Skip to content
జాతీయం › వార్తలు

Dharapuram Bypoll: సత్యభామ కాదు.. ‘సూట్‌కేస్’ భామ.. టీవీకే మహిళా అభ్యర్థిపై స్టాలిన్ వ్యాఖ్యలు.. తమిళనాడులో రాజకీయ దుమారం..

jagan 03 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Dharapuram Bypoll: సత్యభామ కాదు.. ‘సూట్‌కేస్’ భామ.. టీవీకే మహిళా అభ్యర్థిపై స్టాలిన్ వ్యాఖ్యలు.. తమిళనాడులో రాజకీయ దుమారం..

stalin vs tvk

Dharapuram Bypoll: తమిళనాడులో ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం రాజకీయ వివాదానికి దారితీస్తోంది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. టీవీకే అభ్యర్థి పి. సత్యభామపై చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. సత్యభామను ‘పెట్టీ భామ’, ‘సూట్ కేస్ భామ’ అంటూ ప్రస్తావిస్తూ ఆమె శరీరాకృతిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని టీవీకే నేతలు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను టీవీకే మంత్రులు ఖండించి, స్టాలిన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ధారాపురంలో డీఎంకే అభ్యర్థి ఎస్. సుగన్యకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన ప్రచార సభలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్యభామ ధారాపురం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా గెలిచారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ధారాపురం స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఆమె అదే నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

సత్యభామ పార్టీ మారడంపై డీఎంకే గతంలోనే ఆరోపణలు చేసింది. డబ్బు ప్రలోభాలతోనే ఆమె అన్నాడీఎంకేను వీడి టీవీకేలో చేరారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్ ఆమెను ‘సూట్‌కేస్ భామ’గా, ‘సోమర్‌సాల్ట్ భామ’గా పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆమె శరీరాకృతిని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి.

స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే ఆరోగ్యశాఖ మంత్రి కే.జీ. అరుణ్‌రాజ్ తీవ్రంగా స్పందించారు. సత్యభామను లక్ష్యంగా చేసుకుని ఆమె శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయడం మహిళలను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. అలాగే ఆమె దళిత మహిళా అభ్యర్థి కావడంతో చేసిన వ్యాఖ్యలను మహిళలు, దళిత సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన పేర్కొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

టీవీకేకు చెందిన పలువురు మంత్రులు కూడా స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయ ప్రచారంలో మహిళా అభ్యర్థుల వ్యక్తిగత రూపం లేదా శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంటూ ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కె.ఏ. సెంగోట్టయ్యన్ కూడా ఎన్నికల ప్రచారంలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు చోటు ఉండకూడదని అన్నారు.

ఈ వివాదంపై పీఎంకే నేత సౌమ్య అన్బుమణి కూడా స్పందించారు. రాజకీయ ప్రచార ప్రసంగాల్లో వ్యక్తిగత అవమానాలకు తావు ఉండకూడదని, ఎవరి విషయంలోనూ బాడీ షేమింగ్‌ చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ప్రచారంలో ఇతర అంశాలు ఉన్నప్పటికీ, చివర్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్య మొత్తం ప్రసంగంపై ప్రభావం చూపిందని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ఈ వివాదం ధారాపురం ఉప ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకుంది. అక్టోబర్ 6న జరగనున్న ధారాపురం, మదురాంతకం ఉప ఎన్నికల్లో టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే సహా పలు పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. సత్యభామ పార్టీ మారడాన్ని డీఎంకే ప్రధాన ప్రచార అంశంగా తీసుకుంటుండగా, టీవీకే మాత్రం ఆమెపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తోంది.

మరోవైపు, స్టాలిన్ తన ప్రచారంలో టీవీకే ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం, టీవీకే ప్రభుత్వ పనితీరు వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. టీవీకే మాత్రం ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మరో పార్టీలో చేరడం చట్టపరమైన పరిధిలోనే ఉందని, పార్టీ మార్పులపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించింది.

తాజా పరిణామంగా, సత్యభామపై చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పేర్కొంటూ టీవీకే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ అంశంపై డీఎంకే నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.