Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ఇండియా కూటమి సమరోత్సాహం

Prajapaksham 02 Oct 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఇండియా కూటమి సమరోత్సాహం

India Bloc

దేశ రాజధాని ఢిల్లీలోని కాన్స్‌టిట్యూషన్‌ క్లబ్‌లో బుధవారం ‘జన్‌ బంధన్‌’ పేరిట జరిగిన ఇండియా కూటమి సమావేశం ప్రజాస్వామ్య పరిరక్షణకు సవ్యమైన దిశను నిర్దేశించింది. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టేందుకు బిజెపి అగ్రనేతలు కుయుక్తులు, వారి కనుసన్నల్లో పని చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ దుష్కృత్యాలపై సమర శంఖం పూరించింది. తద్వారా దేశానికి ఇండియా కూటమి నేతలు గట్టి భరోసానే కల్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్‌ 2 నుంచి మొదలు రెండు నెలల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్యాచరణను ‘జన్‌బంధన్‌’ సమావేశం ప్రకటించింది. అంతే కాకుండా కూటమిలో లుకలుకలున్నాయనే అధికార పార్టీ ప్రచారాలను తిప్పికొట్టింది. ఈ సమావేశానికి 19 పార్టీలు హాజరై దేశం కోసం ఏకతాటిపై ఉన్నామని చాటాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ, డిఎంకె గైర్హాజరయ్యాయని, ఇది ప్రతిపక్షాల్లో అనైక్యతకు నిదర్శనమని బిజెపి నేత, కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సన్నాయి నొక్కులు నొక్కారు. నిజానికి ఆ రెండు పార్టీలు చివరి సారిగా జూన్‌ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశానికి రాలేదు. అదే సమయంలో ఆ రెండు పార్టీలేమి బిజెపి, జ్ఞానేశ్‌ కుమార్‌ల విషయంలో మౌనంగా లేవు. అవి నిక్కచ్చిగా తూర్పారపట్టాయి కూడా. పంజాబ్‌లో త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఆప్‌తో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రత్యక్షంగా తలపడనుండటమే ఇందుకు కారణమని ఎవరైనా అర్థం చేసుకుంటారు. తమిళనాడులో కాంగ్రెస్‌ తమను వీడి టివికె కూటమిలో చేరడంపై ఆగ్రహంతో డిఎంకె గతంలోనే ఇండియా కూటమి నుంచి వైదొలగింది. కానీ, బిజెపిపై తన సైద్ధాంతిక వ్యతిరేకతను వదులుకున్న దాఖలాలేవీ ఇప్పటికి కనిపించలేదు.
ఇండియా కూటమి తాజా సమావేశంలో పార్టీల మధ్య ఐక్యత కనపడినప్పటికీ, దేశానికి సంబంధించిన అంశం కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ
ఏకపక్షంగా పోవద్దనే సలహాలు వ్యక్తమయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశానికి హాజరైన శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఒక్కటిగా ముందుకు వెళ్తేనే ప్రజలకు సరైన సందేశం వెళ్తుందనే సూచన చేసినట్లు తెలిసింది. అలాగే ఇండియా కూటమి పార్టీలు ఒకే గొంతు వినిపించేందుకు వీలుగా అధికారిక వాచస్పతుల నియామకం గురించి చర్చ వచ్చింది. దీనిపై సబ్‌ కమిటీ వేయాలనే నిర్ణయానికొచ్చారు. ఇండియా కూటమికి చైర్మన్‌గా గతంలోనే మల్లిఖార్జున ఖర్గే నియమితులైనప్పటికీ, కమిటీ ఏర్పాటుపై పలు సందర్భాలలో అభిప్రాయాలు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిజానికి ఆగస్టు మాసంలోనే హైదరాబాద్‌లో ఇండియా కూటమి సమావేశం జరపాలనే నిర్ణయం అమలు కాలేదు. ఇలాంటివి ప్రజల్లో పలుచనభావం కలుగజేస్తాయి. ఒక నిర్ధిష్టమైన వర్కింగ్‌ కమిటీ, అధికార ప్రతినిధులు, తరచూ సమావేశాలవడం ద్వారా ప్రజల్లో కూటమిపై విశ్వాసం పాదుకొల్పవచ్చు. ఇది కూటమి పక్షాల మధ్య సాన్నిహిత్యం పెరగడంతో పాటు, ఏ ఒక్క పార్టీ ఏకపక్షంగా పోతుందనే పరస్పర సందేహాలకు చెక్‌ పెట్టినట్లవుతుంది.
కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌గాంధీ పొడగిట్టనట్లు గతంలో వ్యవహ
రించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి సమావేశంలో ఆయన ప్రధాని అయినా అభ్యంతరం లేదనడం ఆశ్చర్యకరమే. కూటమి ఐక్యత కోసం తాను సాధారణ కార్యకర్తగా పని చేస్తానని,అందుకు తానేమీ అహానికి పోబోనని, ఇటీవల తాను నవీన్‌ పట్నాయక్‌ (బిజూ జనతాదళ్‌), ఎం.ఎ.బేబి(సిపిఐ(ఎం)లతో సంభాషించానని చెప్పారు. బిజెపి అప్రజాస్వామ్య పోకడలతో ఆమెలో మార్పు వచ్చి ఉండవచ్చు. అదే స్ఫూర్తిని నంద్రిగామ్‌ ఉప ఎన్నికల్లో ప్రదర్శిస్తే బాగుండేది. ఎందుకంటే, టిఎంసి అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో, గత ఎన్నికల్లో మూడవ స్థానంలో నిలిచిన వామపక్ష సంఘటన తరఫు సిపిఐ అభ్యర్థికి కాకుండా, నోటా కంటే తక్కువ ఓట్లతో ఆరవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌కు చేరువయ్యేందుకు ఆమె తహతహ ద్యోతకమవుతోంది.
మరోవైపు, సర్‌పై, జ్ఞానేశ్‌ కుమార్‌ తీరుపై వెల్లువెత్తిన వ్యతిరేకత నేపథ్యంలో టిడిపి, ఎల్‌జెపి వంటి ఎన్‌డిఏ పక్షాలు నుంచి అసంతృప్తి నోటి నుంచి తప్ప నాభి నుంచి రాలేదు. ఆ తరువాత అవి సర్దుకున్నాయి కూడా. బిజెపిపై పెరుగుతున్న వ్యతిరేకత తమపై పడకూడదనే ఉద్దేశ్యంతో అవి అప్పుడప్పుడు గోడ మీది పిల్లి వాటం ప్రకటనలు చేస్తుంటాయి. అదే సమయంలో ఇండియా కూటమిలోని పక్షాల మధ్య సఖ్యత క్రమంగా దృఢపడుతోంది. ఇండియా కూటమి గత సమావేశం నాటికి పశ్చిమ బెంగాల్‌ విజయోన్మత్తులో ఉన్న బిజెపి, టిఎంసి, శివసేన పార్లమెంటు సభ్యులను అక్రమంగా చీల్చి తమ దరికి చేర్చుకుంది. ఎన్‌సిపి (శరద్‌ పవార్‌) పార్టీ పని పడతామని, డిఎంకెను తమవైపు తిప్పుకుంటామని రంకెలు వేశారు. చీలిపోయి కొత్త పార్టీలో విలీనమైన టిఎంసి ఎంపిలు ఇప్పుడు తమ పదవికి ఎసరువచ్చే ప్రమాదముందని బిక్కు బిక్కుమంటున్నారు. అనేక ఎదురుదెబ్బలు తిని నిలిచిన ఇండియా కూటమి మాత్రం సమరోత్సాహంతో కదం తొక్కుతోంది.