Skip to content
తెలంగాణ వార్తలు

CM Revanth Reddy Speech: దొరల దురహంకారాన్ని మరోసారి బొందపెట్టాల్సిన అవసరం ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Prajapaksham 04 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
CM Revanth Reddy Speech: దొరల దురహంకారాన్ని మరోసారి బొందపెట్టాల్సిన అవసరం ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డి స్పీచ్

CM Revanth Reddy Speech: తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో తెలంగాణ CM ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. కచ్చితంగా 20 ఏళ్ల క్రితం.. అంటే 2006 జులై 4న మిడ్జిల్ మండల ప్రజలు తన్ను మొదటిసారిగా ప్రజాప్రతినిధిగా ఆశీర్వదించారని గుర్తుచేసుకున్నారు. ఆనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన ఒక చిన్న మొక్కే.. ఇవాళ ముఖ్యమంత్రి రూపంలో మహా వృక్షమై నిలిచిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ మట్టి నుంచి వచ్చిన గొప్ప నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, దేశానికి ఎనలేని సేవలందించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఈ జిల్లా బిడ్డలేనని కొనియాడారు. 2006లో తాను ఒక స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు.. నేను ఈ నియోజకవర్గానికి చెందని వ్యక్తినైనా మిడ్జిల్ ప్రజలు అక్కున చేర్చుకుని నన్ను గెలిపించారన్నారు. ఆ నమ్మకమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో డార్క్ మండలంగా ఉన్న మిడ్జిల్‌ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని.. ఈ మండలాన్ని దత్తత తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరుతున్నట్లు ప్రకటించారు. అలాగే తాము అధికారంలోకి వచ్చాక వందేళ్లుగా జరగని కులగణనను రాష్ట్రంలో చేపట్టి.. దేశానికే దిక్సూచిగా నిలిచామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దొరల దురహంకారాన్ని మరోసారి బొందపెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 70 వేల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని ఏకంగా రూ. 8.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దిగజార్చిందని విమర్శించారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ ఏ గ్రామాల్లోనైనా పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చారా.. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా.. కోటి ఎకరాలకు నీరు లేదా ఇంటికో ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. పదేళ్లు కేసీఆర్ కుటుంబానికి, వారి బంధువులకు తప్ప సామాన్యులకు ఉద్యోగాలు, పదవులు వచ్చాయా అని నిలదీశారు.

తెలంగాణ కోసం పోరాడిన ప్రజాగాయకుడు గద్దర్ అన్నను దొర గడీల ముందు గంటల కొద్దీ నిలబెట్టి అవమానించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న నేరెళ్ల దళితులను లారీలతో తొక్కించిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆరోపించారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో 1000 ఎకరాల ఫామ్‌హౌస్, అలాగే కేటీఆర్, కవిత, హరీశ్‌రావులకు వేల కోట్ల విలువైన భూములు, ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ కుటుంబం దోపిడీలు, దొంగతనాలు మళ్లీ మొదలుకావడానికి ఇప్పుడున్న ప్రజాపాలన పోవాలా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం గ్రామగ్రామానా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *