ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. పదో తరగతి విద్యార్థులే డబ్బుల కోసం దారుణంగా..
Rupa Reddy Murder Case
Rupa Reddy Murder Case: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఆమె పనిచేస్తున్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసమే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 11న కొండమల్లేపల్లి మండలంలోని వేర్వేరు తండాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ముఖాలకు మాస్కులు, హుడీలు ధరించి రూపారెడ్డి ఇంటి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో ఒక విద్యార్థి ఇంట్లోకి వెళ్లి డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు సమాచారం.
అయితే రూపారెడ్డి అందుకు ప్రతిఘటించడంతో పరిస్థితి ఒక్కసారిగా విషమించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థి ధరించిన మాస్క్ తొలగిపోవడంతో అతడిని రూపారెడ్డి గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కేకలు వేయడంతో తమ గుర్తింపు బయటపడుతుందనే భయంతో వెంట తీసుకెళ్లిన కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం ఇంట్లో ఉన్న రూ.2.20 లక్షల నగదును తీసుకుని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అందులో నుంచి బయట వేచి ఉన్న మరో విద్యార్థికి రూ.40 వేలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఒక విద్యార్థి వద్ద రూ.1.60 లక్షల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆ నగదుపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. డబ్బుపై రక్తపు మరకలు ఎలా వచ్చాయని ప్రశ్నించడంతో విద్యార్థుల సమాధానాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు మరింత లోతుగా విచారించారు. చివరకు హత్యకు సంబంధించిన విషయాలను విద్యార్థులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇద్దరు విద్యార్థులు గతంలోనూ చిన్నచిన్న చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. జల్సాలకు అలవాటు పడటం, డబ్బు కోసం చోరీలు చేయడం వంటి విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనలో విద్యార్థుల పాత్ర, హత్యకు ముందు జరిగిన పరిణామాలు, నగదు దొంగతనం వెనుక పూర్తి ఉద్దేశం వంటి అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఘటనకు ముందు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, నగదు విషయంలో వారి ప్రణాళిక వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విద్యార్థి చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్‌నే డబ్బుల కోసం హత్య చేశారనే ఆరోపణలు వెలుగులోకి రావడం నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పూర్తి దర్యాప్తు అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
- Gyanesh Kumar: ఎవరీ జ్ఞానేశ్ కుమార్ కుమార్…ఆయన నేపథ్యం ఏంటి..? గతంలో ఆయనపై ఉన్న ఆరోపణలేంటి..?
- Ritika Chopra: ఎవరీ రితికా చోప్రా..? ఎన్నికల సంఘం వ్యవహారం వెలుగులోకి తెచ్చిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- Iran US Military Retreat: అమెరికా సైన్యాలు 500 కి.మీ. వెనక్కి? ఇరాన్ ఐఆర్జీసీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు
- G7 oil reserves: చమురు ధరలపై ట్రంప్‌కు షాక్.. 10 కోట్ల బ్యారెళ్ల నిల్వలు విడుదలకు జి-7 నిర్ణయం
- 22A Lands: 22ఎ భూముల యజమానులకు గుడ్‌న్యూస్.. నాలా రుసుములు చెల్లిస్తే రిజిస్ట్రేషన్లకు అనుమతి