తెలంగాణలో వచ్చే ఏడు రోజుల పాటు భారీ వర్షాలు.. హైదరాబాద్ నగరానికి హైఅలర్ట్
Heavy Rain in Hyderabad Triggers Traffic Jams Across the City
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ ఈ రోజుకు గాను ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ (హెచ్చరికలు) జారీ చేసింది.
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మంచిర్యాలు, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది.
రాజధాని హైదరాబాద్‌లో ఈ రోజు సాయంత్రం తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, సాయంత్రం 6 గంటల తర్వాత నగరంలో వర్ష తీవ్రత క్రమంగా పెరిగి, రాత్రి సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.