వెనిజులాలో జంట భూకంపాల బీభత్సం.. 235కు చేరిన మృతుల సంఖ్య.. మరో 50 వేల మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
Powerful Earthquake Hits Venezuela, Buildings Sway in Capital
వెనెజువెలాను అతలాకుతలం చేసిన జంట భూకంపాల తీవ్రత ,నష్టంపై అందుతున్న అధికారిక వివరాలు భయాందోళనలను మరింత పెంచుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 39 సెకన్ల వ్యవధిలోనే సంభవించిన 7.2 ,7.5 తీవ్రత గల ఈ భారీ భూకంపాల వల్ల ఇప్పటివరకు కనీసం 235 మంది మరణించగా, 4,300 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కార్లోస్ అల్వరాడో అధికారికంగా ధృవీకరించారు.
ఆసుపత్రులకు తరలించే లోపే లేదా చేరిన వెంటనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుని ఉంటారని భావిస్తుండటంతో, సుమారు 50,000 మంది గల్లంతైనట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య ఏకంగా 10,000 దాటే అవకాశం 44 శాతం వరకు ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) హెచ్చరించింది.
ఈ దారుణ విపత్తు నేపథ్యంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ) ప్రకటించారు. రాజధాని కారాకస్‌లో అనేక బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమవడంతో పాటు, దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. నగర వీధులన్నీ ధ్వంసమైన కాంక్రీట్ కట్టడాలు, అంబులెన్స్‌ల సైరన్లు, గాయపడిన బాధితుల ఆక్రందనలతో ఒక హారర్ సినిమాను తలపిస్తున్నాయని స్థానికులు వర్ణిస్తున్నారు.
ఈ ప్రమాదంలో వెనెజువెలాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా బెల్లో, లా గువైరాలో ఒక భవనం కూలిపోవడంతో తన కుమార్తెను రక్షించే ప్రయత్నంలో మరణించారు. అలాగే 1985 మిస్ వెనెజువెలా అందాల పోటీ విజేత గిసెల్ రేయెస్ తల్లితో పాటు, ఇద్దరు చైనా జాతీయులు కూడా ఈ భూకంపంలో మరణించినట్లు చైనా రాయబార కార్యాలయం ధృవీకరించింది.
భూగర్భ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. మొదటి భూకంప కేంద్రం యారాకుయ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, అక్కడి కఠినమైన రాతి భూభాగం కారణంగా తరంగాలు లా గువైరా వంటి ఇసుక, అవక్షేపాలు కలిగిన మెత్తటి నేల ప్రాంతాల వైపు ప్రయాణించాయి. రెండు భూకంపాల తరంగాలు ఒకదానితో ఒకటి కలవడం ,యారాకుయ్లోని లోతైన ప్రకంపన తరంగాలు, లా గువైరాలోని పర్వత శిఖరాల వద్దకు వచ్చేసరికి మరింత తీవ్రమవడంతో లా గువైరా ప్రాంతంలో ఊహించని స్థాయిలో భారీ నష్టం వాటిల్లింది.
మరోవైపు, ఈ భయంకర భూకంపాల వల్ల వెనెజువెలా ప్రధాన ఆర్థిక వనరైన చమురు ఉత్పత్తికి ఎలాంటి నష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. దేశంలోని ప్రధాన చమురు ఉత్పత్తి ప్రాంతాలు, రిఫైనరీలు, పైప్లైన్లు ఈ భూకంప ప్రభావిత నగరాలకు చాలా దూరంలో ఉన్నాయని రాయిటర్స్ పేర్కొంది. దేశంలోని అతిపెద్ద శుద్ధి కర్మాగారమైన పరాగ్వానాలోని కార్మికులు యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా ఏర్పడిన విద్యుత్ అంతరాయం రాబోయే రోజుల్లో చమురు సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇంకా స్పష్టమవ్వలేదు. వెనెజువెలాలో కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికాకు చెందిన ‘చెవ్రాన్’, యూకేకు చెందిన ‘షెల్’ వంటి అంతర్జాతీయ ఇంధన సంస్థలు తమ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించాయి. ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని ప్రాణాలను కాపాడేందుకు సహాయక సిబ్బంది యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.