రష్యాపై ఆంక్షలతో భారత్‌ను బెదిరిస్తున్న అమెరికా
Russia and India
అజద్ మీర్జా
వాషింగ్టన్ ‘రష్యా ఆంక్షల’ చట్టంపై న్యూఢిల్లీ హెచ్చరిక సుంకాల వివాదానికి మించినది. ఇది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, ఇంధన భద్రత, దేశ సరిహద్దుల వెలుపల నుంచి బెదిరింపులు లేకుండా విదేశాంగ విధానాన్ని నిర్వహించుకునే హక్కుకు ఒక రక్షణ. బీజింగ్ ఆచితూచి ప్రతిస్పందించిన తీరు ఒక పెద్ద పోటీని సూచిస్తుంది. యుద్ధం, వాణిజ్యం, చమురు ఒకచోట కలుస్తున్న తరుణంలో ఆసియా ఆర్థిక నిర్ణయాలను ఎవరు నిర్దేశిస్తారనేది ఆ పోటీ సారాంశం.
అమెరికా తన రష్యా విధానాన్ని ఒక విస్తృత ఆర్థిక బలప్రయోగ సాధనంగా మార్చే దిశగా మరింత ముందుకు కదిలింది. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కట్టబెట్టే ‘లిండ్సే ఓ. గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ను అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. 262- ఓట్ల తేడాతో ఆమోదం పొంది న ఈ బిల్లు, రష్యా ఇంధన, రక్షణ రంగాలను మాత్రమే కాకుండా, ఆంక్షలను తప్పించుకోవడానికి మాస్కోకు సహాయపడుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న దాని ట్యాంకర్ల ‘రహస్య నౌకల’ను కూడా లక్ష్యంగా చేసుకుంది. భారతదేశానికి సంబంధించి ఈ శిక్షాత్మక సుంకం కారణంగా రష్యా ముడి చమురు ధర పెరుగుతుందా లేదా అనేది మాత్రమే ఇక్కడ సమస్య కాదు. న్యూఢిల్లీ ఇంధన విధానం, విదేశాంగ విధానం నిబంధనలను వాషింగ్టన్ నిర్దేశించగలదా లేదా అన్నదే అసలు ప్రశ్న. ప్రతిపాదిత చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేయగలవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో, దేశం తన ఇంధన భద్రత, వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ‘అన్ని అవసరమైన చర్యలు’ తీసుకుంటుందని కూడా స్పష్టం చేసింది. ఇందుకు ఉపయోగించిన భాషను చాలా జాగ్రత్తగా ఎంచుకున్నారు. ప్రతీకార చర్యలతో న్యూఢిల్లీని బెదిరించలేదు, వాషింగ్టన్‌తో సంప్రదింపులను కూడా తిరస్కరించలేదు. దానికి బదులుగా, ఈ వివాదాన్ని సార్వభౌమాధికారం పరిధిలోకి తీసుకువచ్చింది. ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధానికి మద్దతుగా కాకుండా, జాతీయ అవసరాలు, మార్కెట్ పరిస్థితులు, సరఫరా లభ్యతను బట్టి మాత్రమే తాము చమురును కొనుగోలు చేస్తున్నామని భారతదేశం వాదిస్తోంది. దాని వైఖరి ఒక దీర్ఘకాలిక సూత్రాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఒక దేశం అధికార పరిధికి మించి, ఆ దేశం విధించిన ఆంక్షలను యథాతథంగా స్వీకరించటాన్ని భారతదేశం అంగీకరించదు.
ఈ ప్రతిస్పందనలోని దృఢత్వానికి ఆర్థికపరమైన అంశాలే కారణం. 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ముడి చమురు దిగుమతులలో సుమారు 30.3 శాతం రష్యా నుంచే వచ్చాయి. వీటి విలువ దాదాపు 40.8 బిలియన్ల డాలర్లు. జులై మాసంలో భారతదేశం దిగుమతి చేసుకున్న ముడి చమురులో సగానికి పైగా రష్యా సరఫరాలు ఉన్నాయని, ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, వెనిజులా, బ్రెజిల్, ఒమన్, యునైటెడ్ స్టేట్స్ నుండి కలిపి వచ్చిన దిగుమతులను కూడా అధిగమించిందని నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఆధారపడటం కేవలం వాణిజ్యపరమైనది మాత్ర మే కాదు. మధ్యప్రాచ్యం అంతటా సంఘర్షణ, రవాణా అంతరాయాలు, అస్థిరత నెలకొన్న తరుణంలో, రష్యా చమురు భారతీయ రిఫైనరీలకు తక్కువ ధరకు లేదా పోటీ ధరలకు ముడి చమురును పొందడంలో సహాయపడింది.
కాబట్టి, రష్యా సరఫరాలను భర్తీ చేయడం తక్షణమే జరిగేది కాదు, తక్కువ ఖర్చుతో కూడుకున్నదీ కాదు. సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్ లేదా వెనిజులా నుంచి భారతదేశం మరింత కొనుగోలు చేయవచ్చు, కానీ ప్రత్యామ్నాయ సరుకులు మరింత ఖరీదైనవిగా, తక్కువ విశ్వసనీయత కలిగినవిగా లేదా రవాణా ప్రమాదాలతో పరిమితమైనవిగా ఉండవచ్చు. హోర్ముజ్ జలసంధి ఒక కీలకమైన ఇంధన కారిడార్‌గా కొనసాగుతుండగా, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ధరలు, షిప్పింగ్ బీమాపై అనిశ్చితిని పెంచింది. రష్యా దిగుమతులను బలవంతంగా తగ్గించడం భారతదేశంలో ఇంధనం, రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాల ను పెంచవచ్చు.
దీని ప్రభావం చమురు మార్కెట్‌కు మించి విస్తరిస్తుంది. భారతీయ ఎగుమతిదారులు ఇప్పటికే అమెరికా వాణిజ్య చర్యల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 100 శాతం సుంకం విధించడం వల్ల అమెరికా మార్కెట్ లో అనేక భారతీయ ఉత్పత్తులు వాణిజ్యపరంగా పోటీపడలేవు. ఇది వస్త్రా లు, ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు మరియు చిన్న తరహా తయారీ రంగాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీని ఫలితంగా ఏర్పడే షాక్, ఇప్పటికే క్లిష్టంగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను మరింత క్లిష్టతరం చేయడంతో పాటు, ఉపాధిని, ఎగుమతి ఆదాయాలను బలహీనపరుస్తుంది. విశ్లేషకులు ఈ ఆంక్ష ల చట్టాన్ని రష్యాను శిక్షించే ప్రయత్నంగానే కాకుండా, భారతదేశానికి వ్యతిరేకంగా ఒక బేరసారాల ఆయుధంగా కూడా వ్యాఖ్యానించారు.
ఇక్కడే ట్రంప్ అంశం ముఖ్యమవుతుంది.అంతర్జాతీయ సంబంధాల పట్ల ట్రంప్ వైఖరి సుంకాలను కేవలం వాణిజ్య రక్షణ సాధనాలుగా కాకుండా, ఒత్తిడి సాధనాలుగా పరిగణిస్తుంది. ఆయన ప్రభుత్వం ఈ చర్యను దేశీయం గా రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చే ప్రభుత్వాలను శిక్షిం చే మార్గంగా ప్రదర్శించవచ్చు, అదే సమయంలో భారతదేశంపై ఉన్న బెదిరింపును ఉపయోగించి వాణిజ్యం, మార్కెట్ ప్రవేశం, ఇంధన కొనుగోళ్లపై రాయితీలను రాబట్టవచ్చు. ఈ చట్టం ఒక సంప్రదింపుల ప్రయోజనానికి కూడా ఉపయోగపడవచ్చు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నప్పటికీ, సుంకాలు, వ్యవసాయరంగ ప్రవేశం, పారిశ్రామిక రక్షణ, నియంత్రణ ప్రమాణాల వంటి అంశాలపై విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శిక్షాత్మక సుంకాలతో బెదిరించడం వల్ల, తక్కువ అనుకూలమైన నిబంధనలతో ఒప్పందాన్ని అంగీకరించేలా న్యూఢిల్లీపై ఒత్తిడి పెరిగే వాతావరణం ఏర్పడుతుంది. రష్యా సమస్యను ఒక సాకుగా చేసుకుని, భారత్ ను అసమాన వాణిజ్య ఒప్పందంలోకి బలవంతంగా నెట్టవచ్చని భారత వాణిజ్య విశ్లేషకులు వాదిస్తున్నారు.
