Viral Video: మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారి…ఉద్రిక్తంగా మారిన జీవో 97 నిరసన..
Viral Video: మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లమీదకి జీవో 97, శక్తి స్కీం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థుల్లో ఇద్దరి గొంతు పట్టుకుని సీఐ రఘుపతి రెడ్డి నెట్టేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా శక్తి స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. “శక్తి డౌన్.. డౌన్”, “జీవో-97 రద్దు చేయాలి”, “పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి” అంటూ ఆందోళనకారులు గొంతెత్తి నినాదాలు చేశారు.
పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU)లో విలీనం చేయడం వల్ల మూడేళ్ల విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విలీనం వల్ల రాబోయే రోజుల్లో వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలు, ఉద్యోగ భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. శక్తి స్కీమ్ నెపంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను క్రమంగా ప్రైవేట్ సంస్థల పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలాంటి కొత్త స్కీమ్‌ల పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే శక్తి స్కీమ్‌ను, జీవో-97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను మునుపటిలాగే యథావిధిగా కొనసాగించాలని గట్టిగా డిమాండ్ చేశారు.నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, పోలీసు బలాన్ని ఉపయోగించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసుల బెదిరింపులకు తాము భయపడేది లేదని, ప్రభుత్వం దిగిరాకపోతే ఈ ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలతో ప్రస్తుతం జీవో 97 అంశం పెద్ద ఎత్తున చర్చల్లోకి వచ్చింది. అటు విద్యార్థులు చేపట్టిన నిరసనలకు విద్యార్థి సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తున్నట్లు గమనించవచ్చు. విద్యార్థుల పైన పోలీసులు ఈ స్థాయిలో హ్యాండిల్ చేయడం మంచిది కాదని ప్రజాస్వామ్య వాదులు హెచ్చరిస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు మైనర్లు కావున వారి పైన వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, పలువురి విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర పోలీసు శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన భవిష్యత్తులో తేలనుంది. మరోవైపు విద్యార్థులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.