అమెరికా దుర్మార్గం ఇరాన్ ప్రజలకు వైద్యం దూరం!
US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?
ఎన్ని రకాలుగా బెదిరించినా, ఎంతగా బాంబుల వర్షం కురిపించినా, లొంగని ఇరాన్‌ను దెబ్బతీయడానికి అమెరికా పాత విధానాన్నే కొత్తగా అనుసరిస్తున్నది. ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తూనే, వైద్య సౌకర్యాలు ప్రజలకు అందని ద్రాక్షగా మార్చే దుర్మార్గానికి దిగుతున్నది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఆర్థిక ఆంక్షలు ఒక ఆయుధంగా మారడం కొత్త విషయం కాదు. ఒక దేశం తన విధానాలను మార్చాలని మరో దేశం కోరినప్పుడు, సైనిక దాడికి బదులుగా ఆర్థిక ఒత్తిడి పెంచడం, వాణిజ్యాన్ని అడ్డుకోవడం, బ్యాంకింగ్ లావాదేవీలను కష్టతరం చేయడం, దిగుమతులు ఎగుమతులపై ఆంక్షలు విధించడం వంటి మార్గాలను అనుసరించడం గతం లో అనేక సందర్భాల్లో కనిపించింది.
దీని వెనుక ఉన్న వ్యూహం స్పష్టమే. ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచి, ప్రభుత్వంపై అంతర్గత ఒత్తిడి పెంచడం. చివరికి ఆ దేశం తన విధానాలను మార్చుకునే పరిస్థితిని సృష్టించడం. కానీ, ఆర్థిక వ్యవస్థను లక్ష్యం గా చేసుకున్నప్పుడు దాని ప్రభావం కేవలం ప్రభుత్వాలపై పడదు. సాధారణంగా మొదట దెబ్బతినేది సామాన్య ప్రజల జీవనం. ముఖ్యంగా ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలు వంటి మౌలిక అవసరాలు ఆర్థిక ఒత్తిడికి గురైనప్పుడు, ఆంక్షలు ఒక రాజకీయ సాధనం నుంచి మానవీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇరాన్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. అమెరికా నిర్దేశిస్తున్న షరతులను అంగీకరించేందుకు ఇరాన్ నిరాకరిస్తున్న నేపథ్యంలో, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచే విధానాలు కొనసాగుతున్నాయి. నిత్యావసరాలతోపాటు, ఔషధాల ధర లు విపరీతంగా పెరుగుతున్నాయి.
కొన్ని మందుల ధరలు మూడు రెట్లకు పైగా పెరిగినట్లు సమాచారం. కొన్ని మందులు ఫార్మసీలలో దొరకడం కూడా కష్టమవుతోంది. కిడ్నీ డయాలసిస్ రోగులకు అవసరమైన కొన్ని మాత్రల ధరలు ఇటీవలి నెలల్లో దాదాపు 350 శాతం పెరిగాయి. సాధారణ నొప్పి నివారణ మందులు కూడా అందుబాటులో లేని పరిస్థితులు కొన్నిచోట్ల కనిపిస్తున్నాయి. అనారోగ్యం ఒక వైపు, ఫలితంగా ఆదాయ నష్టం మరోవైపు సామాన్యుడి కుటుంబాన్ని అడకత్తెరలో ఉంచుతున్నాయి. దీనిని కేవలం ఇరాన్‌కు సంబంధించిన ఆర్థిక గణాంకంగా చూడకూడదు. అమెరికా అవలంభిస్తున్న అమానవీయ వ్యూహాలకు పతనమవుతున్న లేదా పతనం కానున్న దేశాలకు ఒక హెచ్చరికగా భావించాలి.
ఇరాన్ తనకు అవసరమైన మందుల్లో 80 శాతానికి పైగా దేశీయంగా ఉత్పత్తి చేస్తుందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, ఈ ఉత్పత్తి పూర్తిగా స్వయం సమృద్ధి కాదు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, రసాయనాలు, పరికరాలు, ఇతర ఫార్మాస్యూటికల్ భాగాల్లో గణనీయమైన భాగం దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక దేశం 80 శాతం మందులను దేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ, ఆ మందుల తయారీ గొలుసులోని కీలక భాగం విదేశాలపై ఆధారపడి ఉండవచ్చు. ఇక్కడే ఆర్థిక ఆంక్షల ప్రభావ తీవ్రత స్పష్టమవుతుంది. ఔషధాలపై నేరు గా ఆంక్షలు లేకపోయినా, బ్యాంకింగ్ ఆంక్షలు అంతర్జాతీయ లావాదేవీలను ప్రమాదకరంగా మారుస్తాయి.
ఇరాన్‌తో వ్యాపారం చేస్తే తమపై కూడా ఆంక్షలు పడవచ్చనే భయంతో బ్యాంకులు, ఔషధ కంపెనీలు, రవాణా సంస్థలు లావాదేవీల కు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. చట్టపరంగా ఒక మందును ఇరాన్‌కు విక్రయించడానికి అనుమతి ఉన్నప్పటికీ, ఆ మందు కోసం చెల్లింపును బ్యాంకు ప్రాసెస్ చేయకపోతే ఆ చట్టబద్ధమైన అవకాశం ఆచరణలో అర్థరహితమవుతుంది. ఇదే ఆంక్షల వ్యవస్థలోని ప్రమాదకరమైన ‘చిల్లింగ్ ఎఫెక్ట్’. యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్‌లోని 40కుపైగా ఔషధ కర్మాగారాలు దెబ్బతిన్నాయి. వాటిలో క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన ఔషధ సంస్థలు కూడా ఉన్నాయని సమాచారం.
