అయోధ్య రామాలయంలో అవినీతి జలగలు
Ayodhya Ram Temple Donation Case
ఎస్. బాబు, అధ్యక్షులు, టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్
సుమారు 400 సంవత్సరాల క్రితం భద్రాచలంలో శ్రీరాముని గుడి కట్టడానికి ప్రజల నుండి వసూలు చేసిన పన్నులను, నగలు, నగదు దుర్వినియోగ పరిచాడని భక్త రామదాసును గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా 12 సంవత్సరాలు కారాగారంలో బంధించాడు. రామదాసు సాధారణ వ్యక్తి కాదు. తానీషా ఏలుబడిలో ఆయన తహసీల్దార్. అయినా ఎటువంటి పక్షపాతం లేకుండా రాజు తన క్రింది అధికారిని శిక్షించి చట్టం ఎవరికీ చుట్టం కాదని నిరూపించాడు.
సీన్ కట్‌చేసి చూస్తే, ఆనాడు భద్రాచల రాముడు ఈనాడు అయోధ్య రాముడు. అప్పుడు నిధుల దుర్వినియోగం. ఇప్పుడు నిధులు మాయం. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అయోధ్య రామాలయంలో జరిగిన అవినీతిని బయటపెట్టేంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆయనపై సంఘ్ పరివార్ శక్తులు మరియు బిజెపి నాయకులు మాటలతో ముప్పేట దాడి చేశారు. అవినీతిని దాటవేసే ప్రయత్నం చేశారు. ఆ రాష్ట్ర బిజెపి ఎంపి కూడా అవినీతి జరిగింది అని మాట్లాడేసరికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఆలయ విరాళాలు అపహరించారని ఆరోపణలు వచ్చిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. ఈ ఎనిమిది మంది మహానుభావుల వెనుక ఇంకెందరో ఉద్దండులు ఉన్నారనడం సత్యదూరం కాదు. ముఖ్యమంత్రి పూర్తి విచారణ జరిపేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ ఏర్పడకముందే ఆలయ అధికారులు 79.85లక్షలు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు. సిట్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసి ఇచ్చిన నివేదిక మేరకు ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత చట్టం, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం జరిగింది.
200 కోట్ల కుంభకోణం జరిగింది. కుంభమేళా సమయంలో భారీ గా నిధుల వరద ఆలయాన్ని తాకింది. లెక్కలు గతి తప్పాయి. ఆలయ ట్రస్టీల ఆలోచన విధానం మారింది. సరైన మెకానిజం లేకపోవడంతో ఉద్యోగులు విజృంభించి అవినీతి తాండవం ఆడారు. చివరకు విరాళాలు లెక్కించే ఆఫీసు గది పక్కనే ఉన్న బాత్రూమ్‌లో స్వామి వారికి సంబంధించిన రెండున్నర లక్షల నిధులు పట్టుబడ్డాయని సిట్ తేల్చింది. నిజాల నిగ్గు తేల్చడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సిట్ కు బాధ్యతలిచ్చింది. ఇది కంటి తుడుపు చర్య అని, నిజ నిర్ధారణ జరగాలంటే సుప్రీం కోర్టు ద్వారా జుడీషియల్ విచారణ జరగాలని ప్రజలు, ఆధ్యాత్మిక గురువులు, సాధువులు, ప్రతిపక్ష నాయకులు కోరుతున్నారు. డబల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఎవరి భయం వారికుంటుంది. “దూద్ కా దూద్, పానీ కా పానీ, హమ్ కర్ కే దిఖాయేంగే” అన్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆలయ ట్రస్ట్ బైలాస్ ప్రకారం సిసి టీవి ఫుటేజ్ 180 రోజులు ఉండాలి. కానీ 45 రోజుల ఫుటేజ్ మాత్రమే ఆలయంలో భద్రపరచబడిందని సిట్ అధికారులు గుర్తించారు. అంటే ఇది ఓపెన్ రాబరీ అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. రాములవారి భక్తులు సమర్పించిన నగలు, నగదు నిర్లజ్జగా ఆలయ కమిటీ వారు దోచుకుని దాచుకున్నారు.
దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయ అవినీతిపై ఎన్నో చర్చోపచర్చ లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి కాని, ఆర్.ఎస్.ఎస్ చీఫ్ కాని ఈ విషయంపై పెదవి విప్పడం లేదు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్న విధంగా వారిని నిశ్శబ్దం ఆవహించింది. నీతి నిజాయితీ గురించి మన్ కీ బాత్‌లో ప్రవచనాలు వల్లించే పెద్దమనిషి రామాలయం లో జరిగిన స్టోరీ గురించి, నిధుల దారి మళ్ళింపు గురించి మాట్లాడరెందుకు? ఇదే పని కాంగ్రెస్ కానీ లేదా వామపక్ష పార్టీలు కానీ చేసి ఉంటే వారి ముత్తాతల నుండి ముని మనవళ్ళ దాకా మన్ కీ బాత్‌లో వీరంగం వేసేవారు కదా. వీరి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మనిషిని, మతాన్ని, మాధవుణ్ణి కూడా వాడేసుకున్నారు.
