Skip to content
జాతీయం వార్తలు

కమ్యూనిస్టులిప్పుడేమి చేయాలి?

Prajapaksham 28 Jun 2026 0 నిమిషాల పఠనం జాతీయం
కమ్యూనిస్టులిప్పుడేమి చేయాలి?

Justice Chandra Kumar

ఈనెల 14వ తేదీన విజయవాడలో కమ్యూనిస్టుల ఐక్యత గురించి ఒక సదస్సు జరిగింది. గతంలో అనేకసార్లు ఇలాంటి సదస్సులు జరిగినా, ఈసారి జరిగిన ఈ సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది.

కమ్యూనిస్టు ఉద్యమం గతంలో ఎన్నడూ లేనంతగా ఎదురు దెబ్బలు తిన్న కాలమిది. సుమారు 60 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం ఏకైక మార్గం అని బయలుదేరిన మావోయిస్టులు పూర్తిగా దెబ్బతిన్నారు. ఆయుధాలు వదిలి బయటకు వచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగా మార్క్సిస్టుల నాయకత్వాన ఉన్న బెంగాల్‌, కేరళ, త్రిపుర వామపక్ష ప్రభుత్వాలు పడిపోయాయి. భారతదేశంలో మార్క్సిజానికి కాలం చెల్లింది, కమ్యూనిస్టు పని అయిపోయిందని కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సదస్సు జరిగింది. ఆ సదస్సులో నేను ఒక ఉపన్యాసకున్ని.

కమ్యూనిస్టు పార్టీల అభిమానులు, కార్యకర్తలు, మేధావులు, కమ్యూనిస్టు పార్టీలన్నీ విలీనమై ఒకే సంస్థగా మారాలని కోరుకుంటున్న అభిమానులు ఆ సదస్సు నిర్వహించారు. అందరూ కమ్యూనిస్టులు తమకు మార్క్సిజం, లెనినిజం ఆదర్శం అంటారు. ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అనే ప్రఖ్యాత నినాదానికి భిన్నంగా భారత కమ్యూనిస్టులు విడిపోయి భిన్న ఆచరణ జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు.

భారత కమ్యూనిస్టులారా!

చీలిపోయిన మీరు ఇకనైనా ఒకే పార్టీగా విలీనం కండి. కలిసి ఉండటానికి 1848 ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ చాలు. కలిసిన సంస్థ మళ్లీ విడిపోకుండా ఉండటానికి లెనిన్‌ చూపిన ‘కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణ సూత్రాలు’ చాలని అనేక మంది కవులు, రచయితలు, మేధావులు కమ్యూనిస్టు నాయకులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు జరిగింది.

వామపక్షాల ఐక్యతో, వామపక్షాల సంఘటనో పరిష్కారం కాదు. కమ్యూనిస్టు పార్టీలు అన్ని విలీనమై ఒకటిగానే కొనసాగాలనే డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతుంది. ఆ సదస్సు కూడా అదే ప్రతిబింబించింది. ఇలాంటి సదస్సులు ఉభయ రాష్ట్రాలలోని ముఖ్యమైన నగరాలు మరియు అనేక ప్రాంతాలలో విరివిగా జరగాల్సిన అవసరం ఉంది.

అసలు విలీనానికి ఆటంకాలేమిటి? పార్టీలు చీలటానికి కారణాలు, ఇప్పటికీ కొనసాగుతున్న విభేదాలు పరిష్కరించకుండా ఐక్యత సాధ్యం కాదని కొన్ని పార్టీలు దాటేస్తున్నాయి. అవి పరిష్కరించబడకుండా అడ్డుపడుతుంది ఎవరో మాత్రం చెప్పరు. ఐక్యతని, విలీనాన్ని అవహేళన చేస్తూ మాట్లాడేవారు కూడా కొందరు ఉన్నారు. వారు విలీనానికి అడ్డుపడుతున్నారు. విభేదాలు పరిష్కారం కాకుండా ఎలా కలుస్తారు అని అమాయకంగానో, అతి తెలివితోనో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఏవి మిత్రభేదాలు? ఏవి శత్రు వైరుధ్యాలు? అనే విషయాల లోతుల్లోకి వెళ్తేనే ఈ సమస్య అర్థమవుతుంది. అది ఎలానో చూద్దాం.

కలవగలిగే వాటిని మిత్రభేదాలు అంటారు. కలవలేని వాటిని శత్రు వైరుధ్యాలు అంటారు. కార్మికులు, పెట్టుబడిదారుల మధ్య ఉండేది శత్రు వైరుధ్యం. రైతులు, భూస్వాముల మధ్య ఉండేది శత్రు వైరుధ్యం. సామ్రాజ్యవాదం, ప్రపంచ జనాల మధ్య ఉండేది శత్రు వైరుధ్యం. వీటి మధ్య వైరుధ్యం అంతరించేది అందులో ఏదో ఒకటి అదృశ్యమైనప్పుడు మాత్రమే. పై వాటిలో ఒకటి అభ్యుదయ శక్తి అయితే మరొకటి అభ్యుదయ నిరోధక శక్తి అవుతుంది. అభ్యుదయ శక్తి గెలిస్తే సమాజం పురోగమిస్తుంది. అభ్యుదయ నిరోధక శక్తి గెలిస్తే సమాజం తిరోగమిస్తుంది.