మరోవైపు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫార్మసీలు తమ నిల్వలను పునరుద్ధరించుకోలేకపోతున్నాయి. బీమా సంస్థలు ఫార్మసీలకు చెల్లించాల్సిన బకాయిలు నెలల తరబడి పేరుకుపోతున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం ఈ బకాయిలు వందల మిలియన్ల డాలర్లకు చేరాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇరాన్ ఫార్మసీ వ్యవస్థ బీటలు బారుతున్నది. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. చికిత్స గాలిలో దీపంలా మారింది. ఈ పరిణామాలను కేవలం ఇరాన్ రాజకీయ వివాదంగా చూడటం తప్పు. ఎందుకంటే, ఇలాంటి ఆర్థిక ఒత్తిడి వ్యూహాలు గతంలో వివిధ దేశాల విషయంలో అమలయ్యాయి. ఇప్పటికీ అమలవుతున్నాయి. ఇటీవల క్యూబాపై కొనసాగుతున్న అమెరికా విధానాలే ఉదాహరణ. ఒక దేశాన్ని తన రాజకీయ మార్గాన్ని మార్చుకునేలా చేయడానికి దాని ఆర్థిక సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీయడమనే వ్యూహం అమలైనప్పుడల్లా, దాని మానవీయ పరిణామాలను కూడా సమాంతరంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది.
దేశాల మధ్య విభేదాలు ఉండవచ్చు. భద్రతా సమస్యలు ఉండవచ్చు. అణు కార్యక్రమాలు, సైనిక వ్యూహాలు, ప్రాంతీయ రాజకీయా లు వంటి అంశాలపై కఠినమైన చర్చలు జరగవచ్చు. కానీ ఆ రాజకీయ పోరాటానికి ప్రజారోగ్యం బలికావడం ప్రపంచ వ్యవస్థకు ప్రమాదకరమైన సంకేతం. ఈ పరిస్థితుల్లో అందుకే తక్షణ చర్యలు అవసరం. ఈ దిశగా, అత్యవసర ప్రాణరక్షక మందులు, క్యాన్సర్ మందులు, డయాలసిస్‌కు అవసరమైన ఔషధాలు, ఇన్సులిన్, యాంటీబయాటిక్స్, మానసిక ఆరోగ్య మందులు, వ్యాక్సిన్లు వంటి వాటి కోసం అంతర్జాతీయ స్థాయిలో స్పష్టమైన, రక్షిత సరఫరా మార్గాలను ఏర్పాటు చేయాలి.
మానవతా అవసరాల కోసం ఉద్దేశించిన చెల్లింపులను రాజకీయ ఆంక్షల నుంచి స్పష్టంగా వేరు చేసే బ్యాంకింగ్ వ్యవస్థను కల్పించాలి. అంతర్జాతీయ సంస్థలు ఇరాన్ లో ఔషధ నిల్వలు, ధరలు, కొరతలను నిరంతరం పర్యవేక్షించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ దేశాల నుంచి మందులు, ముడి పదార్థాలు దిగుమతి చేసుకునే మార్గాలను సులభతరం చేయాలి. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ‘మానవతా సరుకులు’గా స్పష్టంగా గుర్తించి వాటి రవాణాకు ఎలాంటి అనవసరమైన ఆంక్షలు లేకుండా చూడాలి.
బీమా సంస్థలు, ఫార్మసీలు, ఆసుపత్రుల మధ్య ఆర్థిక చెల్లింపులు నిలిచిపోకుండా ప్రత్యేక ఆర్థిక మార్గాలు సృష్టించాలి.
ఆర్థిక ఆంక్షల లక్ష్యం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమేనని అమెరికా వాదిస్తుండవచ్చు. కానీ ఆ ఒత్తిడి చివరకు ప్రజల ప్రాణాలపై పడితే, అది, అంతర్జాతీయ మానవతా వ్యవస్థకు ఎదురయ్యే సవాలుగా మారుతుంది. ఇరాన్‌లో తీవ్రమవుతున్న మందుల కొరత, ధరల పెరుగుదల ప్రపంచానికి ఒక హెచ్చరిక. రాజకీయ విభేదాలకు పరిష్కారాలు వెతుక్కోవచ్చు. చర్చలు విఫలమైతే కొత్త చర్చలకు మార్గాలు తెరవచ్చు. ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడడం వల్ల మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇలాంటి అకృత్యాలకు, దుర్మార్గాలకు పాల్పడుతున్న అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాలి. ఇరాన్, క్యూబా వంటి దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షల పేరుతో, ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలను ఆపాలి. నేటి ఇరాన్ సమస్య రేపు ప్రపంచ సమస్యగా మారడం ఖాయమని ప్రతి దేశం గుర్తించాలి. స్పందించాలి. ఇరాన్, క్యూబాలకు అండగా నిలవాలి.
- Gandhi Jayanti 2026 Wishes In Telugu: వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్‌లో షేర్ చేసుకునేందుకు గాంధీ జయంతి శుభాకాంక్షల ఫోటోలు, కొటేషన్స్ మీ కోసం..
- Gandhi Jayanti 2026 Wishes In Telugu: వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్ కోసం గాంధీ జయంతి శుభాకాంక్షల ఫోటోలు
- Gandhi Jayanti 2026 Wishes In Telugu: అక్టోబర్ 2న షేర్ చేసేందుకు గాంధీ జయంతి శుభాకాంక్షలు ఇవే
- Gandhi Jayanti 2026 Wishes In Telugu: అక్టోబర్ 2న షేర్ చేసేందుకు గాంధీ జయంతి శుభాకాంక్షలు
- Gandhi Jayanti 2026 Quotes in Telugu: గాంధీ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేయడానికి 20+ కొటేషన్స్