Skip to content
జాతీయం వార్తలు

రిటైర్మెంట్‌కు సిద్ధమైన తొలి ‘అగ్నివీర్’ బ్యాచ్.. భవిష్యత్తుపై బిగ్ క్వశ్చన్ మార్క్..

Prajapaksham 26 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
రిటైర్మెంట్‌కు సిద్ధమైన తొలి ‘అగ్నివీర్’ బ్యాచ్.. భవిష్యత్తుపై బిగ్ క్వశ్చన్ మార్క్..

రిటైర్మెంట్‌కు సిద్ధమైన తొలి 'అగ్నివీర్' బ్యాచ్.. భవిష్యత్తుపై బిగ్ క్వశ్చన్ మార్క్..

 కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదమైనది అగ్ని వీర్ నియామకం కూడా ఒకటిగా చెప్పవచ్చు. రక్షణ శాఖలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా, సైనికులు అగ్ని వీలుగా గుర్తింపబడి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే సర్వీస్ లో ఉంటారు. ఈ నాలుగు సంవత్సరాల అనంతరం 75 శాతం మంది అగ్ని వీరులు సైన్యం నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన తొలి బ్యాచ్ ఇప్పుడు బయటకు రానుంది. అగ్నివీర్‌ల పదవీకాలం ముగింపు నేపథ్యంలో కేంద్రం కొత్త సవాలను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. ముఖ్యంగా అగ్నివీర్  పథకం కింద నియమితులైన తొలి బ్యాచ్ అగ్నివీరులు 4 ఏళ్ల సేవా కాలం మరో 3–4 నెలల్లో ముగింపునుకు వచ్చేసింది. అయితే ప్రస్తుతం కేంద్రం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం 75 శాతం మంది అగ్నివీర్‌లు విధుల నుంచి విడుదల అవుతారు. కేవలం 25% మందిని మాత్రమే శాశ్వత సేవలో కొనసాగిస్తారు.

2022లో అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా యువత నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బిహార్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో సైనిక ఉద్యోగాలు ప్రధాన ఉపాధి అవకాశంగా ఉండటంతో ఈ పథకంపై వ్యతిరేకత ఎక్కువగా కనిపించింది.భారత నౌకాదళం (నేవీ) అగ్నివీర్‌ల తొలి బ్యాచ్‌ను మొదటగా నియమించారు. వీరిలో  2,600 మంది అగ్నివీర్‌లు (వారిలో 273 మంది మహిళలు) 2022 నవంబర్‌లో ఐఎన్‌ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభించారు. ఈ తొలి బ్యాచ్‌కు 2023 మార్చి 28న పాసింగ్ అవుట్ పరేడ్ (POP) నిర్వహించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తొలి బ్యాచ్‌లు 2023 జనవరిలో శిక్షణ ప్రారంభించగా, వారి నాలుగేళ్ల పదవీకాలం 2027 ప్రారంభంలో ముగియనుంది.

ఇదిలా ఉంటే అగ్ని వీర్ పథకంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటి శాశ్వత సేవలో కొనసాగించే అగ్నివీర్‌ల శాతాన్ని 25% నుంచి 50%కు పెంచడం. వంటి అశాలను పరిశీలిస్తోంది.  ఇప్పటికే అగ్నివీర్‌లకు పారా మిలిటరీ దళాలు, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు (Defence PSUs), రక్షణ పౌర ఉద్యోగాలు, సివిల్ ఏవియేషన్, మర్చంట్ నేవీ వంటి రంగాల్లో రిజర్వేషన్ ప్రకటించారు. అలాగే ముద్ర (Mudra), స్టాండ్ అప్ ఇండియా (Stand Up India) పథకాల ద్వారా రుణాలు అందించి స్వయం ఉపాధి, వ్యాపారాలు ప్రారంభించేందుకు సహాయం చేసే ప్రణాళికలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

ప్రస్తుత అందుబాటులో ఉన్నటువంటి పథకం ప్రకారం అగ్ని వీరులు పెన్షన్ కు అర్హులు కారు వీరికి ఎక్స్ సర్వీస్ మెన్ హోదా కూడా లభించదు. అలాగే వీరు సర్వీస్ నుంచి బయటకు వచ్చాక రూ. 11.71 లక్షలు (వారి జీతం నుంచి చేసిన పొదుపు + ప్రభుత్వ సమాన వాటా + వడ్డీతో కలిపి) అందజేస్తారు. ఈ అగ్ని వీరుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే సాధారణ సైనికులుగా గుర్తింపు పొందుతారు సర్వీస్ లో కొనసాగుతారు. అయితే బయటకు వచ్చిన అగ్ని వీరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ తొలి బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత అసలు సమస్య ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చే అవకాశం ఉందని మాజీ సైనిక ఉద్యోగులు చెబుతున్నారు. ప్రాక్టికల్ గా ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీటిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని వారు వాపోతున్నారు. 

పెన్షన్ లేకపోవడం: 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు పెన్షన్, గ్రాట్యుటీ వంటి ఎలాంటి పదవీ విరమణ ప్రయోజనాలు ఉండవు. 25 ఏళ్ల వయసులో సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అనుభవం కోల్పోవడం: నాలుగేళ్లలో శిక్షణ పొందిన సైనికుల్లో 75% మందిని పంపించడం వల్ల వారి అనుభవాన్ని సైన్యం కోల్పోతుందని కొందరు మాజీ సైనికాధికారులు అంటున్నారు.

మానసిక ఒత్తిడి: శాశ్వత ఉద్యోగం కోసం కేవలం 25% మందినే ఎంపిక చేయడం వల్ల అగ్నివీరుల మధ్య తీవ్ర పోటీ, ఒత్తిడి ఉంటుందనే ఆందోళన కూడా ఉంది. 

గ్రామీణ యువతపై ప్రభావం: గ్రామీణ ప్రాంతాల్లో సైనిక ఉద్యోగం స్థిరమైన ఉపాధిగా భావిస్తారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం ముగియడం ఆ వర్గాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని విమర్శలు ఉన్నాయి.

ఉద్యోగ హామీ స్పష్టత: కేంద్రం, కొన్ని రాష్ట్రాలు పోలీసు, పారామిలిటరీ, ఇతర రంగాల్లో రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ, అగ్నివీరులకు వెంటనే ఉద్యోగం లభిస్తుందనే హామీ ఇందులో లేదు.

ట్యాగ్‌లు: agniveer scheme