మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు.. 65 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష విధించిన ప్రత్యేక పోక్సో కోర్టు
Death Sentence for 65-Year-Old Convict in Shocking Pune Crime
మహారాష్ట్రలోని పూణె జిల్లా నస్రాపూర్ గ్రామంలో మూడేళ్ల పసికందుపై జరిగిన అమానవీయ హత్యాచారం కేసులో ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన 65 ఏళ్ల వృద్ధుడు భీమ్‌రావ్ ప్రభాకర్ కాంబ్లేను దోషిగా నిర్ధారిస్తూ.. అతనికి మరణశిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.ఆర్. సలుంఖే సోమవారం సంచలన తీర్పు ఇచ్చారు. సమాజ అంతరాత్మను సైతం కలచివేసిన ఈ దారుణ ఘటనపై కేవలం 55 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడం విశేషం.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. వేసవి సెలవుల కోసం నస్రాపూర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చిన 3.5 ఏళ్ల చిన్నారి మే 1వ తేదీన ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో నిందితుడు భీమ్‌రావ్ కాంబ్లే ఆ పసిపాపకు తినుబండారాలు కొనిచ్చి, పశువుల పాకలో కొత్తగా పుట్టిన పసి దూడను చూపిస్తానని నమ్మించి తీసుకెళ్లడం కనిపించింది.
ఆ తర్వాత అక్కడి షెడ్‌లోకి తీసుకెళ్లి ఆ చిన్నారిపై దాదాపు 40 నిమిషాల పాటు అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక గట్టిగా అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి, ఛాతిపై తీవ్రంగా గాయపరిచి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని పశువుల పాకలోని పేడ కుప్ప కింద దాచిపెట్టాడు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆ చిన్నారి శరీరంపై ఏకంగా 18 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది.

ఈ ఘటనపై తీవ్ర ప్రజా నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ఈ కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. పూణె రూరల్ ఎస్పీ సందీప్‌సింగ్ గిల్ పర్యవేక్షణలో పోలీసులు అహోరాత్రులు శ్రమించి కేవలం 15 రోజుల్లోనే అన్ని కీలక డిఎన్‌ఏ (DNA), ఫోరెన్సిక్ మరియు సాంకేతిక ఆధారాలను సేకరించి, 55 మంది సాక్షుల వాంగ్మూలాలతో కూడిన 1,200 పేజీల వివరణాత్మక ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. మే 21 నుండి పూణె సెషన్స్ కోర్టులో ఈ కేసుపై ‘ఇన్-కెమెరా’ (రహస్యంగా) రోజువారీ విచారణ (Day-to-day trial) సాగింది.
ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ మిసార్ వాదిస్తూ.. నిందితుడికి గతంలోనూ ఇటువంటి లైంగిక నేరాల చరిత్ర ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసు సుప్రీంకోర్టు నిర్వచించిన ‘అరుదైన వాటిలోకెల్లా అరుదైన’ (Rarest of Rare) వర్గంలోకి వస్తుందని స్పష్టం చేస్తూ మరణశిక్ష విధించాలని కోరారు. నిందితుడి వయసు (65 ఏళ్లు) దృష్ట్యా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్న డిఫెన్స్ లాయర్ అభ్యర్థనను న్యాయమూర్తి పూర్తిగా తిరస్కరించారు.
తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఎస్.ఆర్. సలుంఖే తీవ్రంగా స్పందిస్తూ.. ఈ నేరంలోని క్రూరత్వానికి ఎలాంటి కనికారం లేదా ఉదారత చూపే ఆస్కారమే లేదు. నిందితుడు తన కామ వాంఛ కోసం పసిపాపను బలితీసుకున్న తీరు, ఆపై మృతదేహాన్ని దాచిపెట్టిన విధానం అత్యంత బార్బరిక్ (పాశవికం). ఇటువంటి వ్యక్తి సమాజానికి తీవ్ర ముప్పు, ఇతనిలో ఎలాంటి పశ్చాత్తాపం గానీ, మారే అవకాశం గానీ కనిపించడం లేదు. సమాజానికి సరైన సందేశం వెళ్లాలంటే ఉరిశిక్షే సరైన మార్గం” అని వ్యాఖ్యానిస్తూ ‘మరణం సంభవించే వరకు ఉరితీయాలని’ ఆదేశించారు. నేరం జరిగిన 55 రోజుల్లోనే, నిందితుడు దోషిగా తేలిన (జూన్ 25న) నాలుగు రోజుల వ్యవధిలోనే కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు కోర్టు హాల్‌లోనే భావోద్వేగానికి గురై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.