Vijay Mallya Loan Case: విజయ్ మాల్యాకు మరో షాక్.. రూ.10,270 కోట్లు రికవరీ.. అయినా మాల్యా నుంచి రూ.8,751.86 కోట్లు రావాల్సిందేనంటున్న బ్యాంకులు..
Vijay Mallya Loan Case
Vijay Mallya Loan Case: ప్రముఖ పారిశ్రామికవేత్త, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యాకు సంబంధించిన బ్యాంకు బకాయిల వ్యవహారంలో బొంబాయి హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మాల్యా నుంచి ఇంకా భారీ మొత్తంలో బకాయిలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు రూ.10,270 కోట్లను రికవరీ చేసినప్పటికీ.. 2026 ఆగస్టు 31 నాటికి మరో రూ.8,751.86 కోట్లు బకాయిగా ఉన్నాయని తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ వివరాలు మాల్యా చేస్తున్న వాదనలకు భిన్నంగా ఉన్నాయి.
మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలను ఇప్పటికే పూర్తిగా రికవరీ చేశారని, వాస్తవానికి తనపై ఉన్న అసలు బకాయిల కంటే ఎక్కువ మొత్తమే బ్యాంకులకు అందిందని గతంలో కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో తనపై కొనసాగుతున్న క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ 2020లో బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వాదనను బ్యాంకుల కన్సార్టియం తాజాగా వ్యతిరేకించింది.
కోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియం అఫిడవిట్ దాఖలు చేసింది. డెట్ రికవరీ ఆఫీసర్ ద్వారా ఇప్పటివరకు రూ.10,270 కోట్లు తాత్కాలికంగా రికవరీ చేసినట్లు బ్యాంకులు తెలిపాయి. దీనికి అదనంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేయడానికి ముందే మరో రూ.544.58 కోట్లు రికవరీ చేసినట్లు వెల్లడించాయి. అయితే ఈ మొత్తాలను రికవరీ చేసినంత మాత్రాన మొత్తం బకాయిలు పూర్తిగా తీరినట్లు కాదని బ్యాంకులు స్పష్టం చేశాయి.
బ్యాంకుల ప్రకారం.. 2026 జనవరిలో దాఖలు చేసిన అఫిడవిట్ సమయానికి న్యాయపరమైన, ఇతర ఖర్చులను మినహాయించి మాల్యా నుంచి రూ.8,135.63 కోట్లు ఇంకా రాబట్టాల్సి ఉంది. అనంతరం వడ్డీ, ఇతర బకాయిలు పేరుకుపోవడంతో ఆగస్టు 31 నాటికి ఈ మొత్తం రూ.8,751.86 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం ఇంకా చట్టపరంగా రికవరీ చేయాల్సిన బకాయిగా ఉందని కన్సార్టియం కోర్టుకు వివరించింది.
మాల్యా వాదనకు భిన్నంగా బ్యాంకుల అఫిడవిట్
మాల్యా తరఫు వాదన ప్రకారం.. బ్యాంకులు తనపై ఉన్న అసలు బకాయిల కంటే ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే రికవరీ చేశాయి. అందువల్ల బ్యాంకుల రుణ వివాదం పరిష్కారమైనట్లేనని, దాని ఆధారంగా తనపై కొనసాగుతున్న క్రిమినల్ చర్యలను కూడా ముగించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం ఈ వాదనను అంగీకరించలేదు.
మరోవైపు, మాల్యాకు సంబంధించిన కొన్ని అటాచ్డ్ షేర్లు ఇంకా విక్రయించకుండా అలాగే ఉన్నాయని కూడా బ్యాంకులు కోర్టుకు తెలిపాయి. దీంతో ఆస్తుల రికవరీ, బ్యాంకు బకాయిల లెక్కలు, మిగిలిన ఆస్తుల విక్రయం వంటి అంశాలు ఇంకా పూర్తిగా ముగియలేదని రుణదాతలు పేర్కొన్నారు.
ఈ కేసులో బ్యాంకు బకాయిల రికవరీ, క్రిమినల్ కేసులు రెండు వేర్వేరు అంశాలుగా కొనసాగుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రకారం, మాల్యాకు సంబంధించిన సుమారు రూ.14,132 కోట్ల విలువైన ఆస్తులను ఎస్బీఐకి తిరిగి అందించారు. అయితే ఆస్తుల రికవరీ జరిగినంత మాత్రాన మనీలాండరింగ్‌కు సంబంధించిన క్రిమినల్ కేసులు స్వయంచాలకంగా ముగియవని ED బొంబాయి హైకోర్టుకు తెలిపింది.
మాల్యాను 2019లో ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్‌గా ప్రకటించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బ్యాంకు రుణాలు, మోసం, కుట్ర, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తులు, న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల తాజా అఫిడవిట్ నేపథ్యంలో ఈ కేసులో బకాయిల లెక్కలపై మరోసారి స్పష్టత వచ్చింది.
విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 13, 2026కు వాయిదా వేసింది. అప్పటికి బ్యాంకుల బకాయిలు, ఆస్తుల రికవరీ, మాల్యా కోరుతున్న క్రిమినల్ కేసుల ముగింపు వంటి అంశాలపై కోర్టులో తదుపరి వాదనలు జరిగే అవకాశం ఉంది.
- Prakash Raj SIR Remarks: పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న.. ‘ప్రజల పక్షాన ఉంటారా? ఎన్నికల సంఘం పక్షాన ఉంటారా?’
- Dussehra 2026: నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాలు ఇవే.. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు ఒక్కో రూపం విశిష్టత గురించి తెలుసా..
- Andhra Pradesh Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి 17.20 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? పరకాల ప్రభాకర్ సంచలన విశ్లేషణ..పూర్తి వివరాలు ఇవే..
- Rahul Gandhi Satyagraha: దేశవ్యాప్త ఉద్యమాలకు డిజిటల్ వేదిక.. ‘సత్యాగ్రహ’ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ
- Telangana Express Turns 50: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దాకా .. ఐదు దశాబ్దాల ప్రస్థానం..