Skip to content
బిజినెస్ వార్తలు

మెదడుతో మైండ్ గేమ్ ఆడుతున్న ఏఐ.. కనిపించేది నిజం కాదని తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు

Prajapaksham 04 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
మెదడుతో మైండ్ గేమ్ ఆడుతున్న ఏఐ.. కనిపించేది నిజం కాదని తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు

నిజం, మాయ మధ్య తేడా చెప్పలేని స్థాయికి చేరిన ఏఐ

మనం కళ్లారా చూసిన విషయాలను.. మన మెదడులో భద్రంగా దాగున్న మధురమైన లేదా చేదు జ్ఞాపకాలను సైతం కృత్రిమ మేధ (AI) పూర్తిగా మార్చేయగలదని మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) పరిశోధకులు సంచలన హెచ్చరిక చేశారు. ఏఐ సృష్టించే తప్పుడు విజువల్స్, చాట్‌బాట్‌ల సంభాషణలు మనుషులలో అసలు జరగని సంఘటనలను కూడా నిజంగానే జరిగాయనే బలమైన భ్రమను కల్పిస్తున్నాయని సైకాలజిస్ట్ ఎలిజబెత్ లోఫ్టస్, పరిశోధకుడు పాట్ పటారనుతపోర్న్ నేతృత్వంలోని ఎంఐటీ బృందం వెల్లడించింది. కంప్యూటింగ్ సిస్టమ్స్‌పై జరిగిన ప్రతిష్ఠాత్మక సీహెచ్ఐ (CHI) కాన్ఫరెన్స్ లో ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించారు.

ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 200 మందిని నాలుగు గ్రూపులుగా విభజించి, వారికి ఏఐ ఎడిట్ చేసిన ఫోటోలు, వీడియోలను చూపించారు. ఏఐ మార్చబడిన విజువల్స్ చూసిన వారు.. అసలు తమ జీవితంలో జరగని విషయాలను కూడా తాము స్వయంగా చూశామని గట్టిగా నమ్మడమే కాకుండా, సాధారణ నియంత్రణ సమూహం (కంట్రోల్ గ్రూప్) కంటే రెండు రెట్లు ఎక్కువగా ఆ తప్పుడు జ్ఞాపకాలను నిజమని వాదించారు.

కేవలం ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు, మనం రోజువారీగా మాట్లాడే ఏఐ చాట్‌బాట్‌లు కూడా నెమ్మదిగా తప్పుడు వివరాలను మనుషుల మెదడులోకి జొప్పిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. గతంలో కోర్టుల్లో ఒక లాయర్ అడిగే లీడింగ్ ప్రశ్నలు సాక్షుల జ్ఞాపకాలను ఎలా ప్రభావితం చేసేవో, ఇప్పుడు మనతో ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడే ఒక ‘ఫ్రెండ్లీ ఏఐ చాట్’ అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా మానవ జ్ఞాపకాలను మార్చేస్తోందని ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైంది.

నిజానికి మానవ మెదడులో తప్పుడు జ్ఞాపకాలను (False Memories) పంపించడం సులువైన విషయమేనని శాస్త్రవేత్తలకు ముప్పై ఏళ్ల క్రితమే తెలుసు. 1995లో ప్రొఫెసర్ ఎలిజబెత్ లోఫ్టస్ చేసిన ఒక ప్రసిద్ధ ప్రయోగంలో.. కొందరు వ్యక్తులు చిన్నప్పుడు షాపింగ్ మాల్‌లో తప్పిపోయినట్లు ఒక తప్పుడు కథనాన్ని నమ్మించగా.. వారు దానిని నిజమని నమ్మడమే కాకుండా ఆ మాల్ అప్పట్లో ఎలాంటి వాసన వచ్చింది, తమను ఎవరు కాపాడారు అనే అబద్ధపు వివరాలను కూడా సొంతంగా ఊహించి మరీ చెప్పారు. ఈ తప్పుడు జ్ఞాపకాలు మనుషుల ప్రవర్తనను కూడా శాసిస్తాయని.. చిన్నప్పుడు ఫలానా ఆహార పదార్థాలు తిని అనారోగ్యం పాలయ్యారని ఎవరికైనా అబద్ధం చెప్తే, వారు పెద్దయ్యాక కూడా ఆయా పదార్థాలను తినడానికి ఇష్టపడరని లోఫ్టస్ వివరించారు.

హార్వే వైన్‌స్టీన్, టెడ్ బండీ వంటి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రిమినల్ కేసుల్లో మానవ మెదడు జ్ఞాపకాల విశ్వసనీయతపై కోర్టులకు నిపుణురాలిగా సేవలందించిన లోఫ్టస్.. ప్రస్తుత ఏఐ సాంకేతికతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన విషయాలు మెదడులో ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండవని, ప్రతిసారి వాటిని మనం గుర్తుచేసుకున్నప్పుడు మన మెదడు వాటిని కొత్తగా పునర్నిర్మిస్తుందని, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్ ఆ నిర్మాణ ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తున్నాయని స్పష్టం చేశారు. మానవ మెదడు అనేది ఒక పక్కా వీడియో రికార్డర్ కాదని, దానికి ఉన్న ఈ సహజ బలహీనతను ఏఐ సాంకేతికత ఇప్పుడు మరింత సులభంగా వాడుకుంటోందని ఈ పరిశోధన ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *