Skip to content
బిజినెస్ వార్తలు

పైరసీ కంటెంట్‌పై టెలిగ్రామ్‌కు కేంద్రం వార్నింగ్.. 15 రోజుల డెడ్‌లైన్

Prajapaksham 04 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
పైరసీ కంటెంట్‌పై టెలిగ్రామ్‌కు కేంద్రం వార్నింగ్.. 15 రోజుల డెడ్‌లైన్

టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వ నోటీసు.. 15 రోజుల్లో పైరసీ నిరోధక చర్యలు చేపట్టాలని ఆదేశం

భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున పైరసీ సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్ సర్క్యులేట్ అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఛానెళ్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) టెలిగ్రామ్ యాజమాన్యానికి గట్టి నోటీసులు జారీ చేసింది. కేవలం ఒక్కో ఛానల్‌ను విడివిడిగా తొలగించే తాత్కాలిక విధానాలకు స్వస్తి చెప్పి, ప్లాట్‌ఫామ్ స్థాయిలోనే పైరసీని పూర్తిగా అడ్డుకునేలా ఒక సమగ్రమైన శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నోటీసు ద్వారా పైరసీ కంటెంట్‌ను అనధికారికంగా పంచుతున్న అన్ని రకాల ఛానెల్స్, గ్రూప్స్, బాట్స్ (Bots) తో పాటు వాటిని నడుపుతున్న అడ్మిన్లు, సంబంధిత అకౌంట్లపై కఠినమైన నిఘా ఉంచి, చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. వీటితో పాటు భవిష్యత్తులో సినిమా నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, , లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (చట్టాన్ని అమలు చేసే) సంస్థలు ఇచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు వీలుగా ఒక సమర్థవంతమైన గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం (ఫిర్యాదుల పరిహార వ్యవస్థ) వివరాలను కూడా తమకు సమర్పించాలని సూచించింది. సమాచార సాంకేతిక చట్టం 2000 (IT Act), ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఒక మధ్యవర్తిగా (Intermediary) టెలిగ్రామ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుందని కేంద్రం ఈ సందర్భంగా గట్టిగా గుర్తు చేసింది.

ప్రభుత్వం తన నోటీసులో పైరసీ అనేది కేవలం సివిల్ వివాదం మాత్రమే కాదని, అది కాపీరైట్ చట్టం 1957, సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 ప్రకారం తీవ్రమైన క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని టెలిగ్రామ్‌కు స్పష్టం చేసింది. గతంలో ఇప్పటికే 3,000 కి పైగా పైరసీ ఛానెల్స్‌పై చర్యలు తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ, ప్లాట్‌ఫామ్‌పై ఇంకా యథేచ్ఛగా పైరసీ కంటెంట్ కొనసాగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై రాబోయే 15 రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వడంతో పాటు, తాము తీసుకున్న చర్యలకు సంబంధించిన ‘యాక్షన్ టేకన్ రిపోర్ట్’ (ATR) ను కచ్చితంగా సమర్పించాలని ఆదేశించింది.

ఒక అంచనా ప్రకారం భారతదేశంలో టెలిగ్రామ్ యాప్‌కు దాదాపు 15 కోట్ల మంది వినియోగదారులు (యూజర్లు) ఉన్నారు. అయితే కొంతకాలంగా ఈ యాప్ నిరంతరం ఏదో ఒక వివాదంతో చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గతంలో జరిగిన నీట్ (NEET) పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఘటనల సమయంలోనూ ఈ యాప్‌ తీవ్ర విమర్శల పాలై, తాత్కాలిక నిషేధాన్ని (బ్యాన్) సైతం ఎదుర్కొంది. దీనికి తోడు, ఇటీవల యాప్‌లో ఉన్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్న అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం నుండి టెలిగ్రామ్‌కు నోటీసులు అందాయి. తాజా పైరసీ నోటీసుల నేపథ్యంలో టెలిగ్రామ్ సంస్థ ఎలాంటి వ్యవస్థాగత మార్పులు చేయబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *