Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

Editorial: మమత, సిపిఐ(ఎం) దగ్గరవటం సాధ్యమా?

Prajapaksham 30 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: మమత, సిపిఐ(ఎం) దగ్గరవటం సాధ్యమా?

Editorial: మమత, సిపిఐ(ఎం) దగ్గరవటం సాధ్యమా?

Editorial: బిజెపి ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా మమతా బెనర్జీతోపాటు కాంగ్రెస్‌ నుంచి బయటకువచ్చి ఆమెతో కలిసి సిపిఐ(ఎం)పై పోరాటాలు నడిపినవారే. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రాంలో, మొన్నటి ఎన్నికల్లో భవానీపూర్‌లో మమతా బెనర్జీని అధికారి ఓడించారు. అతడు గెలుచుకున్న రెండవ స్థానం నందిగ్రాంకు ఆయన రాజీనామా చేయటం వల్ల రేపు 6వ తారీఖు ఉప ఎన్నిక జరగనుంది.

Editorial: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరనేది ప్రాచుర్యం పొందిన నానుడి. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఐదారు మాసాల క్రితం వరకు ఎవరూ ఊహించనివి. రాష్ట్రంలో మూడు దశాబ్దాల లెఫ్ట్‌ఫ్రంట్‌ పరిపాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి దాన్ని అధికారం నుంచి తొలగించిన వ్యక్తి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ. లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్‌ మెతకగా వ్యవహరిస్తోందని ఆరోపించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఆమె అవిశ్రాంత పోరాటం సాగించారు. ఆ క్రమంలో పరస్పర దాడులు, హత్యలు యిత్యాది హింసాకృత్యాలు సర్వసాధారణంగా సాగాయి.

ఇప్పటి బిజెపి ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా మమతా బెనర్జీతోపాటు కాంగ్రెస్‌ నుంచి బయటకువచ్చి ఆమెతో కలిసి సిపిఐ(ఎం)పై పోరాటాలు నడిపినవారే. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రాంలో, మొన్నటి ఎన్నికల్లో భవానీపూర్‌లో మమతా బెనర్జీని అధికారి ఓడించారు. అతడు గెలుచుకున్న రెండవ స్థానం నందిగ్రాంకు ఆయన రాజీనామా చేయటం వల్ల రేపు 6వ తారీఖు ఉప ఎన్నిక జరగనుంది. టాటాల నానో కార్ల ఫ్యాక్టరీకోసం రైతులనుంచి భూసేకరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నడిపిన పోరాటమే లెఫ్ట్‌ఫ్రంట్‌ పరిపాలన అంతానికి హేతువైంది.

ఆమె 15 సంవత్సరాల ఏకపక్ష నిరంకుశ పాలన 20-26 అసెంబ్లీ ఎన్నికలో అంతమైంది బిజెపిపై సర్‌ ప్రక్రియ సహా అనేక అక్రమాల ఆరోపణలున్నప్పటికీ, అది తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనకు ముగింపు పలికింది. మమతా బెనర్జీ ఎమ్మెల్యేలు, ఎంపిల తిరుగుబాటుకు గురై చివరకు పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కోల్పోయే చిక్కుల్లో పడ్డారు. నందిగ్రాం ఉప ఎన్నికల్లో ఆమె ప్రకటించిన అభ్యర్థిని ముఖ్యమంత్రితో ముచ్చట అనంతరం పోటీ నుంచి తప్పుకున్నారు. రాజకీయ చాతుర్యం గల మమతా బెనర్జీ వెనువెంటనే తటపటాయింపు లేకుండా కాంగ్రెస్‌ అభ్యర్థికి తోడ్పాటు ప్రకటించారు.

ముఖ్యమంత్రి దుష్ట చాతుర్యంతో, నందిగ్రాం పోరాటకాలంలోని ఒక హత్యకేసు బయటకు తీసి కాంగ్రెస్‌ అభ్యర్థిని అరెస్టు చేయించారు. అతనిపై 5 క్రిమినల్‌ కేసులున్నాయి. ఎట్టకేలకు ఆ అభ్యర్థికి హైకోర్టు నిన్న బెయిలు మంజూరు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అవమానకరమైన ఓటమి తర్వాతగాని మమతా బెనర్జీకి తత్వం బోధపడలేదు. బిజెపి మతోన్మాద, దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీల సిపిఐ(ఎం) సహా ఐక్యతకు పిలుపు ఇచ్చారు.

గత 15 సంవత్సరాల్లో ఒకనాటి బద్ధ శత్రువులైన కాంగ్రెస్‌, సిపిఐ(ఎం) ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న, విడివిడిగా పోటీ చేసిన సందర్భాలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో చెరొక అసెంబ్లీ సీటు గెలుచుకున్నాయి. కాని పై రెండు పార్టీల్లో ఏదీ మమతా బెనర్జీ పార్టీతో ఎన్నికల సర్దుబాటు కుదుర్చుకున్న సందర్భం లేదు. అయినా ప్రతిపక్ష ఐక్యతకు ఆమె పిలుపు ఇచ్చారంటే అది ఆమె దయనీయ స్థితిని తెలియజేసింది.

ఈ నేపథ్యంలో, సర్‌ నిర్వహణలో సిఇసి జ్ఞానేశ్‌కుమార్‌ ఏకపక్ష పోకడపై సహకమిషనర్‌లు అభ్యంతరాలు తెలియజేశారన్న వార్తల దృష్ట్యా, ప్రజాస్వామ్య రక్షణకై ప్రతిపక్షాల ఐక్య పోరాటం ఆవశ్యకత వక్కాణిస్తూ సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ అన్ని పక్షాలతోపాటు మమతా బెనర్జీకి కూడా లేఖ పంపారు. ఆమె సానుకూలంగా స్పందించి బేబీకి ఫోన్‌ చేయటం విశేషం. బెంగాల్‌ రాజకీయాల్లో ఇదో పెద్ద పరిణామం. పరస్పర హింసాకాండ, హత్యల్లో సతమతమైన పార్టీల మధ్య సయోధ్యపై తొందరపాటు ఊహాగానాలు, వ్యాఖ్యానాలు బయలుదేరాయి.

సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి లాంఛనంగా లేఖ రాసినంత మాత్రాన పశ్చిమ బెంగాల్‌ యూనిట్‌ను ఒప్పించటం చాలా కష్టం. క్షేత్రస్థాయి క్యాడర్‌ అసలే ఒప్పుకోరు. ఎందుకంటే మమతా తృణమూల్‌ కాంగ్రెస్‌, సిపిఐ(ఎం) మధ్య ఉన్నది వైరుధ్యం కాదు, శతృత్వం, లోతుగా వేళ్లూని ఉంది. రాష్ట్ర సిపిఐ(ఎం) కార్యదర్శి ఎండి సలీం తమ అసంతృప్తిని కేంద్ర నాయకత్వానికి తెలియజేశారు. అయితే ఇండియా కూటమిలో ఇతర అనేక ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్‌, తృణమూల్‌ (మమత) కాంగ్రెస్‌, సిపిఐ(ఎం) కలిసి పనిచేస్తున్న వాస్తవం విస్మరించరానిది.

రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులున్నా, జాతీయాంశాలపై ప్రతిపక్షాల ఐక్యతలో భాగంగా విరుద్ధ శక్తులు కలిసి పనిచేయవలసిన సందర్భాలు వుంటాయి. దాన్ని ఎలా నిర్వహించాలో ఆ సందర్భాన్నిబట్టి రాష్ట్రస్థాయిలో పార్టీలు నిర్ణయించుకుంటాయి. తమ ప్రధాన కార్యదర్శితో మమతా బెనర్జీ మాట్లాడటం అన్నది ఎన్నికల అవగాహన కాదని, ప్రస్తుత అంశంలో దేశం ప్రధానం అని సలీం చెప్పారు. అది వాస్తవం.

మూడు ప్రతిపక్షా లు దగ్గరికి రాగలిగితే అది బిజెపికి అవరోధమవుతుంది. ముందే జాగ్రత్తపడాలనుకుంటున్న ముఖ్యమంత్రి అధికారి తృణమూల్‌, సిపిఐ(ఎం) మధ్య పాత ఘర్షణలు, దౌర్జన్యాలు, హత్యలు ఘటనలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి అంత దడ అవసరం లేదు. బెంగాల్‌ రాజకీయాల్లో మూడు ప్రతిపక్షాల ఐక్యత సులభతర ప్రక్రియ కాదు. బిజెపి దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ఆయా సమస్యలను బట్టి ప్రతిపక్షాలు కలిసి పనిచేసే సందర్భంగా ఏర్పడవచ్చు. ఎన్నికల అవగాహనకు ప్రజాసమస్యలపై వేదిక పంచుకోవటానికి ఎంతో దూరం ఉంటుంది. అందువల్ల ఊహాగానాలు అనవసరం.