Skip to content
తెలంగాణ వార్తలు

Telanagana BJP: బెంగాల్ వ్యూహం తెలంగాణలో బిజెపికి వర్కౌట్ అవుతుందా..?

Prajapaksham 04 Jul 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
Telanagana BJP: బెంగాల్ వ్యూహం తెలంగాణలో బిజెపికి వర్కౌట్ అవుతుందా..?

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ వ్యూహాలను మారుస్తుందా? తెలంగాణలో ఎలాగైనా అధికారం కైవసం చేసుకునేందుకు లక్ష్యంగా అడుగులు వేస్తోందా అంటే, ఆ దిశగా ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండాను తెలంగాణలో ఎగురవేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఇటీవల రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సాధించిన విజయం, అక్కడి రాజకీయ వ్యూహాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని నితిన్ నవీన్ తెలంగాణ బీజేపీ నేతలకు సూచన చేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, తెలంగాణలోని సామాజిక సమీకరణాల పైన కూడా దృష్టి సారించాలని బీజేపీ అధినాయకత్వం రాష్ట్రస్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. బెంగాల్ ఫార్ములాను తెలంగాణలో వర్కౌట్ చేయాలని బీజేపీ ఆశిస్తున్నప్పటికీ, తెలంగాణ రాజకీయం, బెంగాల్ రాజకీయం ఒకటి కాదని, అది ఇక్కడ వర్కౌట్ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా బెంగాల్ రాజకీయంలో అత్యంత ముఖ్యమైనది ప్రభుత్వ వ్యతిరేకత. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు బీజేపీకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు లేకపోయినా, రేవంత్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రజల్లో సానుభూతిని పొందుతోంది అని చెప్పవచ్చు. హామీల అమలు విషయంలో వెనకపడుతున్నప్పటికీ, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో ఇప్పటికీ కూడా సానుకూలమైన వాతావరణం కాంగ్రెస్‌పై ఉందని, ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా అది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (టిఆర్ఎస్)కు అడ్వాంటేజ్ అవుతుంది తప్ప, బీజేపీ వైపు ఓటు మొగ్గు చూపే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి అధికారం చేపట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచింది. అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికీ ప్రజల్లో గుర్తింపు ఉన్న లీడర్‌గానే పేరు సంపాదించుకున్నారు. బీజేపీలో రేవంత్ రెడ్డిని సరిపోల్చగల లీడర్ ఇంకా లేరు అని చెప్పవచ్చు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాస్త మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ అయినప్పటికీ, ఆయన ఇటీవల జరిగిన పరిణామాలతో సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన దాదాపు సైలెంట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు రామచంద్రరావు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉన్న నేతలు కారు.

బెంగాల్‌లో సువేందు అధికారి లాంటి నేతలు బీజేపీకి లభించారు, కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు అని చెప్పవచ్చు. దీనికి తోడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉంటే, వారిలో కనీసం నాలుగు జట్లు ఉన్నాయని బహిరంగంగానే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆ పార్టీకి ఇంకా క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ బీజేపీకి ఇంకా ఆ స్థాయిలో ఓటు బ్యాంకు సమీకరణ జరగలేదు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మూడవసారి కూడా బీజేపీ పాలన కేంద్రంలో ఉండటం వల్ల ప్రజల్లో వస్తున్న యాంటీ ఇంకంబెన్సీ కారణంగా సహజంగానే ప్రజల్లో ఉంటుంది, అందుకు తెలంగాణ ఏమీ ప్రత్యేకం కాదు అని చెప్పవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే బీజేపీకి 2028 అసెంబ్లీ ఎన్నికలు అనేవి అంత కేక్ వాక్ అయితే కాదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *