Skip to content
బిజినెస్ వార్తలు

Loan EMI Alert: హోమ్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి అలర్ట్.. 2027 నుంచి EMIలపై RBI కీలక మార్పులు

Prajapaksham 19 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Loan EMI Alert: హోమ్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి అలర్ట్.. 2027 నుంచి EMIలపై RBI కీలక మార్పులు

RBI

Loan EMI Alert: ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో హోమ్ లోన్, ఇతర రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక మార్పులు ప్రతిపాదించింది. వడ్డీ రేట్లలో మార్పుల ప్రయోజనం లేదా భారం రుణగ్రహీతలకు మరింత వేగంగా చేరేలా కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది.

అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ముసాయిదా దశలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు రుణగ్రహీతల నెలవారీ ఈఎంఐపై ఎలాంటి తక్షణ ప్రభావం ఉండదు. ముసాయిదాపై ప్రజలు, బ్యాంకులు, ఇతర భాగస్వాములు తమ అభిప్రాయాలను 2026 సెప్టెంబర్ 11 వరకు తెలియజేయవచ్చు. ప్రతిపాదనలకు తుది ఆమోదం లభిస్తే.. కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాల వడ్డీని ఏడాదికి ఒకసారి లేదా నిర్ణీత వ్యవధిలో సవరిస్తున్నాయి. దీంతో ఆర్బీఐ రెపో రేటును తగ్గించినా.. ఆ ప్రయోజనం రుణగ్రహీతలకు చేరడానికి కొంత సమయం పడుతోంది.

కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఫ్లోటింగ్ రేట్ రుణాల వడ్డీని గరిష్ఠంగా మూడు నెలలకు ఒకసారి సవరించే విధానం రావచ్చు. అంటే రెపో రేటు తగ్గితే దాని ప్రయోజనం త్వరగా రుణగ్రహీతకు అందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆర్బీఐ వడ్డీ రేటును పెంచితే.. ఆ పెంపు ప్రభావం కూడా వేగంగా రుణగ్రహీతపై పడుతుంది.

ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్‌పై రుణం తీసుకున్నవారు ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపాదిత విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పాత రుణాలను కొత్త విధానంలోకి మార్చుకునేందుకు రుణగ్రహీతలకు 2029 ఏప్రిల్ 1 వరకు సమయం ఇవ్వనున్నట్లు ప్రతిపాదనలో పేర్కొన్నారు.

వినియోగదారుడి అంగీకారంతో, అదనపు రుసుము లేకుండా ఈ మార్పు చేసే అవకాశం ఉంటుంది. అయితే స్థిర వడ్డీ రేటుతో ఉన్న రుణాలకు ఈ ప్రతిపాదనలు వర్తించవు. ముఖ్యంగా స్థిర రేటుతో ఉన్న వ్యక్తిగత లేదా ఆటో రుణాలపై ఈ మార్పుల ప్రభావం ఉండదు.

కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారు ఏం చూడాలి?

కొత్తగా హోమ్ లోన్ తీసుకునే వారు కేవలం వడ్డీ రేటు ఎంత తక్కువగా ఉందో మాత్రమే చూడటం సరిపోదు. బ్యాంకు బెంచ్‌మార్క్ రేటుపై వసూలు చేసే అదనపు మార్జిన్‌ను స్ప్రెడ్ అంటారు. తక్కువ స్ప్రెడ్ ఉన్న రుణాన్ని ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉండొచ్చు.మీ రుణంపై వడ్డీ రేటు ఎంత తరచుగా మారుతుందో ముందుగానే తెలుసుకోవాలి. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగితే మీ నెలవారీ ఈఎంఐ ఎంత పెరగవచ్చో అంచనా వేసుకోవాలి. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ఆర్బీఐ తీసుకునే వడ్డీ నిర్ణయాల ప్రభావం రుణగ్రహీతలకు మరింత వేగంగా చేరే అవకాశం ఉంది.

అంటే కొత్త విధానం రుణగ్రహీతలకు రేటు తగ్గినప్పుడు త్వరగా ప్రయోజనం, పెరిగినప్పుడు త్వరగా భారం అనే రెండు వైపుల ప్రభావాన్ని తీసుకురావచ్చు. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటుతో పాటు స్ప్రెడ్, రీసెట్ విధానం, భవిష్యత్తులో ఈఎంఐ పెరిగే అవకాశాలను కూడా తప్పకుండా పరిశీలించడం ముఖ్యం.