Skip to content
సంపాదకీయం వార్తలు

‘సర్‌’ ప్రక్రియ నత్తనడక

Prajapaksham 04 Jul 2026 0 నిమిషాల పఠనం సంపాదకీయం
‘సర్‌’ ప్రక్రియ నత్తనడక

SIR

భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశంపై జూన్‌ 25న ప్రారంభమైన ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సర్వే (ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ మొత్తంమీద నత్తనడకన సాగుతున్నట్లు, ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో మరీ నెమ్మదిగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులై 31 ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ గడువు. షెడ్యూలు ప్రకారం బూత్‌లెవల్‌ అధికారులు (బిఎల్‌ఒలు) ముందుగా ఇంటింటికీ వెళ్లి నమోదు ఫారాలు ఇవ్వాలి. వాటిపై ఓటరు పేరు వగైరా ముద్రించి ఉంటాయి. రెండో దఫా వచ్చి ఫారం నింపటానికి సహాయపడాలి. లోగడ ముమ్మర సర్వే నిర్వహించిన 2002 నాటి ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉంటే ఆ ఓటరు కార్డు నెంబరు తదితర వివరాలు పొందుపరచాలి. చాలామంది ఓటర్ల వద్ద 24 ఏళ్లనాటి కార్డులు సురక్షితంగా ఉండే అవకాశాలు తక్కువ. ఆ తర్వాత కాలంలో ఓటరుగా నమోదైనవారు తమవద్ద ఉన్న తాజా ఓటరు కార్డుతోపాటు 2002 జాబితాలో ఉన్న తల్లిదండ్రుల సమాచారం, వారు లేని సందర్భంలో బంధువుల సమాచారం పొందుపరచాలి. వెబ్‌సైట్‌ల ద్వారా, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా 2002 నాటి ఓటర్ల జాబితాలు అన్వేషించే అవకాశమున్నా అది చాలా శ్రమ, సమయంతో కూడినపని. కిరాయి ఇళ్లు మారుతుండే వారి పరిస్థితి మరీ అయోమయం. ఇక్కడే బిఎల్‌ఒల సహాయం అవసరమవుతుంది.
సర్‌ ప్రక్రియ నిర్వహణకోసం బిఎల్‌ఒలను నియమించి వారికి శిక్షణ ఇచ్చినా, రాజకీయ పార్టీల ప్రతినిధులు వారివెంట ఉన్నా నగరాలు, పట్టణాలలో ఓటరు నమోదు ఫారాల పంపిణీ 40శాతం దాటినట్లు లేదు. జనాభా నివాస ప్రాంతాల్లో మార్పులు, కొత్తగా వచ్చిన గృహసముదాయాలు, పెద్దసంఖ్యలో జనాలు వలస వెళ్లటం ఇత్యాది అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా పేదలు, దళితులు, ఇతర బలహీన
వర్గాలు ఈ కేటగిరీలో ఉంటారు. మరణించినవారి పేర్లు, ఒకటికన్నా ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు, శాశ్వతంగా నివాస ప్రాంత మార్పుకు సంబంధించిన ఓట్లను కచ్చితమైన ధృవీకరణతో తొలగించటం నిరభ్యంతరం. కాని అశ్రద్ధతో, కొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిళ్లతో ఓట్లను తొలగించటం, నమోదు ఫారాలు పంపిణీ చేయకుండానే ఇచ్చినట్లు లెక్కలు రాయటం, రాజకీయులు వాటిని భర్తీ చేసి గుండుగుత్తగా సమర్పించినా ఆమోదించటం, జాబితాల తయారీలో, ముద్రణలో సర్వసాధారణంగా జరిగే తప్పుల కారణంగా లీగల్‌ వ్యత్యాసాల పేరుతో ఓట్లు తొలగించటం వంటి అక్రమాలకు ఎన్నికల అధికారులు ఒడిగడితే అది ప్రతి వయోజనుడికీ ఓటు హక్కు ఇచ్చిన రాజ్యాంగాన్ని ధిక్కరించటం, ఏ రాజకీయ పార్టీకో ఉద్దేశపూర్వకంగా సహాయం చేయటం అవుతుంది. ఇటువంటి అక్రమాల కారణంగానే బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో జరిగిన కుట్రలు, కుయుక్తులు అనుభవంలోకి వచ్చాయి. ఓటు హక్కు అనేది రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, పౌరుని
ప్రాథమిక హక్కు పరిరక్షణ. ఆ బాధ్యతను పౌరునిపైనే పెట్టటం సరైనది కాదు. ఇంతకుమునుపు సర్‌ నిర్వహించిన అరడజను రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఓట్ల ముమ్మర రివిజన్‌ చేబట్టి ఆ ఎన్నికల షెడ్యూలుకోసం ఎంతో తొందరపడ్డారు. ఇప్పుడు సర్‌ చేబట్టిన రాష్ట్రాల్లో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు లేవు. అందువల్ల ఎన్నికల కమిషన్‌ 20వ తేదీనాటికి పరిస్థితిని సమీక్షించుకుని తన రివిజన్‌ షెడ్యూలును పొడిగిస్తూ పునర్నిర్ణయం చేయవచ్చు.
బిఎల్‌ఒలకు ఇది కఠిన పరీక్షా సమయం. వారం గడిచినా ఏ బిఎల్‌ఒ తమ ఇంటికి రాకపోవటంతో ఓటర్లలో అసహనం, ఆందోళన పెరుగుతున్నది. కొద్దిరోజుల క్రితంవరకు తమకు ఫారాలు అందలేదని హైదరాబాద్‌ సిటీ, రంగారెడ్డికి చెందిన పలువురు బిఎల్‌ఒలు అంటున్నారు. ఒకవేళ బిఎల్‌ఒ వచ్చినా తమ పేర్లు లేనందున తమను మరో బిఎల్‌ఒ వద్దకు వెళ్లమంటున్నారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క బిఎల్‌ఒ 1200 ఓటర్లను కనీసం మూడుసార్లు కలవాలి. రాష్ట్రంలో బుధవారంనాటికి మొత్తం 2.56 కోట్ల ఓటరు నమోదు ఫారా లు పంపిణీ జరిగినట్లు (75.73 శాతం కవరేజి) ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ ప్రకటన తెలిపింది.
కాగా హైదరాబాద్‌ మహానగరంలో బుధవారంనాటికి ఫారాల పంపిణీ 40 శాతంలోపే ఉంది. కాబట్టి ముఖ్య ఎన్నికల అధికారి ఈ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టి బిఎల్‌ఒల పనిని వేగిరపరచాలి. నగరంలో నివసిస్తున్న పదులవేలమంది ఓట్లు వారి స్వస్థలాల్లోనే ఉన్నాయి. వారు పలు కారణాలరీత్యా అక్కడే ఓటు హక్కు కోరుకుంటారు. 2024 ఓటర్ల జాబితాలో పేరున్న వారందరికీ నమోదు ఫారాలు ఇవ్వగలిగితే నమోదు రేటు పెరుగుతుంది.
నగరంలో ఎప్పుడూ ఓటింగ్‌ శాతం తక్కువగానే ఉంటుంది. ఓటరు నమోదే గణనీయంగా తగ్గితే ఓటింగ్‌ శాతం మరింత తగ్గి ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ వక్రీకరణ పొందుతుంది. కాబట్టి అధికారులు వేగిరం పనులు పూర్తి చేయాలి.

ట్యాగ్‌లు: Election Commission SIR SIR News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *