Skip to content
బిజినెస్ వార్తలు

రాయదుర్గం భూముల వేలం.. ముగిసిన ‘ఎస్‌బీఐ’ వివాదం.. ప్రత్యామ్నాయ స్థలానికి ఓకే చెప్పిన బ్యాంకింగ్‌ దిగ్గజం

Prajapaksham 28 Jun 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
రాయదుర్గం భూముల వేలం.. ముగిసిన ‘ఎస్‌బీఐ’ వివాదం.. ప్రత్యామ్నాయ స్థలానికి ఓకే చెప్పిన బ్యాంకింగ్‌ దిగ్గజం

Banking Giant SBI Agrees to Shift to Alternative Location

హైదరాబాద్‌ రాయదుర్గంలోని అత్యంత విలువైన భూముల వేలం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మధ్య తలెత్తిన భారీ వివాదం ఎట్టకేలకు సామరస్యపూర్వకంగా కొలిక్కి వచ్చింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిధిలోని సర్వేనంబర్‌ 83/1లో ఉన్న 6.29 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయగా, అందులో 5 ఎకరాల స్థలం తమదేనంటూ ఎస్‌బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణం కోసం అప్పట్లో ఈ స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని వేలం వేసింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వంతో ముందస్తు సంప్రదింపులు జరపకుండా ఎస్‌బీఐ నేరుగా హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం సంచలనం కలిగించింది. ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఒక దశలో ఎస్‌బీఐతో ఉన్న ప్రభుత్వ లావాదేవీలన్నింటినీ పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని, బ్యాంకు చైర్‌పర్సన్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని కూడా గట్టి నిర్ణయానికి వచ్చింది.

ఇరుపక్షాల మధ్య సంబంధాలు క్షీణించి ఇదొక పెద్ద వివాదంగా మారిన తరుణంలో రంగంలోకి దిగిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎస్‌బీఐ అధికారులతో చర్చలు ప్రారంభించారు. ఈ సంప్రదింపుల కొనసాగింపుగా సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం ఒక ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

వేలం ద్వారా ఎస్‌బీఐ కోల్పోయిన ఐదెకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా, ఆ విలువైన ప్రాంతానికి సమీపంలోనే 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని ఆఫర్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రభుత్వం చూపించిన ఈ ప్రత్యామ్నాయ స్థలాలను ఎస్‌బీఐ ప్రతినిధుల బృందం పరిశీలించి, ప్రభుత్వ ఆఫర్‌పై సానుకూలత వ్యక్తం చేసింది.

ఈ చర్చల అనంతరం ఇరుపక్షాలు ఒక సయోధ్య ,పరస్పర అంగీకారానికి వచ్చాయి. ప్రభుత్వం కేటాయించిన కొత్త స్థలాలపై తమ బ్యాంకు బోర్డు అధికారిక ఆమోదం పొందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌బీఐ ప్రతినిధులు ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు వెల్లడించారు. ప్రస్తుత కోర్టు కేసుల నిబంధనలకు లోబడి, అవసరమైన చట్టపరమైన ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసి ఈ అంశాన్ని త్వరలోనే శాశ్వతంగా ముగించనున్నారు. ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ రంగం తరఫున ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ సుల్తానియా, టీజీఐఐసీ వైస్‌చైర్మన్ కె.శశాంక పాల్గొనగా, ఎస్‌బీఐ తరఫున ఉన్నతాధికారులు జీఎస్‌ రాణా, తెలంగాణ సీజీఎం నీలేశ్‌ ద్వివేది, ఏజీఎం జి.పూవజళి హాజరయ్యారు.