రైతులు, వ్యవసాయ కార్మికులు, మధ్యతరగతి రైతులు, చిన్న వ్యాపారస్తులు, వృత్తిదారులు తదితర సంపద ఉత్పత్తి క్రమంలో పాల్గొనే వారు ఉంటారు. వారి మధ్య కూడా విభేదాలు ఉంటాయి. కానీ వారి మధ్య ఉండేవి మిత్రభేదాలు మాత్రమే. అదేవిధంగా ఎస్సీలలోని వివిధ కులాల మధ్య విభేదాలు ఉంటాయి. బీసీల్లోని వివిధ కులాల మధ్య విభేదాలు ఉంటాయి. ఎస్సీ, బీసీల మధ్యలో విభేదాలు ఉంటాయి. కానీ వీటి మధ్య ఉండేవి కూడా మిత్రభేదాలే. ఎస్సీ, బీసీలను కలిపి బహుజనులందాం. వీరందరికీ బ్రాహ్మణిజంతో ఉండే వైరుధ్యం మాత్రమే శత్రు వైరుధ్యం.

ఈ వైరుధ్యాలన్నింటిని సృష్టించింది దోపిడీ వర్గాలే. శత్రు వర్గాల మధ్య ఘర్షణ అనివార్యం. ఆ ఘర్షణ ద్వారా సమాజం పురోగమిస్తే దానిని ఆహ్వానించాలి. త్యాగాలు చేసైనా ఆ క్రమాన్ని వేగవంతం చేయాలి. మిత్రుల మధ్య భేదాలను ఘర్షణ రూపంలో కాకుండా సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. శత్రువులు వీటిని భూతద్దంలో చూపించి శత్రు వైరుధ్యంగా మార్చాలని ప్రయత్నిస్తుంటారు. వీరి మధ్య అనైక్యతను పెంచి తమ దోపిడీ వ్యవస్థను కాపాడుకుంటారు. కమ్యూనిస్టు పార్టీల చీలికను సమర్థించే వారెవరైనా తిరిగి పునరేకీకరణ జరగాలనే ప్రయత్నాలను వ్యతిరేకించడం మార్క్సిజం ఎలా అవుతుంది?

కమ్యూనిస్టు పార్టీలను చీల్చింది, చీల్చుతుంది మాత్రం దోపిడీ వర్గాలు కాదు. సామ్రాజ్యవాదులు కాదు. భూస్వాములు కాదు. పెట్టుబడిదారులు కాదు. బూర్జువా రాజకీయ పార్టీలు కాదు. కార్పొరేట్‌ సంస్థలు కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి మతోన్మాద శక్తులు కాదు. కమ్యూనిస్టు పార్టీలను చీల్చుతుంది కమ్యూనిస్టు పార్టీల అగ్ర నాయకులేనని ప్రజలు నమ్ముతున్నారు.

కమ్యూనిస్టు పార్టీలంటే సాధారణ ప్రజలకు అభిమానమే తప్ప వ్యతిరేకత ఉండదు. కమ్యూనిస్టు అభిమానులు చీలిక పేలికలైన గ్రూపులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే పార్టీగా విలీనం కావాలని కోరుకుంటున్నారు. అన్ని కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, కార్యకర్తలు, కింది కమిటీల నాయకులంతా మార్క్సిజం విశ్వసించేవారంతా విలీనమై దేశంలో ఒకే కమ్యూనిస్టు పార్టీగా ఉండాలని కోరుకుంటున్నారు.

దేశంలోని కమ్యూనిస్టు పార్టీలకు ఉన్న ప్రజాసంఘాల సభ్యులు, కార్యకర్తలు తక్కువేమీ కాదు. కోట్లలో ఉంటారు. కమ్యూనిస్టు పార్టీలు వీరి మధ్యలో సయోధ్యను పెంచే బదులుగా శత్రుత్వాన్ని పెంచుతూ ఉంటారు. వీరు ఒకరినొకరు శత్రువులుగా భావించుకొని ఒక సంఘం మరొక సంఘంపై దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది. ఒకరు మరొకరిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంటారు.

ఎన్నికల సమయంలో ఈ సంఘ సభ్యులలో అత్యధికులు తమ మాతృ పార్టీకి ఓటు వేయరు. చీలిపోయిన ఈ పార్టీలు గెలవలేవు, తమ ఓటు వృథా అవుతుందనే భావనలో ఉంటారు. ప్రజలందరిని సమీకరించటానికి పార్టీని పెడుతున్నామని అన్ని కమ్యూనిస్టు పార్టీలు చెపుతాయి. కానీ ఆచరణలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు ప్రజలను చీల్చటానికి, మళ్లీ తిరిగి శాశ్వతంగా కలవకుండా ఉండేలాగా ఆర్గనైజ్‌ చేస్తున్నారేమో అనిపిస్తుంది.

