Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

శబ్దాలకు అతీతమైన భావ వ్యక్తీకరణ

Prajapaksham 23 Sep 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
శబ్దాలకు అతీతమైన భావ వ్యక్తీకరణ

September 23: International Day of Sign Languages

సుధాకర్‌ ఏ.వి

(సెప్టెంబర్‌ 23 అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం సందర్భంగా)

భాష అనేది కేవలం ఒక శబ్దాల సమూహం మాత్రమే కాదు, అది మానవ సంబంధాలను, భావాలను మరియు ఆలోచనలను అనుసంధానించే ఒక గొప్ప వంతెన. అయితే, వినికిడి లోపం ఉన్న వ్యక్తులకు (బాధితులకు) భావవ్యక్తీకరణకు, సమాజంతో ముడిపడేందుకు ‘సంజ్ఞా భాష’ అత్యంత శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంది. బాధితుల హక్కులను పరిరక్షించడం, సంజ్ఞా భాషల ప్రాముఖ్యతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, వాటి సంస్కృతిని గౌరవిం చే లక్ష్యంతో ప్రతి ఏటా సెప్టెంబర్‌ 23న ‘అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం’ నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి సాధారణ మండలి 2017 డిసెంబర్‌లో దీనిని అధికారికంగా గుర్తించింది, 2018 నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
సెప్టెంబర్‌ 23నే ఈ దినోత్సవాన్ని ఎంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన చారిత్రక కారణం ఉంది. 1951 సెప్టెంబర్‌ 23న ‘వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ద డెఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించబడింది. వినికిడి లోపం ఉన్న వ్యక్తుల హక్కుల పరిరక్షణ, సంజ్ఞా భాషల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఈ సంస్థ పునాది దినాన్ని పురస్కరించుకుని ఈ తేదీని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 కోట్ల కంటే ఎక్కువమంది చెవిటి లేదా వినికిడి లోపం ఉన్న ప్రజలు ఉన్నారు. ప్రతి దేశానికి మరియు సంస్కృతికి అనుగుణంగా అమెరికన్‌, బ్రిటీష్‌, ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజెస్‌ వంటి స్వతంత్ర రూపాలు ఉనికిలో ఉన్నాయి. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా సంజ్ఞా భాషల విస్తరణ మరియు వినియోగంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానం గా పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ సంజ్ఞా భాషా ఉపాధ్యాయులు పరిమితంగా ఉండటం విద్యావకాశాలను నియంత్రిస్తోంది. భారతదేశ విషయానికి వస్తే, ‘ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’ వంటి సంస్థలు ‘ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌’ ను ప్రమాణీకరించడానికి, వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నాయి. టివి వార్తలలో, ప్రభుత్వ కార్యక్రమాలలో సంజ్ఞా భాషా అనువాదకులను చేర్చడం శుభపరిణామ మే అయినప్పటికీ, ప్రాంతీయ భాషల్లో సముచిత శిక్షణ సదుపాయాలు, దైనందిన ప్రజాసేవలలో అనువాదకుల కొరత ఇప్పటికీ ప్రధాన సమస్యగా మిగిలిపోయింది. అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం అనేది ప్రతి ఒక్కరి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసే పిలుపు. సాధారణ ప్రజలలో కూడా సంజ్ఞా భాష పట్ల ఉన్న అపోహలను తొలగించి, కనీస ప్రాథమిక సంకేతాలను నేర్చుకునేలా ప్రోత్సహించినప్పుడే వినికిడిలోపం ఉన్న వారితో సజావుగా కమ్యూనికేట్‌ చేయగల వాతావరణం ఏర్పడుతుంది. ‘ఎవరినీ వెనుకబడనివ్వకూడదు’ అనే దృక్పథంతో పనిచేసినప్పుడే నిజమైన సమ్మిళిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.

ట్యాగ్‌లు: life style lifestyle Today news