Skip to content
సంపాదకీయం వార్తలు

Editorial: జి రామ్‌ జి భారం రాష్ట్రాల నిరసన

Prajapaksham 29 Jun 2026 0 నిమిషాల పఠనం సంపాదకీయం
Editorial: జి రామ్‌ జి భారం రాష్ట్రాల నిరసన

ఫైల్ చిత్రం

యూపీఏ ప్రభుత్వం గ్రామీణులకు హామీపూర్వక ఉపాధి కల్పిస్తూ తెచ్చిన, సామాజిక ఆడిట్‌ కింద అమలు చేస్తున్న ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టాన్ని’ రద్దుచేసి, దాని స్థానంలో, మోడీ ప్రభుత్వం 2025 డిసెంబర్‌లో ఏకపక్షంగా ఆమోదించిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌, గ్రామీణ్‌ (విబి రామ్‌ జి) బుధవారం నుంచి అమలులోకి రానుంది.

జనంచేత రామజపం చేయించే ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశం మెలికలు తిప్పిన ఆ పథకం నామకరణంలోనే విదితమవుతున్నది. మహాత్మాగాంధీ పేరుతోపాటు పాత చట్టం తెచ్చిన కాంగ్రెస్‌ పేరును పేదల మనస్సులనుంచి చెరిపివేసే ఉద్దేశం కూడా ఆ నామకరణం వెనుక గోచరిస్తున్నది.

గ్రామీణ పేదలకు ఎంతో కొంత మేలు చేస్తూ పనులు దొరకని కాలంలో కోరిన వారికి ఉపాధి కల్పనను చట్టబద్ధం చేయటం రాజ్యాంగహితం, చరిత్రాత్మకం. ఆ చట్టం అమలును, ఆచరణను మెరుగుపరిచే ప్రభుత్వం పేదల అనుకూల ప్రభుత్వం అనిపించుకుంటుంది. కాని తీపిమాటలతో చేదు గుళికలు మింగించజూస్తున్నది మోదీ చట్టం.

మోదీ అధికారం చేపట్టినాక ఉపాధి హామీ చట్టం కింద పనికల్పించే దినాలు తగ్గిపోయాయి, బడ్జెట్‌ కేటాయింపులు కోతకు గురైనాయి. ఆ చట్టం పూర్తిగా వేతనాలను కేంద్రప్రభుత్వం భరించే నిర్దేశన చేసింది. సామాగ్రి కొనుగోలు వ్యయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని మరిచిపోరాదు. అది మొత్తం ఖర్చులో 10 శాతం ఉంటుంది.

సోనియాగాంధి నేతృత్వం వహించిన యూపీఏ ప్రభుత్వ సలహామండలి అనేక మాసాలపాటు రాష్ట్ర ప్రభుత్వాలతో, పౌర సమాజ సంస్థలతోపాటు గ్రామీణ పేదల వర్గ సంఘాలతో చర్చలు జరిపి ఆ ఉపాధి హామీ చట్టాన్ని ప్రతిపాదించగా డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం దానికి పార్లమెంటు ఆమోదం పొందింది. 2005 ఆగస్టు 25న పార్లమెంటు ఆమోదించిన నరేగా 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. 2009లో ఆ పేరుకు ముందు మహాత్మాగాంధీ పేరు చేర్చారు. అది యూపీఏ ప్రభుత్వం వామపక్షాలపై ఆధారపడిన కాలం అని మరువరాదు. వామపక్షాల ఒత్తిడివల్ల కాంగ్రెస్‌ అయిష్టంగానైనా ఆమోదించిన కొద్ది చట్టాల్లో ఇదొకటి.

ఏదైనా నిర్మాణం చేయాలంటే ఎంతో కష్టపడాలి. ధ్వంసం చేయటానికి సంకల్పం చాలు. మోదీ ప్రభుత్వం అదే చేసింది. ఎంజినరేగా చట్టబద్ధంగా ఇచ్చిన హక్కు కాగా జి రామ్‌ జి కేంద్రప్రభుత్వ పథకం. కేంద్రం పనుల నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలనుంచి లాగేసుకుని ఆ నిర్ణయాధికారాన్ని తన చేతికి తీసుకుంది.

125 రోజులు పని హామీ ఊరిస్తున్నా గ్యారంటీ లేదు. ఆచరణలో ఇప్పుడు అమలు జరుగుతున్న 50 రోజుల పనిని 125కు పెంచాలంటే బడ్జెట్‌ పెంచాలి. అదేమీ లేదు. పైగా ఇంతకుముందు కేంద్రం మధ్య 90:10గా ఉన్న వ్యయంలో 40 శాతం రాష్ట్రాల నెత్తికెత్తింది. అసలే అప్పులతో మూలుగుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేక అవస్థలు పడుతున్న రాష్ట్రాలు 40 శాతం భరించటమంటే, ఆచరణలో ఉపాధి కల్పన దినాలు కుదింపునకు దారితీస్తుంది.

