Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రాజకీయాల్లో కొంప ముంచుతున్న స్ట్రాటజిస్టులు..

Prajapaksham 04 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ఏపీ రాజకీయాల్లో కొంప ముంచుతున్న స్ట్రాటజిస్టులు..

AI Generated Image

ఏపీ రాజకీయాలను, పార్టీలను నడిపిస్తున్నది రాజకీయ నేతలు అంటే కాదు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల స్ట్రాటజిస్టుల చేతుల్లో రాజకీయ నేతలు బందీలుగా మారిపోతున్నారని కార్యకర్తలు సైతం వాపోతున్నారు. చంద్రబాబు లాంటి నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న నేతలు కూడా, కుర్ర స్ట్రాటజిస్టులు చెబుతున్నట్టుగా నడుచుకుంటూ, తనదైన సహజమైన ధోరణికి భిన్నంగా మైకు పెట్టుకుని లబ్ధిదారులను కలుస్తున్నట్టు చేస్తున్న వీడియోలు ఆయనకు ఎంత పాజిటివిటీ తెస్తుందో అర్థం కావడం లేదు కానీ, తన సహజమైన వైఖరికి భిన్నంగా వెళ్లడం వల్ల ఆయనలోని లోటుపాట్లు బయటకు వస్తున్నాయి.

నిజానికి చంద్రబాబు నాయుడు అంత ప్రజాకర్షక నేత కాదు; తన రాజకీయ వ్యూహాలతోను, పార్టీని బలంగా నడిపించడంలోనూ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. తనకు ఉన్న ఆ విద్యతోనే నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ వచ్చారు. ఇప్పుడు అందుకు భిన్నంగా పొలిటికల్ స్ట్రాటజిస్టులు చెబుతున్న క్యాంపెయినింగ్‌లలో ఒదిగిపోయి నటించడం అనేది చంద్రబాబు లాంటి లీడర్లకు కాస్త ఇబ్బందికరమే అని చెప్పవచ్చు. నిజానికి ఈ ధోరణి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుకొని, మోడీ వరకు ఉంది; ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జాల్మూరి (జలమురి) విక్రయించే ఒక దుకాణం వద్దకు వెళ్లి మోడీ చేసినటువంటి హంగామా సహజంగా లేకుండా, అది ఒక సినిమా షూటింగ్ తరహాలో జరిగిపోయింది. ఇలా స్ట్రాటజిస్టుల వ్యూహాలు సహజత్వానికి భిన్నంగా ఉండటం చూడవచ్చు.

అయితే ఏపీ రాజకీయాల్లో ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు ప్రవేశించడం వల్ల పార్టీల్లో పూర్తిగా కార్యకర్తల ప్రాధాన్యత తగ్గిపోయింది. కేవలం కుల సమీకరణాలు, ఓటర్ల మనోభావాలను డేటా రూపంలో స్వీకరించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, ఎవరు ఏ కులస్తుడు, ఏ వీధిలో ఎంతమంది కులస్తులు ఉన్నారు అనే డేటాతో, ఫలానా కులానికి చెందిన ఓటర్లు ఫలానా పార్టీకి మాత్రమే ఓటేస్తారని నిశ్చితాభిప్రాయానికి వచ్చి, అందుకు తగ్గట్టుగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్ వేదికగా ఆయా కులాలకు చెందిన ఓటర్లను మభ్యపెట్టేలా పోస్టులను పెడుతూ, వారి మధ్య నిత్యం ఏదో ఒక చర్చ ఉండేలాగా ఓటర్లను ప్రభావితం చేయడంలో ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు పై చేయి సాధిస్తున్నారని చెప్పవచ్చు.

కానీ నిజానికి ఆ తరహా రాజకీయం క్షేత్రస్థాయిలో ఏమాత్రం పండుతుంది అనేది ప్రశ్నార్థకమే అని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పార్టీ నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక ఇష్యూను లేవనెత్తి, దానిపైన ప్రజల్లో నేరేటివ్ బిల్డ్ అయ్యేలా రాజకీయాలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఇదంతా ఒక కృత్రిమ మాయాజాలంగా మారిపోతుందని వాపోతున్నారు. ఇలాంటి నేరేటివ్స్ ప్రతిసారి ఫలితాలు ఇవ్వవు; స్థానికంగా రాజకీయాలు అనేవి లీడర్లు, కేడర్ మధ్య ఉన్న సంబంధం వల్లనే జరుగుతూ ఉంటాయని వారంతా వాపోతున్నారు.

“కుక్క తోకను ఊపాలి కానీ, తోక కుక్కను ఊపకూడదు” అనే సామెత రాజకీయాలకు, పొలిటికల్ స్ట్రాటజిస్టులకు వర్తిస్తుందని ఇరు పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి లీడర్లు అంటున్న మాట. నిత్యం సోషల్ మీడియాలోనూ, రేటింగ్స్‌లోనూ, సర్వేలపైన ఆధారపడితే ప్రజలతో కాంటాక్ట్ పూర్తిగా పోతుంది. రాజకీయాలు అనేవి ప్రజలు ఆ రాజకీయ పార్టీ నుంచి తమకు ఏమి లభిస్తుంది, పలానా లీడర్ దగ్గరకు వెళితే తమకు పని జరుగుతుందా లేదా అని ఆలోచిస్తారు; వాటి చుట్టే రాజకీయం నడుస్తుంది కానీ, సోషల్ మీడియాలో ఉండే స్ట్రాటజిస్టులతో కేవలం తాత్కాలిక ప్రయోజనమే తప్ప క్షేత్రస్థాయిలో ఫలితం శూన్యమని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *