Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Vijayawada: ఇంటి పరువు.. రోడ్డున పడేసిన కేశినేని బ్రదర్స్

Prajapaksham 01 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Vijayawada: ఇంటి పరువు.. రోడ్డున పడేసిన కేశినేని బ్రదర్స్

విజయవాడలో భగ్గుమంటున్న రాజకీయం కేశినేని చిన్ని వర్సెస్ నాని ( AI generated Image)

విజయవాడలో రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతోంది. కేశినేని సోదరుల మధ్య మొదలైన వైరం ఆధిపత్య పోరుగా మారి బెజవాడ రాజకీయాలను వేడెక్కిస్తోంది. తాజాగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గడచిన కొన్ని నెలలుగా సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు, కౌంటర్లతో రెచ్చిపోతున్నారు. అటు ఎంపీ కేశినేని చిన్ని పైన మాజీ ఎంపీ కేశినేని నాని తాజాగా ఈడీకి ఫిర్యాదు చేయగా, దానికి కౌంటర్‌గా నాని పైన చిన్ని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంపీ చిన్ని తన బినామీల పేర్లతో లబ్ధి పొందుతూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అలాగే విజయవాడ ఉత్సవ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాల్లో తీవ్రమైన అవినీతి ఆరోపణలను చిన్ని ఎదుర్కొంటున్నారని నాని ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేయడం విజయవాడ రాజకీయాల్లో కాక రేపింది. దీనికి ప్రతీకారంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. నాని ఆరోపణల పైన ఎంపీ చిన్ని ఘాటుగా స్పందిస్తూ విజయవాడ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సుమారు 120 కోట్ల రూపాయల భారీ బ్యాంకు కుంభకోణం బయట పెడుతూ ఆయన మాజీ ఎంపీ కేశినేని నాని పైన సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని నాని సూత్రధారిగా 2016-17 సంవత్సరాల మధ్య కాలంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారని, వాటిని చెల్లించకుండా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా మార్చేశారని చిన్ని ఆరోపించారు.

గడచిన 11 సంవత్సరాలుగా బ్యాంకు అధికారులు నాని పైన చర్యలు తీసుకోవట్లేదని, దీని వెనక ఒక పెద్ద లాలూచీ ఉందని, ఇంకా అనేకమంది సూత్రధారులు కూడా ఉన్నారని చిన్ని సంచలన ఆరోపణలు చేస్తూ నాని పైన తన కౌంటర్ ఎటాక్ ఎక్కుపెట్టారు. ఈ అక్రమ పనుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీతో చేతులు కలిపి కేసుల నుంచి తప్పించుకోవాలని నాని చూశాడని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. ప్రస్తుతం నాని నివసిస్తున్న ఇల్లు, అలాగే ఆయన హోటల్ సాంకేతికంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఆధీనంలో ఉన్నాయని ఈ సందర్భంగా కేశినేని చిన్ని ఒక బాంబు పేల్చడంతో ఒకసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అంతేకాదు కేశినేని నాని దేశంలోనే దిగ్గజ వ్యాపారవేత్త అయిన రతన్ టాటాను సైతం మోసం చేశాడని, బ్యాంకులో కొదవ పెట్టిన ఆస్తిని టాటా సంస్థకు చెందిన వెస్ట్‌సైడ్ కంపెనీకి అద్దెకు ఇచ్చారని ఈ సందర్భంగా చిన్ని పలు డాక్యుమెంట్లతో ఆరోపణలు చేశారు.

అంతేకాదు తాను అద్దెకు ఇచ్చిన ఆస్తి పైన ఎలాంటి అప్పులు లేవని టాటా కంపెనీకి చెందిన వెస్ట్‌సైడ్ సంస్థను మోసం చేస్తూ వారి నుంచి మూడు కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నారని, ప్రతి నెల 18 లక్షల రూపాయల వరకు అద్దెలు వసూలు చేస్తున్నారని చిన్ని సంచలన ఆరోపణలు చేశారు.

అయితే ఎంపీ కేశినేని చిన్ని ఆరోపణల పైన నాని కూడా స్పందిస్తూ ప్రభుత్వ భూములను ఒక ప్రముఖ కంపెనీకి కట్టబెట్టడాన్ని తాను సీఎంకు లేఖ రాసి అడ్డుకోవడంతోనే ఫ్రస్టేషన్‌లో తనపై తప్పుడు కేసులు పెట్టిస్తూ కేశినేని చిన్ని అసహనంతో ఉన్నారని నాని ఆరోపణ చేశారు. అంతేకాదు తాను ఎంపీగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన ప్రజా సంపదను కాపాడాలని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఏమాత్రం తగ్గేదే లేదని నాని సవాల్ విసిరారు. అయితే ఈ అన్నదమ్ముల మధ్య సవాళ్లు బెజవాడ రాజకీయాన్ని మరింత హీట్ పుట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కేశినేని బ్రదర్స్ బెజవాడ రాజకీయాల్లో పుట్టించిన ఈ మంటలు ఎటువైపు దారితీస్తాయో ఎదురు చూడాల్సిందే.

ట్యాగ్‌లు: TDP Vijayawada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *