించలేని ఓట్లకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయి విశ్లేషణలో ఈ క్రింది అంశాలను ప్రాథమికంగా గుర్తించారు:
శాశ్వత వలసలు: తమ స్థిర నివాసాల నుంచి శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి సంఖ్యే అత్యధికంగా 45.18 లక్షలుగా ఉంది.
అడ్రస్ దొరకని వారు: నివాస ప్రాంతాల్లో జాడ తేలని లేదా లేని ఓటర్లు 11.25 లక్షల మంది ఉన్నారు.
మరణించిన వారు: రాష్ట్రవ్యాప్తంగా 9.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది.
డ్యూప్లికేట్ ఓట్లు: ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన ఓటర్లు దాదాపు 3.18 లక్షల నుండి 6.70 లక్షల వరకు ఉన్నట్లు స్పష్టమైంది.
తేడాలున్న 61 లక్షల మందికి ఈఆర్‌వో నోటీసులు:
ఎన్యూమరేషన్ పత్రాలు లభించిన ఓటర్లలోనూ సుమారు 61 లక్షల మంది వివరాల్లో 11 రకాల తీవ్ర వ్యత్యాసాలు (అనామలీస్) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేటగిరీలోని ఓటర్లకు ఆగస్టు 17న ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత ఈఆర్‌వో (ERO) అధికారులు నోటీసులు అందజేస్తారు. నోటీసు అందుకున్న వారు స్వయంగా హాజరై, ఎన్నికల సంఘం సూచించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తేనే వారి ఓటు హక్కు సజీవంగా ఉంటుంది.
డిజిటలైజేషన్‌లో యాదాద్రి టాప్.. హైదరాబాద్ లాస్ట్:
రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ డిజిటలైజేషన్ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లా 94.31% శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ జిల్లా కేవలం 58.89% శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
- Prakash Raj SIR Remarks: పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న.. ‘ప్రజల పక్షాన ఉంటారా? ఎన్నికల సంఘం పక్షాన ఉంటారా?’
- Dussehra 2026: నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాలు ఇవే.. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు ఒక్కో రూపం విశిష్టత గురించి తెలుసా..
- Andhra Pradesh Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి 17.20 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? పరకాల ప్రభాకర్ సంచలన విశ్లేషణ..పూర్తి వివరాలు ఇవే..
- Rahul Gandhi Satyagraha: దేశవ్యాప్త ఉద్యమాలకు డిజిటల్ వేదిక.. ‘సత్యాగ్రహ’ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ
- Telangana Express Turns 50: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దాకా .. ఐదు దశాబ్దాల ప్రస్థానం..