Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Drought: కమ్ముకొస్తున్న కరువు…ఎల్ నినో ప్రభావంతో రాలని చినుకు…తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కుదేలు…

Prajapaksham 27 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Drought: కమ్ముకొస్తున్న కరువు…ఎల్ నినో ప్రభావంతో రాలని చినుకు…తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కుదేలు…

Telangana Drought

తెలంగాణ రాష్ట్రంలో కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. లోటు వర్షపాతంతో ఖరీఫ్ సీజన్ ఈ సారి పూర్తిగా కుదేలైంది. ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో జల వనరులు ఎండిపోతున్నాయి. జులై మొదటి వారంలో అడపా దడపా కురిసిన చినుకులకు రైతులు పత్తి విత్తనాలు నాటారు. అవి మొలకెత్తి మారాకు తొడిగాయి. ఇప్పుడు భూమిలో పదును లేక వాడిపోతున్నాయి. మాగాణి భూములు బీళ్లుగానే ఉన్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సగానికి సగం వరి సాగు పడిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గణనీయంగా తగ్గిపోయింది. 5.20 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా అందులో సుమారు 2.30 లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 16 మండలాల్లోని సుమారు 2.5 లక్షల ఎకరాల్లో సాగునీరు అందుతుంది. ఈ ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదిలోకి కొత్త నీరు రాకపోవడంతో నది పరివాహక ప్రాజెక్టులు అడుగంటాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్కు నీరు విడుదలయ్యే అవకాశం లేదు. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇటీవల స్పష్టం చేశారు. దీనితో నాగార్జున సాగర్ ఎడమ ఆయకట్టు పరిధిలోని 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం లేదు.

మధ్యతరహా ప్రాజెక్టులైన పాలేరు, వైరాలో కొంత మేర నీరు ఉన్నా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీటిని విడుదల చేయడం లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇక చిన్న చెరువులు, కుంటలు వెయ్యి వరకు ఉండగా దేనిలోనూ సాగునీటిని అందించేందుకు నీళ్లు లేవు. ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి మొక్కలు తేమ లేక వాడిపోతున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో 3.64 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఇక్కడ కూడా ప్రధాన ప్రాజెక్టులైన కిన్నెరసాని, మూకమామిడి తదితర మధ్యతరహా ప్రాజెక్టులు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఛత్తీస్గఢ్లో వర్షాలు పడుతుండడంతో తాలిపేరుకు మాత్రం కొత్త నీరు రావడంతో తాలిపేరు ప్రాజెక్టు కింద సాగునీరు అందించే అవకాశం ఉంది.

సాగని వరి సాగు:
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 17.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వరి సాగు మాత్రం నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు 27 వేల ఎకరాల్లో మాత్రమే రైతులు వరి నాట్లు వేశారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవటంతో కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, కుంటలు, వాగుల్లో నీళ్లు లేవు. దీంతో పంటలే జీవనాధారమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2026-27 సంవత్సరంలో ఖరీఫ్లో 17,39,714 ఎకరాలలో వివిధ పంటలు సాగు లక్ష్యంగా అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి పంట లక్ష్యమే 9,20,104 ఎకరాలుగా ఉంది. మరో 5,56,048 ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉంది.

వరంగల్ జిల్లాలో 1,25,160 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 1,48,540 ఎకరాలు, జనగామ జిల్లాలో 2,13,500 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2,18,557 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 1,08,106 ఎకరాల్లో, ములుగు జిల్లాలో 1,06,251 ఎకరాల్లో వరి పంట సాగు చేయాల్సి ఉంది. మొత్తం ఆరు జిల్లాల్లో 9,20,104 ఎకరాల్లో వరి పంట సాగు చేయాల్సి ఉండగా, కేవలం 27,107 ఎకరాల్లో మాత్రమే రైతులు నాట్లు వేస్తున్నారు. ఇందులో జనగామలో సుమారు 10 వేల ఎకరాలు ఉండగా, భూపాలపల్లి జిల్లాలో 6,420 ఎకరాల వరకు సాగు ఉంది. ప్రధాన ప్రాజెక్టులతో పాటు వరి పంట ఎక్కువ పండించే ములుగు జిల్లాలో కేవలం 3,755 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడుతున్నాయి. ప్రధానంగా చెరువుల్లో నీళ్లు లేకపోవటంతో వరి సాగుకు రైతులు మొగ్గు చూపటం లేదు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడే అవకాశం లేదనే ప్రచారంతో వరి సాగుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు.