జి రామ్‌ జి చట్టం తెచ్చినపుడు నోరెత్తని బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఇప్పుడు అసమ్మతి వ్యక్తం చేస్తున్నాయి. బిహార్‌, మధ్యప్రదేశ్‌ సహా కనీసం 5 రాష్ట్రాలు వేతన రేట్లు పెంపుదల కోరటంతోపాటు, 40 శాతం వ్యయం భరించలేమని గ్రామీణ మంత్రిత్వశాఖకు చెప్పాయి. మధ్యప్రదేశ్‌కు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలుబడి సాగించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రస్తుతం ఆ శాఖ మంత్రిగా ఉన్నారు.

వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే మాసాల్లో వ్యవసాయానికి కూలీలను లభ్యం చేసే పేరుతో 60 రోజులపాటు గ్రామీణ పేదలకు పనుల నిలుపుదల నిబంధనను కనీసం 4 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. వేతనాల చెల్లింపులో విపరీత జాప్యాన్ని చట్టం ఆమోదం అనంతర చర్యల్లో పాల్గొన్న 13 రాష్ట్రాలు దాదాపు ఏకగ్రీవంగా వ్యతిరేకించాయి. రాష్ట్రాలవారీ కేటాయించిన ధనాన్ని చూస్తే 125 రోజుల పనిహామీలో సగంతో సరిపెట్టుకోవలసిందే.

ఈ సమాచారం ప్రతిపక్షాల ఆరోపణ కాదు. సమాచార హక్కు చట్టం కింద చక్రధర్‌ అనే ఆర్‌టీఐ కార్యకర్తకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానంలోని సమాచారం.

కొత్త చట్టం అమలు కోసం కేంద్రం ప్రచురించిన 8 రూల్స్‌లో ఆదేశాలు జారీ చేసే కేంద్రప్రభుత్వ దృక్పథం తప్ప గ్రామీణ పేదలపట్ల సానుభూతి మచ్చుకైనా కానరాదు. కనీసం వారి సంఘాలతో చర్చించిన పాపానపోలేదు. అనేక సందర్భాల్లోవలె ఈ ధోరణి ఫెడరల్‌ సూత్రాలను ఉల్లంఘిస్తున్నది.

రాష్ట్ర అధికారాలను కేంద్రం చేతిలోకి తీసుకుని, గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రను బలహీనపరిచే జి రామ్‌ జి పలు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారని, అందువల్ల కేరళ, కర్నాటక ప్రభుత్వాలతో చర్చించి అవసరమైతే న్యాయపోరాటానికి తెలంగాణ సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాలను ఇప్పటికే కేంద్రానికి పంపింది.

పాత చట్టాన్ని పునరుద్ధరించాలని ప్రజాసంఘాలు, కొన్ని పార్టీలు, ప్రభుత్వాలు కోరుతున్నా అది ఇప్పటికే రద్దుల పట్టులో చేరింది. ఇష్టమున్నా లేకున్నా కొత్త చట్టాన్ని అమలు జరపక తప్పని స్థితిలో రాష్ట్రాలు ఉన్నాయి. అందువల్ల కేంద్రప్రభుత్వం తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లనే మొండివైఖరి మానుకుని, రాష్ట్రాల అభిప్రాయాలను మరోసారి పరిశీలించి సానుకూల నిర్ణయాలు తీసుకోవటం అవసరం.

ముఖ్యంగా వ్యయ పంపిణీని పాత చట్టం పద్ధతిలో 90:10కి మార్చినపుడే కొత్త చట్టం అమలు సాధ్యం. అలాగే చేపట్టే పనుల నిర్ణయాన్ని రాష్ట్రాలకు అప్పగించటం, ఆయా రాష్ట్రాల్లోని కనీస వేతన చట్టాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి హామీ శ్రామికుల వేతనాలు నిర్ణయించటం ఎంతైనా న్యాయం. ఈ పథకం కింద చేపట్టే పనులు మరింతగా ఉత్పాదకతకు, గ్రామీణ వసతుల వృద్ధికి దోహదం చేసేవిగా ఉన్నప్పుడే వెచ్చించే ప్రజాధనానికి సార్థకత.

ట్యాగ్‌లు: editorial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *