Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Andhra Pradesh Rains: ఏపీని వణికిస్తున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్.. భారీ వర్షాలకు ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

jagan 23 Sep 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh Rains: ఏపీని వణికిస్తున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్.. భారీ వర్షాలకు ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Andhra Pradesh Rains:

Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి డీప్ డిప్రెషన్‌గా మారడంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తాజా బులెటిన్ ప్రకారం డీప్ డిప్రెషన్ విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రికి విశాఖపట్నం–గోపాలపూర్ మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది.

ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 25 నుంచి 30 నాటికల్ మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గాలుల వేగం అప్పుడప్పుడు 40 నాటికల్ మైళ్ల వరకు పెరగవచ్చని IMD తీర వాతావరణ బులెటిన్ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో స్థానిక మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఆకస్మిక వరదలు సంభవించే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాలు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాయి.

IMD తాజా హెచ్చరికల్లో కోస్తాంధ్రకు సెప్టెంబర్ 23న అత్యంత భారీ వర్షాల ముప్పు, సెప్టెంబర్ 24న చాలా భారీ వర్షాల అవకాశం, ఆ తర్వాత కూడా వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయి. బలమైన ఉపరితల గాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

కాకినాడ జిల్లాపై వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

కృష్ణా జిల్లాలోనూ భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. విజయవాడలో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను ప్రత్యేకంగా అప్రమత్తం చేయాలని అధికారులు సూచించారు. మండల, రెవెన్యూ డివిజన్, కలెక్టరేట్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. నాగావళి నదికి వరద ముప్పు ఉండే అవకాశం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని రాయగడతో పాటు ఎగువ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాన్ని కూడా అధికారులు గమనిస్తున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో సెప్టెంబర్ 23న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

వాయుగుండం ప్రభావంతో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. విశాఖపట్నం–కిరందూల్ మార్గంలో వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతోంది. పరిస్థితులను బట్టి కొన్ని రైళ్లను రద్దు చేయడం లేదా మార్పులు చేయడం జరుగుతోంది. ప్రయాణికులు రైల్వే అధికారిక సమాచారం తెలుసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో భారీ వర్షం నమోదైంది. మంగళవారం రాత్రి వరకు పలాసలో 10.07 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. తాళభద్రలో 9.8, రావివలసలో 9.36, సంతబోమ్మాళిలో 8.81, కోటబోమ్మాళిలో 8.75, మదనపురంలో 8.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో మధురవాడ, ఆనందపురం ప్రాంతాల్లో కూడా గణనీయమైన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉండటంతో స్థానిక యంత్రాంగాలు అప్రమత్తంగా ఉన్నాయి.

డీప్ డిప్రెషన్ తీరం దాటే సమయం, అనంతరం కురిసే భారీ వర్షాల నేపథ్యంలో రానున్న 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకంగా మారాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం, నదులు, వాగులు, కాలువలు, నీటితో ప్రవహిస్తున్న రహదారులను దాటే ప్రయత్నం చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను, జిల్లా యంత్రాంగం సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు.