Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

భూ సంస్కరణలపై చర్చకు తరుణం

Prajapaksham 25 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
భూ సంస్కరణలపై చర్చకు తరుణం

టీ క్యూర్‌ బిల్లు–2026కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం

ఇటీవల భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిషేధిత జాబితా గురించి తెలంగాణలో దుమారమే రేగింది. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22 ఎ సెక్షన్‌ కింద రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, దేవాదాయ, బంజరు, అసైన్డ్‌, అటవీ భూములకు సంబంధించిన సర్వే నంబర్‌ వివరాలు ఉంటాయి. వాటితో పాటుగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఆధీనంలో ఉండే వివాదాస్పద భూముల సర్వే నంబర్‌లను కూడా ఆ జాబితాలోకి ఎక్కిస్తారు. అంటే ఆ జాబితాలో ఉంచిన భూములను ఎవరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వీలు లేదు. ఈ మధ్య కాలంలో కోర్టు ఆదేశాల మేరకు ఆ జాబితాను సరి చేసే క్రమంలో గతంలో 22ఎ లో ఉంచి, కాలక్రమంలో దాని నుంచి బైటపడిన భూముల వివరాలు సాంకేతికంగా తిరిగి అందులో చేరడంతో వివాదం మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలోని కాలనీలలో వేలాది కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఈ అంశంపై సెప్టెంబర్‌ 16న శాసనసభ చర్చ సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టత ఇవ్వడమే కాకుండా నెల రోజుల్లో పరిష్కారానికి 12 రకాల మార్గాలను వెల్లడించారు. ఆ సందర్భంలోనే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, పలువురు బిఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సిలు, నాయకులు, వారి అనుంగులు ఫామ్‌ హౌజ్‌లు, తదితర పేర్లతో భూ గరిష్ట పరిమితి చట్టానికి మించిన భూములు కలిగి ఉన్న విషయాన్ని సభ ముందుంచారు. కెసిఆర్‌ కుటుంబానికి 400లకు పైగా ఎకరా లు ఎర్రవెల్లిలో ఉన్నాయని, పక్కనే నిషేధిత జాబితాలో ఉన్న వందల ఎకరాల భూములను కలుపుకున్నారనే తీవ్ర ఆరోపణ చేశారు. అంతే కాకుండా నిషేధిత జాబితాలోని భూములను వాటిలో కలుపుకున్నారనే తీవ్ర ఆరోపణలు చేయటమే కాకుండా, విచారణకు ఒక కమిటీ వేస్తానని ప్రకటించారు. అందుకు అనుగుణంగా గురువారం నాడు ఐఎఎస్‌ అధికారిణి ఎ.దేవసేన నేతృత్వంలో విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
శాసనసభ చర్చ సందర్భంగా భూ గరిష్ట పరిమితి చట్టం గురించి సిఎం రేవంత్‌ రెడ్డి ప్రస్తావించడంతో చట్టం ప్రకారం ఎన్నిక ఎకరాల భూమి ఉండాలనే అంశం తెరపైకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏడాదికి వచ్చే పంటలు, నీటి వసతి ఆధారంగా ఐదుగురు సభ్యుల కుటుంబానికి తరి 10 27 ఎకరాలు వరకు భూమి ఉండవచ్చు. మెట్ట, సాగు నీటి వసతి లేని భూమి అయితే కుటుంబానికి 35 54 ఎకరా ల వరకు అనుమతిస్తారు. ఆ పైన ఉండే భూమిని ‘మిగులు భూమి’గా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎర్రవెల్లి క్షేత్రంలో సతీమణితో కలిపి కెసిఆర్‌ కుటుంబానికి 67.13 ఎకరాలు, కెటిఆర్‌ కుటుంబానికి వివిధ ప్రాంతాలలో 123.19 ఎకరాల భూములు ఉన్నట్లు అసెంబ్లీలో సిఎం వెల్లడించారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా చంద్రబాబునాయుడు, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిలు ఉన్న సమయంలోనే నాడు రాజకీయ నాయకులు హైదరాబాద్‌కు శివారులలో భూములు కొనుగోలు చేసి, ఫామ్‌ హౌజ్‌లు ఏర్పాటు చేసుకోవడం ఆరంభమైందని పరిశీలకులు చెబుతుంటారు. అయితే, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇది విస్తృతమైంది. ముఖ్యంగా కెసిఆర్‌ ఎర్రవెల్లిలో వ్యవసాయ క్షేత్రంలోనే ఇళ్ళు కట్టుకొని, తరచుగా అక్కడే ఉంటుండడంతో ఫామ్‌ హౌజ్‌ పదం ప్రజల నోళ్ళలో నానింది. ఆ తరువాత బిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తమ నియోజకవర్గాలలోనో, వెలుపలో ఫామ్‌ హౌజ్‌లు ఏర్పాటు చేసుకున్న విషయం నాడు పెద్ద ఎత్తున చర్చ జరిగేది. శాసనసభ సమావేశాల చివరి అంకంలోనే కాంగ్రెస్‌ ఎంఎల్‌సి, ఎంఎల్‌ఏ, ఎంపిలు కెసిఆర్‌ ఫామ్‌ హౌజ్‌ వద్దకు, తరువాత హరీశ్‌రావు, కెటిఆర్‌, జగదీశ్‌రెడ్డి తదితరుల ఫామ్‌ హౌజ్‌, వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్ళారు. ప్రైవేటు భూముల వద్దకు వెళ్తుండడంపై బిఆర్‌ఎస్‌ నేతలు అభ్యంతరం పెట్టినప్పటికీ, వారి భూములను చూపడం ద్వారా జనాంతికంగా ఉన్న విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలనేది కాంగ్రెస్‌ వ్యూహంగా కనపడింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నేతల భూముల గురించి, అందులో సిఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి తదితరులు భూముల గురించి బిఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నలు సంధించినా, అది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, ఎంపిల ఫామ్‌ హౌజ్‌లు, విలాసవంతమైన విల్లాలను కొన్ని యూట్యూబ్‌ ఛానళ్ళు ప్రముఖుల ‘హోం టూర్‌’ పేరుతో చిత్రీకరించాయి. తమ నివాసాలు, ఆడంబరాల ను నేతలు ఉత్సాహపడి మరీ గొప్పలు చెప్పుకొచ్చారు. ఇప్పుడా వీడియో క్లిప్పింగ్‌లు వైరలవుతుండడంతో ఇరుకున పడుతున్నారు. తమ ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల నామినేషన్‌తో పాటు దాఖలు చేసామని బిఆర్‌ఎస్‌ నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఉద్యమ కాలంలో ఎన్నికల సమయానికి ఎకరం కూడా లేని, లక్షల్లోనే ఆదాయం చూపిన పలువురు నేతలకు ఇప్పుడు భారీ ఫామ్‌ హౌజ్‌లు, విల్లాలు, కోట్ల వ్యాపారాలు ఎలా వచ్చాయనే కాంగ్రెస్‌ నేతల ఎదురుదాటి ఇరకాటంలో పడేస్తోంది.
నిజానికి భూమి అనే అంశాన్ని ఎజెండాలోకి తీసుకువచ్చింది కమ్యూనిస్టు
లనేది ఎవ్వరినడిగినా చెబుతారు. ‘భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం’ అనే నినాదంతో నైజాం రాచరిక పాలన, భూస్వాముల పీడనకు వ్యతిరేకం గా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన చరిత వారిదే. లక్షల ఎకరాలు చెరబట్టిన నిజాం నవాబు, దొరలు దేశ్‌ముఖ్‌ల కోటలను బద్ధలు కొట్టింది వారే. నాటి పోరాటంలో ‘దున్నే వానికే భూమి’ పేరుతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పది లక్షల ఎకరాల భూమి పేదలు, రైతులు, రైతు కూలీలకు పంపిణీ జరిగింది. దానికి పోటీగా భూదానోద్యమాన్ని ముందుకు తీసుకువచ్చినా కమ్యూనిస్టుల పోరాటమే భూ పంపిణీకి బాటలు వేసింది. ఆ వెలుతురులోనే దేశవ్యాప్తంగా భూ సంస్కరణలు, భూ పరిమితి చట్టాలు వచ్చాయి. పేదల చేతుల్లోకి భూములు వచ్చాయి. ఆర్థిక సంస్కరణల తరువాత తిరిగి భూములు కేంద్రీకరణ మొదలైంది. సెజ్‌ల పేరిట ప్రభుత్వమే కార్పొరేట్‌ సంస్థలకు పెద్ద ఎత్తున భూములను కట్టబెట్టింది. ఇందుకు రైతుల నుంచి బలవంతంగా తక్కువ మొత్తానికే భూమి సేకరించి, వాటికి అప్పగించింది. అదే క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరిగిపోయి, కబ్జాలు, నేతల భూ దాహం ఎక్కువవడంతో పట్టణభూపరిమితి చట్టం తొలగించడం, అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు వెసులుబాటులకు బాటలు పడ్డాయి.
సామాన్య మధ్యతరగతి ఊళ్ళలో భూమి అమ్ముకున్నా పట్టణాల్లో ఇంటి స్థలం వచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో నేతలు, బడా బాబులు భూములను చెరబడుతున్నారు. రాష్ట్రంలో 22 ఏ, ఫామ్‌ హౌజ్‌లపై చర్చ జరుగుతున్న సమయంలో మరోసారి భూ సంస్కరణలు, భూ గరిష్ట పరిమితిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. పెరిగిన జనాభా, భూముల ధరల నేపథ్యంలో వ్యవసాయ భూములు, పట్టణాలలో ఆవాస స్థలాల పరిమితి అంశంపై విశ్లేషణ జరగాలి. మెజారిటీ ప్రజలకు సాగు భూమి, ఆవాసస్థలం ఉండేందుకు అనువుగా చట్టాలలో మార్పులపై విస్తృత మథనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.