ఆలయానికి 3,500 కోట్ల విరాళాలు వచ్చాయని గణాంకాలు చెప్తున్నాయి. అందులో 200 కోట్లు మాయమైనాయి. ఇవి కాకుండా స్వామి వారి వెండి పాదుకలు, భక్తులు విశ్వాసంతో సమర్పించిన బంగారు, వెండి ఇటుకలు కూడా మాయమయ్యాయి. ఈ అవినీతి జరగకముందు ప్రతిరోజు స్వామివారి ఆదాయం 8 నుండి 12 లక్షల రూపాయలు. అవినీతి జలగలు రంగప్రవేశం చేసిన తరువాత ఈ ఆదాయం రోజుకు లక్షకు పడిపోయిందని లెక్కలు చెప్తున్నాయి. 5 వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం ఏ రోజు కా రోజు అధికారులు వెల్లడిస్తారు. కానీ అటువంటి మెకానిజం అయోధ్య రామాలయంలో లేదు. ప్రత్యక్ష కలియుగ దైవం అయిన తిరుమల వేంకటేశ్వరుడి ఆలయంలో కూడా ఎన్నో అవినీతులు జరిగాయి. లడ్డూ తయారీలో అవినీతి జరిగిందని ఇప్పటి వరకు అది రగులుతూనే ఉంది. శబరిమల ఆలయంలో కూడా ప్రధానద్వారం, తలుపులకు తాపడం చేసిన బంగారం అపహరణ జరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా బదరీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలలో కూడా నగలు మాయం అంటూ వార్తలు గుప్పుమన్నాయి.
అయోధ్య రాముల వారికి కొన్ని కోట్లమంది ఇచ్చిన డొనేషన్స్ మనీ కాదు. అది ప్రజల నమ్మకం. దేవుడిపై వారికున్న భక్తికి చిహ్నం. కోట్లాది మంది భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బిజెపి కూకటివేళ్ళ తో పెకిలించింది. రాబోయే 9 నెలల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగాల్సిన వేళ ఇది భారతీయ జనతాపార్టీకి శరాఘాతంలా తగిలింది. బిజెపి పార్టీ కాని, సంఘ్ పరివార శక్తులు కాని మోదీ అంటే విశ్వాసం విశ్వాసం అంటే మోదీ అని ప్రచారం చేస్తున్నాయి. మరి ప్రధానమంత్రి, భగవంతుడిపై భక్తులు చూపిన విశ్వాసం గురించి స్పందించడం లేదు. సహజంగా మతాలకు సంబంధించిన కార్యక్రమాలను మతాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు ప్రారంభిస్తారు. కానీ అయోధ్య రామాలయ ప్రారంభం (ప్రాణప్రతిష్ఠోత్సవం) మాత్రం ప్రధానమంత్రి చేతులమీదుగా జరగడం రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోయాయి.
రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్. ఎస్.ఎస్ బాబ్రీ మసీదును కూల్చింది. బిజెపి ఎదుగుదలలో రామ మందిరం పోరాటం ఉంది. ఈ ఉద్యమం లేకపోతే బిజెపి ఈ స్థితిలో ఉండేది కాదు. 1991లో బిజెపి 120స్థానాలు గెలిచిందంటే దానికి కారణం ఎల్.కె.అద్వానీ రథయాత్రే. ఆ తరువాత బిజెపి గ్రాఫ్ ఊహించని విధంగా పెరిగిపోయి 2014 నుంచి వరుసగా 3 సార్లు అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది. నాడు చేసిన ఉద్యమాలలో అనేకమంది సమిధలైనారు. వారి త్యాగాల పునాదులపై నిర్మించిన రామ మందిరంలో ఇంత భారీ కుంభకోణమా అని సాధుజనులు, ఆధ్యాత్మిక గురువులు ఆవేదన చెందుతున్నారు. మతం, మందిరం, సనాతన ధర్మం, సత్య వాక్యాలు చెప్పే విశ్వగురువు ఈ అవినీతి అనకొండలను ఎందుకు అరికట్టలేకపోయారు? దేవుణ్ణడ్డం పెట్టుకుని దుర్మార్గాలకు ఒడిగడుతున్న ఈ దోపిడీదొంగలను తానీషా లాగా ఎందుకు శిక్షించలేకపోతున్నారు? ఆలయంలో జరిగిన నగదు, ఆభరణాల దోపిడీ తీరును గ్రహిస్తే అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలో రొయ్యలు మాత్రం ఖాళీ అనే సామెత గుర్తుకు రాకతప్పదు!