Skip to content
ప్రపంచం వార్తలు

థాయ్‌లాండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. రూల్స్ మారాయి.. కొత్త గైడ్‌లైన్స్ ఇవిగో..

Prajapaksham 04 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
థాయ్‌లాండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. రూల్స్ మారాయి.. కొత్త గైడ్‌లైన్స్ ఇవిగో..

థాయ్‌లాండ్ వెళ్లే భారతీయులకు ముఖ్య సూచనలు

భారతీయులకు అత్యంత ఇష్టమైన అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌కు వెళ్లాలనుకునే వారు ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి ముందే అక్కడి ఇమ్మిగ్రేషన్ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో, బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ నెల‌ 2న భారత పౌరుల కోసం ప్రత్యేకంగా ఒక కీలక సలహా (ట్రావెల్ అడ్వైజరీ) జారీ చేసింది. థాయ్‌లాండ్ ప్రభుత్వం ఇటీవల భారతీయులకు వీసా రహిత ప్రయాణ సదుపాయాన్ని నిలిపివేయడంతో, ఈ కొత్త మార్గదర్శకాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

రాయబార కార్యాలయం జారీ చేసిన సూచనల ప్రకారం.. థాయ్‌లాండ్ వెళ్లే ప్రతి భారతీయ ప్రయాణికుడి వద్ద కనీసం ఆరు నెలల చెల్లుబాటు (వాలిడిటీ) ఉండే పాస్‌పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. దీనితో పాటు కన్ఫర్మ్ చేసిన రిటర్న్ ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్ వివరాలు, స్పష్టమైన ప్రయాణ ప్రణాళిక (టూరిస్ట్ ఐటినెరరీ) కూడా వెంట ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రయాణానికి 72 గంటల ముందే ఆన్‌లైన్‌లో ‘థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్’ (TDAC) పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిని థాయ్ ఇమ్మిగ్రేషన్ పోర్టల్ ద్వారా సమర్పించినప్పుడు ఒక క్యూఆర్ (QR) కోడ్ వస్తుంది. ఇమ్మిగ్రేషన్ చెకింగ్ సమయంలో అక్కడి అధికారులు ఈ క్యూఆర్ కోడ్‌ను పరిశీలిస్తారు.

భారత ప్రయాణికులు తమ పర్యటన ఉద్దేశాన్ని బట్టి సరైన వీసాను పొందాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ (VoA) లేదా వీసా మినహాయింపు సదుపాయాన్ని ఉపయోగించుకునే వారు తమ వెంట కనీసం 20,000 థాయ్ బట్ (సుమారు రూ. 57,446) నగదును (Cash) తప్పనిసరిగా రూపంలో తీసుకెళ్లాలి. థాయ్‌లాండ్‌లో పర్యటించడానికి పర్యాటకుడి వద్ద తగినన్ని ఆర్థిక నిధులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలో ఈ నగదును చూపించమని కోరే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు సంపాదించిన వారు పొరపాటున కూడా వీసా ఆన్ అరైవల్ లేదా టూరిస్ట్ వీసాపై ప్రయాణించవద్దని రాయబార కార్యాలయం గట్టిగా హెచ్చరించింది. ఉద్యోగం కోసం వెళ్లేవారు ప్రయాణానికి ముందే భారత దేశంలోనే సంబంధిత వర్క్ వీసాను పొందాలి. టూరిస్ట్ వీసాపై వచ్చి అక్కడ ఉద్యోగంలో చేరడం స్థానిక ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం నేరమని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే, థాయ్‌లాండ్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు, తమ గమ్యస్థాన దేశానికి సంబంధించిన వీసా, ఇతర ప్రయాణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు, నిలిపివేతలు తలెత్తకుండా ఉండేందుకు, బయలుదేరే ముందే అవసరమైన అన్ని పత్రాలు, నగదు నిబంధనలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని భారత రాయబార కార్యాలయం ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకుని, విమానాశ్రయాల్లోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద సమయాన్ని వృథా చేయకుండా అధికారులకు సహకరించాలని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *