నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా అట్టర్ ఫ్లాప్ షో.. బీజేపీపై విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud Says Congress Will Win 100 Seats in Next Elections
తెలంగాణలో బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ పర్యటనపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఘాటు విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పర్యటనను ఒక “ఫ్లాప్ షో”గా అభివర్ణించిన ఆయన.. బీజేపీ వైఖరిని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ బీజేపీ నాయకులు కనీసం ఒక చిన్న స్థాయి సమావేశాన్ని కూడా సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నారని, అలాంటి స్థితిలో రాబోయే జీహెచ్‌ఎంసీ (మున్సిపల్) ఎన్నికల్లో గెలుస్తామని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.
బూత్‌లు గెలుస్తాం, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం అని చెప్పే ముందు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను (గ్రౌండ్ రియాలిటీ) చూసుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు బీజేపీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలను స్పష్టంగా తిరస్కరించారని ఆయన గుర్తుచేశారు.
హైదరాబాద్ నగరాభివృద్ధి గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని విమర్శిస్తూ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మాట్లాడే ముందు హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న అన్ని రకాల అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నప్పటికీ, కేంద్రం పరిధిలోని సీబీఐ ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదో నితిన్ నబీన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో బెంగాల్ తరహా మత విభజన రాజకీయాలు సాగవని ఈ సందర్భంగా హెచ్చరించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజల జీవితాలను మార్చే అభివృద్ధి ప్రణాళికలు ఏవీ లేవని, కేవలం నగరాల పేర్లు మార్చడంపైనే ఆ పార్టీ దృష్టి పెడుతోందని దుయ్యబట్టారు. సుష్మా స్వరాజ్‌పై తమకు పూర్తి గౌరవం ఉందని చెబుతూనే, రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. వారసత్వ రాజకీయాలను నిత్యం విమర్శించే బీజేపీ, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఇతర పార్టీల వారసత్వ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, అలాగే తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల వంటి అసలు సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీజేపీ “జాతీయవాదం” అనే ముసుగును వాడుకుంటోందని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.