ట్రంప్ లెక్కలు దేశీయ రాజకీయాలచే కూడా ప్రభావితం కావచ్చు. రష్యా పట్ల ఘర్షణ వైఖరి, ఉక్రెయిన్ యుద్ధంపై కఠినత్వాన్ని ప్రదర్శించాలనుకునే చట్టసభ సభ్యులను ఆకట్టుకుంటుంది. అదే సమయంలో, అమెరికా పరిశ్రమను రక్షించుకోవడానికి వాణిజ్య ఒత్తిడిని ఒక మార్గంగా చూసే ఓటర్లను సుంకాలు ఆకట్టుకుంటాయి. ఆంక్షలు, సుంకాలను కలపడం ద్వారా, ప్రభుత్వానికి ఒక సౌకర్యవంతమైన సాధనం లభిస్తుంది. అది గరిష్ట శిక్షను తప్పనిసరిగా విధించకుండానే, దాని ఆధారంగా బెదిరించగలదు, తద్వారా చర్చల ద్వారా పరిష్కారానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ, ఈ విధానంలో ఒక వైరుధ్యం ఉంది. ఒకవేళ అమెరికా నిజంగా రష్యా చమురు ఆదాయాలను తగ్గించాలనుకుంటే, రష్యా ముడి చమురును వదులుకునేలా భారత్‌ను బలవంతం చేయడం ప్రపంచ సరఫరాకు అంతరాయం కలిగించి, ధరలను పెంచవచ్చు. రష్యా చమురు ను వినియోగించుకోగల కొనుగోలుదారులు భారతీయ రిఫైనరీలు మాత్రమే కాదు, భారతదేశం నుండి తరలివెళ్లిన ముడి చమురు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల ద్వారా సులభంగా రవాణా కావచ్చు. ఎగుమతుల పరిమాణం తగ్గినప్పటికీ, బ్యారల్‌పై అధిక ప్రపంచ ధరలు మాస్కో ఆదాయాన్ని పెంచగలవు. ఈ ముప్పు రష్యాను నిర్ణయాత్మకంగా బలహీనపరచకుండానే అమెరికా మిత్రదేశాలను, వినియోగదారులను దెబ్బతీయవచ్చు.
చైనా ప్రతిస్పందన ఈ సంక్షోభానికి మరో కోణాన్ని జోడిస్తోంది. భారతదేశం కంటే రష్యా ఇంధనాన్ని భారతదేశం కంటే బీజింగ్ భారీగా కొనుగోలు చేస్తున్నప్పటికీ, చైనా వ్యాఖ్యానం బహిరంగంగా ఘర్షణపూరితంగా
కాకుండా జాగ్రత్తగా ఉంది. ఆ సంయమనం ఒక వ్యూహాత్మక ఎత్తుగడను ప్రతిబింబిస్తుంది. విస్తృత వాణిజ్య ఘర్షణకు వాషింగ్టన్కు సులభమైన సమర్థన ఇవ్వడానికి చైనా ఇష్టపడటం లేదు, ప్రత్యేకించి దాని స్వంత ఆర్థిక వ్యవస్థ అమెరికా సుంకాలు, సాంకేతిక పరిమితులకు లోనవుతు న్న సందర్భాలలో… అదే సమయంలో, ఆసియా దేశాలు ఏ ఇంధన సరఫరాదారులను ఉపయోగించవచ్చో వాషింగ్టన్ నిర్ణయించగలదనే సూత్రాన్ని బీజింగ్ అంగీకరించే అవకాశం లేదు. చైనా అవలంభిస్తున్న జాగ్రత్త ఒక రకమైన వ్యూహాత్మక సహనంగా మారవచ్చు. అమెరికా గరిష్ట సుంకాన్ని వాస్తవంగా విధిస్తుందా, భారతదేశం ప్రతిఘటిస్తుందా లేదా చర్చలు జరుపుతుందా, రష్యాతో ఇంధన సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ ఐరోపా దేశాలు మినహాయింపు లు పొందుతాయా అనే విషయాలను బీజింగ్ గమనించగలదు. ఏవైనా స్పష్టమైన ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తే, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా నియమాల ఆధారిత వ్యవస్థను ఎంపికగా అమలు చేస్తున్నారనే చైనా వాదనకు అది మరింత బలం చేకూరుస్తుంది.
భారతదేశానికి, దీని భౌగోళిక రాజకీయ పరిణామా లు చాలా తీవ్రమైనవి. చైనా పట్ల ఉమ్మడి ఆందోళనలు, రక్షణ, సాంకేతికత, ఇండో రంగాలలో సహకా రం కారణంగా విస్తరించిన భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఉన్న ఊపును ఈ వివాదం బలహీనపరచవచ్చు. వాషింగ్టన్ ఒత్తిడి న్యూఢిల్లీని ఒక ఇబ్బందికరమైన స్థితిలో ఉంచుతుంది. రష్యాతో స్వతంత్ర సంబంధాన్ని కొనసాగించినందుకు శిక్షకు గురవుతూనే, చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో మరింత సన్నిహితంగా ఉండాలని దాని నుండి ఆశించబడుతోంది. ఈ వైరుధ్యం భారతదేశాన్ని కేవలం చమురు సరఫరాదారుల విషయంలోనే కాకుండా, చెల్లింపు వ్యవస్థలు, రవాణా ఏర్పాట్లు, రక్షణ భాగస్వామ్యాలు, దౌత్య సంబంధాలలో కూడా మరింత వైవిధ్యీకరణ వైపు నెట్టవచ్చు. ఇది రష్యాతో సహకారాన్ని బలోపేతం చేయగలదు, గల్ఫ్ ఉత్పత్తిదారులతో మరింత సన్నిహిత ఇంధన సమన్వయాన్ని ప్రోత్సహించగలదు, తీవ్రమైన ద్వైపాక్షిక ఉద్రిక్తతల మధ్య కూడా చైనాతో సంబంధాల కోసం కొత్త అవకాశాలను సృష్టించగలదు.
కేవలం వాషింగ్టన్ బెదిరించిందనే కారణంతో రష్యా చమురును భారతదేశం వదులుకునే అవకాశం లేదు. అలా చేస్తే కలిగే నష్టాలు తక్షణమే ఉంటా యి. అయితే దౌత్యపరమైన ప్రయోజనాలు అనిశ్చితంగానే ఉంటాయి. అయినప్పటికీ, రాయితీలు తగ్గినా, ఆంక్షల ప్రమాదాలు పెరిగినా లేదా ప్రత్యామ్నాయ సరఫరాలు మరింత పోటీతత్వంగా మారినా, న్యూఢిల్లీ క్రమంగా రష్యాపై తన ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. అటువంటి మార్పు మార్కెట్ ఆధారిత సర్దుబాటు అవుతుంది. సుంకాల ఒత్తిడితో తీసుకున్న నిర్ణయాన్ని చాలా భిన్నంగా చూస్తా రు. కాబట్టి, ఇక్కడ ప్రధాన సమస్య రష్యాకు భారతదేశం మద్దతు ఇస్తుందా లేదా అనేది కాదు. వాణిజ్యం, ఆర్థికం, ఆంక్షలు నానాటికీ ఆయుధాలుగా మారుతున్న ఈ యుగంలో, ఒక ప్రధాన శక్తి తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోగలదా లేదా అన్నదే అసలు విషయం. ట్రంప్ సుంకాల బెదిరింపు, భారతదేశపు ఇంధన ఆధారపడటాన్ని అమెరికా కు ఒక బలం చేకూర్చే సాధనంగా మార్చాలని చూస్తోంది. భారతదేశం ప్రతిస్పందన రాజకీయ విధేయతగా మారకుండా నిరోధించాలని చూస్తోంది. దీని ఫలితం కేవలం ముడి చమురు ధరను మాత్రమే ప్రభావితం చేయదు. ఇది విచ్ఛిన్నమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సార్వభౌమాధికార సరిహద్దులను నిర్వచించడంలో సహాయపడుతుంది. ఆసియా శక్తులు ఆర్థికంగా వాషింగ్టన్కు కట్టుబడి ఉంటూనే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలవా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.