Skip to content
క్రీడలు వార్తలు

53 కేజీల కేట‌గిరీలో.. వినేశ్ పోగ‌ట్ తొలి విజయం నమోదు..

Prajapaksham 30 May 2026 1 నిమిషాల పఠనం క్రీడలు
53 కేజీల కేట‌గిరీలో.. వినేశ్ పోగ‌ట్ తొలి విజయం నమోదు..

ఆసియా క్రీడల అర్హత కోసం జరుగుతున్న రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్‌లో స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్ (Vinesh Phogat) అదిరిపోయే ఆటతీరుతో బోణీ కొట్టింది. ఎన్నో న్యాయపరమైన అడ్డంకులను దాటుకుని రింగులోకి దిగిన వినేశ్, ఇవాళ జరిగిన ఓపెనింగ్ బౌట్‌లో ప్రత్యర్థి జ్యోతిపై 7-1 స్కోరు తేడాతో ఘన విజయం సాధించి తనేంటో నిరూపించుకుంది.

మ్యాచ్ ప్రారంభంలో ఆచితూచి ఆడిన వినేశ్.. బౌట్ సాగుతున్న కొద్దీ తన అనుభవాన్ని ఉపయోగించి గేమ్‌ను పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకుంది. మొదట పుష్ పాయింట్ సాధించిన ఆమె, ఆ తర్వాత డబుల్ లెగ్ అటాక్‌తో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్ చేసింది. ఇక సెకండ్ పీరియడ్‌లో వినేశ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రైట్ లెగ్ అటాక్ వ్యూహాన్ని చక్కగా అమలు చేసి 3-0తో ముందంజ వేసింది. ఆ తర్వాత జ్యోతి కూడా లెగ్ అటాక్‌తో పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వినేశ్ తన అద్భుతమైన కౌంటర్ అటాక్‌తో వరుసగా రెండు క్విక్ మూవ్స్ చేసి స్కోరును 7-0కి తీసుకెళ్లింది. చివర్లో జ్యోతి కేవలం ఒక పుష్ అవుట్ పాయింట్ మాత్రమే సాధించగలిగింది.

ఈ గెలుపు ఉత్సాహంతో వినేశ్ పోగట్ తన తదుపరి బౌట్‌లో నిషూతో తలపడనుంది. నిజానికి, భారత రెజ్లింగ్ సమాఖ్య తొలుత వినేశ్‌కు ఈ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం నిరాకరించింది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి, సుదీర్ఘ పోరాటం తర్వాత 53 కేజీల విభాగంలో ఆడేందుకు అధికారిక అనుమతి తెచ్చుకుని రింగులో ఈ అద్భుత విజయాన్ని నమోదు చేయడం గమనార్హం.