నీరు లేక జలాశయాలు వెలవెల:
ప్రధాన జలాశయాల్లో సైతం నీటి మట్టం అంతంతే మాత్రమే ఉండటంతో రైతుల పంట సాగుపై అనిశ్చితి నెలకొంది. వరంగల్ జిల్లాలో ప్రధాన జలాశయం పాకాల సరస్సు కింద 29,500 ఎకరాల వరి పంట సాగవుతోంది. ప్రస్తుతం ఈ సరస్సులో 14 అడుగుల నీళ్లే ఉండటంతో సాగు చేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా గణపసముద్రం కింద 10 వేల ఎకరాల పంట సాగవుతోంది. ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం, పాలెంవాగు, మల్లూరు ప్రాజెక్టు, గుండ్లవాగు తదితర ప్రాజెక్టుల కింద 36,506 ఎకరాల్లో అధికారికంగా పంటలు సాగవుతాయి. జనగామ జిల్లాలో 8 ప్రధాన రిజర్వాయర్లు ఉన్నాయి. వీటికింద 1,95,703 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లలో 50 శాతం నీళ్లు కూడా లేకపోవటంతో పంటలు సాగు చేయటం లేదు. మహబూబాబాద్ జిల్లాలో 1,590 చెరువులు ఉండగా, పూర్తి స్థాయిలో ఏ చెరువులోకి నీళ్లు చేరలేదు.

అంతేకాకుండా జనగామ జిల్లాలో భూగర్భజలాలు కూడా మేలో 7.78 మీటర్లు ఉండగా, జూన్లో 8.28 మీటర్ల లోతుకు పడిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో మే నెలలో 6.71 మీటర్లు భూగర్భ జలాలు ఉండగా, జూన్లో 7.01 మీటర్లకు పడిపోయాయి. భూగర్భ జలాలు పడిపోతుండటంతో బోర్లపై సాగు చేసే రైతుల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.

వర్షాభావంతో పత్తి రైతులు విలవిల:
నెలన్నర రోజులుగా చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ వర్షాలు లేవు. దీంతో ఎకరాకు రూ.20 వేలకు పైగా ఖర్చులు చేసి జూన్ మొదటి వారంలోనే పత్తి విత్తనాలు విత్తారు. అయితే మేఘాలు ముఖం చాటేయటంతో పత్తి గింజలకు తడి కరువైంది. దీంతో చాలావరకు పత్తి మొలకెత్తకుండానే ఎండలకు దెబ్బతింటున్నాయి. దీంతో రెండోసారి కూడా పత్తి విత్తనాలు విత్తిన రైతులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,56,048 ఎకరాల్లో పత్తి సాగు అంచనా ఉండగా, ఇప్పటి వరకు 3,16,472 ఎకరాల్లో పత్తి గింజలను విత్తారు. వీటిలో చాల వరకు నీటి సౌకర్యం లేక మొలకలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దేవాదుల పంపుహౌస్ నుంచి నీటిని ధర్మసాగర్, చలివాగు, పులుకుర్తి, రామప్ప రిజర్వాయర్లకు లిఫ్టు చేస్తున్నారు. వీటి నుంచి ఆయా ప్రాంతాల్లోని గొలుసుకట్టు చెరువులకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

జనగామలో 51 శాతం లోటు వర్షపాతం:
జనగామలో జులై 26 నాటికి 296.8 మిల్లీ మీటర్ల సాధారణ వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా 144.9 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. జిల్లాలో 12 మండలాలు ఉండగా ఐదు మండలాల్లో వర్షాపాతం తీవ్ర లోటు ఉంది. అంటే వరి, పత్తి, చెరుకు, మొక్కజొన్న పంటలు దిగుబడి అయ్యే అవకాశాలు ఇక్కడ లేనేలేవు. జులై మాసంలో 167.5 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 54.9 మిల్లీ మీటర్ల వర్షాపాతం మాత్రమే నమోదైంది. పై విధంగా వర్షాపాతం లెక్కలు చూస్తే జనగామలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయనడంలో సందేహాలు లేవు.

7 మండలాల్లో లోటు, 5 మండలాల్లో తీవ్ర లోటు:
జనగామ జిల్లాలో వర్షాపాత పరిస్థితులు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏడు మండలాల్లో లోటు వర్షాపాతం ఉండగా 5 మండలాల్లో అతి లోటు ఉంది. అతి లోటు ఉన్న మండలాల్లో ఏ పంటలు పండే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పారు. లోటు వర్షాపాతం ఉన్న మండలాలు తరిగొప్పుల, జఫర్గడ్, స్టేషన్ఘనపూర్, నర్మెట, జనగామ, దేవరుప్పుల, కొడకండ్ల కాగా అతి లోటు ఉన్న మండలాలు చిల్పూరు, రఘునాథపల్లి, బచ్చన్నపేట, లింగాలఘనపూర్, పాలకుర్తి మండలాలు.

జిల్లాలో 10 శాతం నాట్లే:
జిల్లాలో ఇప్పటికీ 50 శాతం నాట్లు పూర్తి కావాలి. కానీ 10 శాతం నాట్లు మాత్రమే పూర్తయ్యాయి. జిల్లాలో సుమారుగా లక్షా 8 వేల ఎకరాలకు పైగా ఖరీఫ్లో వరి సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికీ 20 నుండి 25 వేల ఎకరాల్లో కూడా నాట్లు పూర్తి కాని పరిస్థితి నెలకొంది.