Skip to content
జాతీయం వార్తలు

20 ఏళ్లకే 60 ఏళ్లలా మారుతున్న యువత.. మీ వయసు కంటే శరీరం ఎక్కువగా వృద్ధాప్యానికి చేరుతోందంటున్న కొత్త నివేదిక..

Prajapaksham 28 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
20 ఏళ్లకే 60 ఏళ్లలా మారుతున్న యువత.. మీ వయసు కంటే శరీరం ఎక్కువగా వృద్ధాప్యానికి చేరుతోందంటున్న కొత్త నివేదిక..

New Research Suggests Modern Generations Are Aging More Rapidly (Photo-AI)

ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ముఖ్యంగా భారతదేశంలోని యువతలో శారీరక వృద్ధాప్య ప్రక్రియ (ఏజింగ్) మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత వేగంగా కొనసాగుతోందని అంతర్జాతీయ, జాతీయ స్థాయి శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో పాటు చైనీస్ అకాడమీ, దేశీయంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనాల్లో భారతీయుల బయోలాజికల్ వయసుపై దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే కాలక్రమ వయసు (క్రోనలాజికల్ ఏజ్) కంటే శరీరంలోని కణాలు, అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని బట్టి లెక్కించే జీవ వయసు (బయోలాజికల్ ఏజ్) నేటి యువతలో చాలా ఎక్కువగా ఉంటోంది. శరీరంలోని కణాల విభజనను నియంత్రించే ‘టెలోమియర్స్‌’ అనే క్రోమోజోమ్‌ భాగాలు చిన్న వయసులోనే క్షీణించిపోవడం వల్ల కణాలు త్వరగా ముసలివి అవుతున్నాయి.

దీనికి తోడు వాయు కాలుష్యం, వేగవంతమైన పట్టణీకరణ, మద్యపానం, ధూమపానం, జంక్‌ఫుడ్‌/ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఏర్పడే దీర్ఘకాలిక వాపు (ఇన్‌ఫ్లమేషన్) వృద్ధాప్య వేగాన్ని మరింత పెంచుతోంది. 1.5 లక్షల మందిపై సాగిన పరిశోధనలో ‘ఫెనో ఏజ్’ అనే ప్రత్యేక అల్గారిథమ్ ద్వారా రక్తంలోని 9 కీలక బయోమార్కర్లను పరీక్షించగా, గత తరాల వారితో పోలిస్తే 1965 తర్వాత జన్మించిన వారిలో అంతర్గత అవయవాల వృద్ధాప్య వేగం ఏకంగా 23% పెరిగినట్లు తేలింది.

యువతలో ఈ వేగవంతమైన అంతర్గత వృద్ధాప్యం వల్ల మునుపెన్నడూ లేనివిధంగా 30 నుంచి 40 ఏళ్లలోపు వారికే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్స్, పక్షవాతం (స్ట్రోక్) బారిన పడుతున్నారు. అలాగే ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగు, రొమ్ము కేన్సర్ల ప్రమాదం 8% నుండి 15% వరకు పెరుగుతోంది. ముఖ్యంగా 25–30 ఏళ్ల వయసు వారిలోనే ఊబకాయం, టైప్‌–2 మధుమేహం, ఫ్యాటీ లివర్‌ సమస్యలు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, ఎముకల బలహీనత వంటి ముసలితనపు లక్షణాలు వెలుగు చూస్తున్నాయి. రక్తనాళాలు వృద్ధాప్య ప్రక్రియకు అత్యంత త్వరగా గురవుతున్నాయని, కొన్ని ప్రత్యేక వయసుల్లో ఈ వృద్ధాప్యం అకస్మాత్తుగా వేగం పుంజుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ ప్రమాదకర పరిస్థితిని నివారించడానికి, కణాలు మళ్లీ పునరుజ్జీవనం పొందేందుకు వైద్య నిపుణులు రోజువారీ జీవితంలో కొన్ని కీలక మార్పులను సూచిస్తున్నారు. ఆహారంలో విటమిన్‌–సీ, విటమిన్‌–ఈ ఎక్కువగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు, నట్స్‌ని చేర్చుకుంటూనే.. ప్రాసెస్డ్‌ ఫుడ్స్, ప్యాకెట్‌ ఫుడ్స్, పంచదార వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాలపాటు వాకింగ్, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం (మెడిటేషన్) సహాయపడుతుందని తెలిపారు. వీటితో పాటు రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర తప్పనిసరి అని, 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏటా కనీసం బ్లడ్‌ షుగర్, కొలెస్ట్రాల్, లిపిడ్‌ ప్రొఫైల్‌ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *