Skip to content
ప్రపంచం › వార్తలు

చిన్న దేశంలో విద్యార్థుల పెద్ద విజయం

Prajapaksham 28 Oct 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
చిన్న దేశంలో విద్యార్థుల పెద్ద విజయం

serbia

భాషా సింగ్

చిన్న యూరోపియన్‌ దేశమైన సెర్బియాలో విద్యార్థుల నేతృత్వంలోని యువజన ఉద్యమం తీసుకువచ్చిన రాజకీయ మార్పు కలకలం సృష్టించింది. సెర్బియా చరిత్రలో తొలిసారిగా విద్యార్థులు, యువత నేతృత్వంలోని ”స్టూడెంట్‌ లిస్ట్‌’ అనే సరికొత్త రాజకీయ బృందం ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అతి తక్కువ సమయంలో ఈ రాజకీయ బృందం ఎన్నికలలో విజయం సాధించడం విశేషం. తమ ఎదుట ఉన్న రాజకీయ సవాళ్లను ఏవిధంగా ఎదుర్కొని ఈ యువ బృందం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ విశ్లేషకులు నిశితంగా
గమనిస్తున్నారు.
ఆగ్నేయ యూరప్‌లోని బాల్కన్‌ ప్రాంతంలో భాగమైన దాదాపు 66 లక్షల జనాభా కలిగిన సెర్బియా దేశం ప్రస్తుతం విద్యార్థులు, ప్రజాస్వామ్యం సాధించిన విజయం పట్ల సంబురాలు చేసుకుంటోంది. దాదాపు యూరప్‌ మొత్తాన్ని విద్యార్థి ఉద్యమాలు కుదిపేస్తున్న తరుణంలో, 2014 నుంచి సెర్బియా రాజకీయాలను శాసించిన అలెగ్జాండర్‌ వుచిచ్‌ రాజకీయ కూటమిని, అవినీతి సమస్య చుట్టూ నిర్మించబడిన విద్యార్థి ఉద్యమం ఓడించటం యూరోపియన్‌ రాజకీయాలపై సుదూర ప్రభావాలను చూపవచ్చు.
2024 నవంబర్‌ 1న నోవి సాద్‌ నగరంలోని రైల్వే స్టేషన్‌లో ఒక భాగం కూలిపోయి 16 మంది ప్రాణాలు కోల్పోవడంతో సెర్బియాలో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రజలు, ముఖ్యంగా యువత, ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులలోని అవినీతే ఈ విషాదానికి కారణమని ఆరోపించి, అధికారుల నుండి జవాబుదారీతనాన్ని కోరారు. రైల్వే స్టేషన్‌ విషాదానికి సంబంధించిన పత్రాలను బహిరంగపరచాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత, కఠిన వైఖరి క్రమంగా ఈ ఉద్యమాన్ని విస్తృతమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలుగా మార్చాయి. విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, నిపుణులు, సమాజంలోని ఇతర వర్గాల వారు కూడా ఈ నిరసనలలో భాగస్వాములయ్యారు. నిరసనకారుల డిమాండ్లను ఆలకించి, చర్చలలో పాల్గొనడానికి బదులుగా, వుచిచ్‌ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేసి, అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనికి విరుద్ధంగా, ఒక స్థానిక విషాదానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసన దేశవ్యాప్త
ఉద్యమంగా విస్తరించింది.
అవినీతి సమస్యపై మౌనం వహిస్తూ, విద్యార్థి ఉద్యమానికి విదేశీ శక్తుల మద్దతు ఉందని అధ్యక్షుడు వుచిచ్‌ ఆరోపించారు. నిరసన చేస్తున్న విద్యార్థులు ఏకమై ‘స్టూడెంట్‌ లిస్ట్‌’ అనే ఎన్నికల బృందాన్ని ఏర్పాటు చేశారు. తమతమ రంగాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రజలు గౌరవించే సెర్బియన్‌ నిపుణులను, విద్యావంతులను ఇందులో చేర్చుకున్నారు. ఇది పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది.
ఈ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, విద్యార్థులు దీనిని కేవలం విశ్వవిద్యాలయాలకు, ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం చేయలేదు. వారు చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా చేరుకుని, అవినీతి, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి సమస్యలను సామాన్య ప్రజల దైనందిన జీవితాలతో ముడిపెట్టారు. స్థిరపడిన రాజకీయ పార్టీల నాయకత్వంపై ఆధారపడకుండా, వారు తమ ఉద్యమం స్వతంత్ర అస్థిత్వాన్ని కాపాడుకున్నారు. ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు కూడా, వారు కేవలం విద్యార్థి నాయకులపైనే ఆధారపడకుండా, ఉపాధ్యాయులు, వైద్యులు, ఆర్థికవేత్తలు, ఇతర గౌరవనీయ నిపుణులను తమ బృందంలోకి చేర్చుకున్నారు. ఇది ఈ ఉద్యమానికి విస్తృత సామాజిక ఆమోదం లభించడానికి, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అతీతంగా ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి సహాయపడింది.
ఎన్నికల పర్యవసానంగా, గ్రాడ్యుయేట్లు, పిహెచ్‌డి పట్టభద్రులతో సహా అధిక సంఖ్యలో ఉన్నత విద్యావంతులైన యువకులు ‘స్టూడెంట్‌ లిస్ట్‌’ తరపున సెర్బియా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అక్టోబర్‌ 26 వరకు ప్రకటించిన ప్రాథమిక ఫలితాల ప్రకారం, సెర్బియన్‌ పార్లమెంటులోని 250 స్థానాలకు గాను స్టూడెంట్‌ లిస్ట్‌ 140 స్థానాలను కైవసం చేసుకుంది, సుమారు 52.71 శాతం ఓట్లను పొందింది. అధ్యక్షుడు వుచిచ్‌ తన రాజకీయ ఓటమిని అంగీకరించారు. అయితే, పార్లమెంటరీ ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన అధ్యక్షుడు వెంటనే తన రాజ్యాంగబద్ధమైన పదవిని కోల్పోయినట్లు కాదు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అధికారాన్ని బదిలీ చేసే రాజ్యాంగ ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
పార్లమెంటరీ ఎన్నికలలో సెర్బియా విద్యార్థుల విజయం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వారి ప్రయాణం ఇతర ఐరోపా దేశాలను కచ్చితంగా ప్రభావితం చేయగలదు. దీని ప్రభావం ఫ్రాన్స్‌లో ప్రత్యేకంగా గణనీయంగా ఉండబోతుంది. అక్కడ విద్యార్థులు విద్యా సౌకర్యాల మెరుగుదల, మెరుగైన పాఠశాల విద్య, మౌలిక సదుపాయాల కోసం నిరసనలు చేస్తున్నారు. గ్రీస్‌లో పెరుగుతున్న విద్య, జీవన వ్యయాలకు వ్యతిరేకంగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. అదే సమయంలో బెల్జియం, ఇటలీ, ఇతర ఐరోపా దేశాలలో విద్యా బడ్జెట్లు, విశ్వవిద్యాలయ విధానాలు, విస్తృత సామాజిక సమస్యలపై విద్యార్థి ఉద్యమాలు కూడా చురుకుగా కొనసాగుతున్నాయి.
సెర్బియా విజయం ఈ ఉద్యమాలకు నూతన రాజకీయ ఆత్మ విశ్వాసాన్ని అందిస్తుంది. ఇది బాల్కన్‌ ప్రాంతంలోని రాజకీయాలపై, యూరోపియన్‌ యూనియన్‌, రష్యాలతో సెర్బియా సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు. సెర్బియాతో భారతదేశానికి ఉన్న దీర్ఘకాల స్నేహ సంబంధాలు, ఆర్థిక, సాంకేతిక, అంతర్జాతీయ వ్యవహారాలలో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా, ఈ పరిణామాలు భారతదేశానికి కూడా ముఖ్యమైనవి.

(సెర్బియా పూర్వపు యుగోస్లావియాలో అంతర్భాగం. ఆ దేశం విచ్ఛిన్నం తర్వాత ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది.)