చీలిపోవటానికి, చీలికలు కొనసాగటానికి కావలసిన సిద్ధాంతాలను సృష్టిస్తున్నారు కానీ విలీనానికి కావలసిన సిద్ధాంతాలను సృష్టించలేకపోతున్నారు. కలవాలి అనుకున్నప్పుడు ఎదుటివారితో ఉండే సామీప్యాలను వెతకాలి. వేరుగా ఉండాలనుకున్నప్పుడు విభేదాలను వెతకాలి. ఇప్పుడు భారత కమ్యూనిస్టులు చేస్తున్నది అదేనా? అని అనిపించడం సహజం.

ఎంతో విజ్ఞానము, స్థాయి, పరిపక్వత ఉన్న కమ్యూనిస్టు నాయకులే కలవలేకపోతున్నారు. ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల, భాషల, మతాల, జాతులతో నిండి ఉన్న దేశాలలోని కార్మికులంతా ఐక్యం కావటం ఎలా సాధ్యం అని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. దానికి తగ్గట్టే భారత కమ్యూనిస్టులు చీలికలు పేలికలై మార్క్స్‌ ప్రఖ్యాత నినాదం ‘ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి’ తప్పని ఆచరించి చూపుతున్నట్లు అవుతుంది.

భారత కమ్యూనిస్టులారా, చీలిపోయిన మీరు ఇకనైనా ఒకే పార్టీగా విలీనం కండి. కలిసి ఉండటానికి 1848 ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ చాలు. కలిసిన సంస్థ మళ్లీ విడిపోకుండా ఉండటానికి లెనిన్‌ చూపిన ‘కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణ సూత్రాలు’ చాలని గమనించండి.

కమ్యూనిస్టు ప్రణాళికలో ఉన్న వాటికి తోడు ఏమైనా జత చేయాలనుకుంటే చేయవచ్చు. ఏవైనా తగ్గించాలంటే తగ్గించవచ్చు. అది కొత్తగా విలీనమై ఏర్పడిన పార్టీ కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణ సూత్రాల ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. లెనిన్‌ అనేక అనుభవాల ద్వారా భిన్నాభిప్రాయాలు పార్టీలో వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవటానికి ఏర్పాటు చేసిందే ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణ సూత్రం.

వివిధ పార్టీల కమ్యూనిస్టు నాయకులు తమ అహంభావాలు, ‘ఇగో’లు వదిలి ఒక పార్టీగా విలీనమైతే సానుభూతిపరులు, ప్రజాసంఘాల సభ్యులు, అభ్యుదయ మేధావులు అందరూ కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. కమ్యూనిస్టు పార్టీకి ఓటర్లుగా మారతారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోతారు. దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. రోజురోజుకు పెరుగుతున్న ఫాసిస్ట్‌ శక్తులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యపరచటంలో కీలక పాత్ర వహించగలుగుతుంది.

విలీనం లక్ష్యంగా కృషి ప్రారంభం కావాలి. విలీనం తక్షణమే అవుతుందని భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ దానికంటే ముందు వామపక్ష ఐక్య సంఘటన ఏర్పడాలి. ఆ సంఘటన ద్వారా ప్రజల తక్షణ సమస్యల మీద నిరంతరం పోరాటాలను నిర్వహిస్తూ ఉండాలి. ఆ క్రమంలో విలీనానికి బాటలు వేయాలి.

వంద సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు, మున్ముందుకు పోతుంటే 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ వెనుకకు, మరింత వెనుకకు వెళ్తుంది. కమ్యూనిస్టు పార్టీలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, అనైక్యత ఫలితంగా మార్క్సిస్టు మౌలిక సిద్ధాంతాలే విఫలమయ్యాయనే ప్రచారం కమ్యూనిస్టు వ్యతిరేకులు కొనసాగించటానికి అవకాశాన్ని ఇస్తున్నారు.

భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీలు వైఫల్యమైనంత మాత్రాన మార్క్సిజం వైఫల్యం అయినట్లు కాదు. మార్క్సిజం ఒక అజేయమైన సిద్ధాంతం. ఒక శాస్త్రం. కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరుపుకొని ఫాసిస్ట్‌ శక్తుల నుండి దేశాన్ని రక్షించి, సోషలిస్టు వ్యవస్థను నిర్మించాలి. అప్పుడే మార్క్సిజమే సరైనదని, మార్క్సిజానికే భవిష్యత్తు ఉందని చాటిచెప్పినట్టు అవుతుంది. అందుకు కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇప్పుడైనా తీవ్రంగా ఆలోచించాలని విజ్ఞప్తి.