Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ఓటర్లూ, మేల్కోండి!

Prajapaksham 19 Aug 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఓటర్లూ, మేల్కోండి!

Election Commission

ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్‌ఐఆర్‌ రాజ్యాంగం హామీ ఇచ్చినట్లు వయోజనులందరికీ ఓటు హక్కు కలుగజేయటం కాదనీ, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటునూ తొలగించం అంటూనే ప్రతి రాష్ట్రంలో పదుల లక్షల సంఖ్యలో ఓటర్లను ఇతర కారణాలు చూపి ఓటు నమోదు రిజిస్ట్‌ నుంచి తొలగిస్తూ ప్రజలను ముప్పతిప్పలు పెట్టటమేనని మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సిఇఒ) సి.సుదర్శన్‌రెడ్డి సోమవారం విడుదలచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాయే ఇందుకు తాజా సాక్ష్యం. 92 లక్షలమందికి నోటీసులు జారీ చేస్తామన్నారు. 2026 ఆగస్టు 10 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వారిలో 2,64,87,213మంది (78.30 శాతం) ఎన్యూమరేషన్‌ దశలో తమ ఎన్యూమరేషన్‌ ఫార్మ్‌ సమర్పించారు. అంటే 73,39,235 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. తొలగించబడిన 21శాతం ఓటర్లలో 9,22,229 మంది చనిపోయినట్లు గుర్తించారు. నగరాలు, పట్టణాల్లో నివాస ప్రదేశాలు మారటం, వలస వెళ్లటం సర్వసాధారణం కాబట్టి 57,46,803 మంది ఓటర్లు (16.99శాతం) శాశ్వతంగా మకాం మార్పు, జాడ తెలియదు, ఇతర కారణాలు జాబితాలో చేర్చారు. 6,70,203 మంది (1.98 శాతం) ఓటర్లు పెక్కు ప్రదేశాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నట్లు లెక్కలో చేర్చారు.
92లక్షలమందికి నోటీసు జారీ చేయటం జరిగే పనేనా? ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ, ఇంటింటి సర్వే ద్వారా వాటిని భర్తీ చేయటం లో ఎన్నికల కమిషన్‌ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. నోటీసులు జారీ చేశారని వాదనకోసం అంగీకరించినా 28రోజుల్లో (సెప్టెంబర్‌ 16వరకు) వారు క్లెయిములు, అభ్యంతరాలు దాఖలు చేయటం జరిగే పనేనా? ఆగస్టు 17 నుంచి అక్టోబరు 15వరకు ఆ ఫార్మ్‌ను అధికారులు స్క్రూటినీ చేస్తారు. రోజుకు 24గంటలు పనిచేసినా ఇన్ని లక్షల పత్రాలు (అన్నీ నిజంగా తిరిగి వస్తే) పరిశీలించగలరా? ఇది అసాధ్యమని అధికారులకు తెలుసు. అందుకే ఓటర్ల ఆగ్రహానికి గురికాకుండా అక్టోబర్‌ 19న ప్రచురించే ఓటర్ల ‘తుది జాబితాలో మీ పేరు లేకపోయినా ఆందోళన చెందకండి. ఫారం 6 సమర్పించి కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ ఫారానికి నిర్దేశించిన డాక్యుమెంట్లు జత చేయాలి.
సిఇఓ ఇచ్చిన వివరణ ప్రకారం, 60,50,918మంది ఫార్మ్‌లో అనామలీస్‌/తార్కిక వ్యత్యాసాలు ఉన్నాయి. 32,36,659 మంది 2002 ఓటర్ల జాబితానుంచి తమ వివరాలు పూర్తి చేయలేదు. ఈ రెండు కేటగిరీల్లోని 92,87,577 మందికి నోటీసులు జారీ చేస్తారు. బిఎల్‌ఒ ద్వారానే నోటీసులు అందుతాయి, సమాధానం కూడా బిఎల్‌ఒ ద్వారానే పంపాలి. వాటిలో అనుమానాలుంటే ఇఆర్‌ఒ లేదా అసిస్టెంట్‌ ఇఆర్‌ఒ ఓటరుకు ఫోన్‌ చేస్తారట. వ్యక్తిగత హియరింగ్‌లుండవు. వీటి పరిష్కారాన్ని బట్టి తుది ఓటర్లు సంఖ్య పెరగనూవచ్చు, తరగనూ వచ్చు.
2022 నాటి ఓటర్ల జాబితాలో సంబంధీకుల వివరాలు చేర్చాలనే నియమమే అత్యధిక ఓట్ల తొలగింపుకు కారణం. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదులో, వయస్సు, తల్లిదండ్రుల పేర్లు, ఇంటిపేర్లు, వయసు నమోదులో ఎన్ని తప్పులుంటాయో ఓటర్లకు అనుభవమే. అంతేగాక ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో వార్డుల్లో కొన్ని బస్తీలు మొత్తంగా /పాక్షికంగా లేచిపోవటమూ అనుభవమే. ఓటరు గుర్తింపు కార్డులుండీ, ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవటం సర్వ విదితం. ఈ లోపాలు, తప్పులన్నిటికీ ఎన్నికల కమిషన్‌ ఓటర్లను బాధ్యుల్ని చేస్తున్నది. అనామలీస్‌ పత్రాలన్నీ పరిష్కరించటం దుర్లభమని బిహార్‌, బెంగాల్‌ ఎన్నికల్లో చూశాం.
అసోం సహా ఆ రెండు రాష్ట్రాల్లో దళితులు, ముస్లింలు ముఖ్యంగా మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు కోల్పోయారు. అది ఎన్నికల్లో బిజెపికి లాభించిందని జనవాక్యం. అటువంటి దుర్భాగ్యులకు రేషన్‌ తదితర సంక్షేమ చర్యలను ఆ ప్రభుత్వాలు ఎగనామం పెట్టి వేధిస్తున్నాయి. అందువల్ల, తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ప్రమాదం ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలు అప్రమత్తం కావాలి. పోలింగ్‌ బూత్‌లవారీ నోటీసులు జారీ అయిన ఓటర్ల జాబితా తీసుకుని ఇంటింటికీ తిరిగి అందుబాటులో ఉన్న ఓటర్ల చేత సమాధానాలు పూర్తి చేయించాలి లేదా ఫారం 6 తీసుకుని కొత్త ఓటర్లుగా చేర్పించాలి. ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల అనంతరం చింతించినా నిష్ప్రయోజనం.

ట్యాగ్‌లు: editorial SIR SIR News Today news