Skip to content
తెలంగాణ వార్తలు

రెవెన్యూ కోసం భూముల అమ్మకాలే గతి…టార్గెట్ సెట్ చేసిన భట్టి..

Prajapaksham 26 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
రెవెన్యూ కోసం భూముల అమ్మకాలే గతి…టార్గెట్ సెట్ చేసిన భట్టి..

తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు భూముల అమ్మకం (Monetisation), ల్యాండ్ పూలింగ్ (Land Pooling) ప్రక్రియలను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో సక్సెస్ అయిన ‘ఉప్పల్ భగాయత్’ భూముల వేలం తరహాలోనే పూర్తి పారదర్శక నమూనాలతో, మరిన్ని కొత్త ప్రాంతాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ అవకాశాలను  గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదాయ సమీకరణపై ఏర్పాటైన ‘క్యాబినెట్ సబ్ కమిటీ’ శనివారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు చర్చలు జరిగాయి. ఆదాయం పెంచే మార్గాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 

HMDA పరిధిలోని భూములపై ప్రత్యేక దృష్టి

 హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిలో ఉన్న ప్రభుత్వ భూ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అధికారులు ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఉపముఖ్య మంత్రి భట్టి ముందు ప్రతిపాదనలు పెట్టారు. అయితే వీటిపై డీసీఎం భట్టి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా  రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లకు తమ పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించి, ల్యాండ్ పూలింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రత్యేక సూచనలు చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా అయిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం రాబడిని రాబట్టి, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొని, వివిధ శాఖల ప్రగతిని, అదనపు రాబడి మార్గాలను భట్టితో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలకు తగినట్లుగా వనరుల సమీకరణ ప్రక్రియ అంతా 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే సాగాలని భట్టి విక్రమార్క నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రతి ఆదాయ మార్గాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా భట్టి సూచించినట్లు తెలుస్తోంది. 

క్యాలెండర్ నిర్ణయించుకొని పనిచేయాలని భట్టి ఆదేశం: 

ముందస్తుగా నిర్ణయించిన క్యాలెండర్ లేదా కాలపరిమితులకు కట్టుబడి పనిచేస్తూ, ఆదాయాన్ని పెంచే దిశగా వేగంగా అడుగులు వేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలపరచడానికి ప్రభుత్వ శాఖలన్నింటి మధ్య బలమైన సమన్వయం (Coordination) ఉండాలని పిలుపునిచ్చారు.

దీంతో పాటు మున్సిపల్ పరిపాలన-పట్టణాభివృద్ధి, HMDA, పరిశ్రమలు, ఎక్సైజ్, మైనింగ్, రెవెన్యూ, రవాణా, రిజిస్ట్రేషన్లు-స్టాంపులు, వాణిజ్య పన్నుల (Commercial Taxes) శాఖల పనితీరును సమీక్షించారు.రాబోయే కాలంలో ఏ శాఖ ఎంత ఆదాయ లక్ష్యాన్ని సాధించాలనే దానిపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు (Clear Guidelines) జారీ చేశారు.

 ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజూ, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు: Telangana