Skip to content
తెలంగాణ వార్తలు

అన్నం అమృతమా ? అణువణువు విషమా ?

Prajapaksham 04 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
అన్నం అమృతమా ? అణువణువు విషమా ?

అన్నం అమృతమా ? అణువణువు విషమా ? ( ప్రతీకాత్మక చిత్రం)

కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్ట్

ప్రతి మనిషి జీవనానికి ఆహారం మూలాధారం. భారతీయ సంస్కృతిలో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తారు. అయితే నేడు మనం తింటున్న ఆహారం నిజంగా పోషకాహారమా? లేక నెమ్మదిగా శరీరాన్ని కృశింపజేసే విషమా? అనే ప్రశ్న ప్రతి కుటుంబాన్ని వెంటాడుతోంది. కల్తీలు, రసాయన అవశేషాలు, యాంటీబయాటిక్స్‌ దుర్వినియోగం, అపరిశుభ్రత, ప్లాస్టిక్‌ కాలుష్యం వంటి సమస్యలు ఆహార భద్రతను అత్యంత కీలకమైన ప్రజారోగ్య అంశంగా మార్చేశాయి. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే సురక్షితమైన ఆహారమే మొదటి మెట్టు అని గ్రహించాలి.

హరిత విప్లవం ద్వారా భారత్‌ ఆహార కొరతను అధిగమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగింది. కానీ ఎక్కువ ఆహారం పండించడంపై చూపిన శ్రద్ధ, నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడంపై చూపలేకపోయింది. నేడు రైతు పండించిన పంట నుంచి వినియోగదారుడి పళ్ళెం వరకు ప్రయాణించే ప్రతి దశలో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. కేవలం కడుపు నింపే ఆహారం కాదు, ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం అందించడం కూడా సమాజం ముందు ఉన్న బాధ్యత.

మనం తినే చికెన్‌, గుడ్లు, పాలు వంటి ఆహార పదార్థాల్లో యాంటీబయాటిక్స్‌ అవశేషాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలు వైద్య రంగాన్ని కలవరపెడుతున్నాయి. పశువులు, కోళ్లలో వేగంగా ఎదుగుదల కోసం లేదా వ్యాధులు నివారించడానికి అధికంగా యాంటీబయాటిక్స్‌ వాడటం సాధారణమైంది. దీని ఫలితంగా మనుషుల్లో ‘యాంటీమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌’ అనే ప్రమాదకర పరిస్థితి పెరుగుతోంది. అంటే భవిష్యత్తులో సాధారణ జ్వరానికి, ఇన్‌ఫెక్షన్‌కు ఇచ్చే మందులు కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రపంచ ఆరోగ్య నిపుణులు దీన్ని రాబోయే దశాబ్దాల్లో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాల్లో ఒకటిగా హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో పంటలపై విచక్షణారహితంగా వాడుతున్న కలుపు నాశకాలు, పురుగుమందులు కూడా ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి.

డిజిటల్‌ యుగంలో ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు లక్షలాది కుటుంబాల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. కానీ మనం ఆర్డర్‌ చేస్తున్న ఆహారం ఏ వంటగదిలో తయారవుతోంది? అక్కడ పరిశుభ్రత ప్రమాణాలు ఎలా ఉన్నాయి? వాడుతున్న నూనెలు ఎన్ని సార్లు తిరిగి ఉపయోగిస్తున్నారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చాలా సందర్భాల్లో ఉండవు. ప్రత్యేకించి కేవలం వంట కోసం మాత్రమే పనిచేసే క్లౌడ కిచెన్లపై సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

మన దేశంలో వేడి ఆహారాన్ని నేరుగా ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ డబ్బాల్లో ప్యాక్‌ చేయడం సాధారణ దృశ్యం. వేడి తగలగానే ప్లాస్టిక్‌లోని కొన్ని రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇవి హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆహార భద్రత అంటే కేవలం కల్తీలు లేకపోవడం మాత్రమే కాదు; ఆహారం నిల్వ, రవాణా, ప్యాకేజింగ్‌ కూడా అంతే ముఖ్యమైన అంశాలు.

భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు రోజూ వీధి ఆహారంపై ఆధారపడుతున్నారు. అయితే పరిశుభ్రమైన నీరు, సరైన నిల్వ విధానాలు, శుభ్రత ప్రమాణాలు లేకపోవడం వల్ల అనేక అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. టైఫాయిడ్‌, కలరా, గ్యాస్ట్రోఎంటరైటిస్‌ వంటి వ్యాధులకు కలుషిత ఆహారం, నీరే ప్రధాన కారణాలు. మరోవైపు సరైన శీతలీకరణ వ్యవస్థలు లేకపోవడంతో దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో గణనీయమైన భాగం వినియోగదారుల వరకు చేరకముందే పాడవుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. భారతదేశంలో చిన్నారుల్లో పోషకాహార లోపానికి కేవలం ఆహార కొరత మాత్రమే కారణం కాదు. తరచూ వచ్చే విరేచనాలు, ఆహార సంబంధిత ఇన్‌ఫెక్షన్లు కూడా శరీరం పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటున్నాయి. అంటే సురక్షితం కాని ఆహారం, పోషకాహారాన్ని కూడా నిరుపయోగంగా మార్చేస్తోంది.

నాలుగు స్తంభాలపై నిలవాల్సిన ఆహార భద్రత ఈ సమస్యకు పరిష్కారం ఒకే శాఖ లేదా ఒకే సంస్థ చేతిలో లేదు. ప్రభుత్వం, ఆహార నియంత్రణ సంస్థలు కఠిన తనిఖీలు, ఆధునిక ప్రయోగశాలలు, వేగవంతమైన శిక్షా విధానాలను అమలు చేయాలి. రైతాంగం, పశుసంవర్ధక రంగం రసాయనాలు, యాంటీబయాటిక్స్‌పై ఆధారపడే విధానాలను తగ్గించాలి. ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు, వ్యాపారులు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. వినియోగదారులు కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు, గడువు తేదీలు పరిశీలించడం, వేడి ఆహారానికి ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిరాకరించడం వంటి అలవాట్లు పెంపొందించుకోవాలి.

భారతదేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా, ప్రజల ఆరోగ్యం క్షీణిస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. కలుషిత ఆహారం వల్ల దేశ ఉత్పాదకత, వైద్య వ్యయం, మానవ వనరుల నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆహార భద్రత అనేది ప్రయోగశాలల్లో జరిగే పరీక్షలకే పరిమితమైన అంశం కాదు. అది పొలంలో విత్తనం నాటిన క్షణం నుంచి మొదలై, పంట కోత, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, వంటగది మీదుగా మన పళ్ళెం వరకు సాగే నిరంతర బాధ్యత. ఈ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క సత్యం.. సురక్షితమైన ఆహారం లేకుండా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం కాదు. ఆరోగ్యవంతమైన సమాజం లేకుండా అభివృద్ధి చెందిన భారతదేశం అసాధ్యం. ‘సురక్షిత ఆహారం ప్రతి పౌరుడి హక్కు… దానిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *