US Midterm Elections: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్న 25% మంది ట్రంప్ మద్దతుదారులు, సర్వేలో ఆసక్తికర విషయాలు..
US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?
US Midterm Elections: అమెరికాలో ముందస్తు ఓటింగ్ (Early Voting) ఊపందుకుంటున్న తరుణంలో ప్రవాస దక్షిణాసియా అమెరికన్ ఓటర్ల రాజకీయ మొగ్గుపై వెలువడిన ఒక సమగ్ర సర్వే నివేదిక తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వచ్ఛంద సంస్థ ‘ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్’ (Indian American Impact) నిర్వహించిన ఈ పోలింగ్ సర్వేలో మొత్తం 800 మంది నమోదు చేసుకున్న దక్షిణాసియా అమెరికన్ ఓటర్లు పాల్గొనగా.. అందులో ఏకంగా 87 శాతం మంది భారతీయ అమెరికన్లే (Indian Americans) ఉండటం గమనార్హం.
గత అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) ఓటు వేసిన దక్షిణాసియా వాసుల్లో 67 శాతం మంది ఇప్పటికీ రిపబ్లికన్లకే మద్దతు ఇస్తున్నప్పటికీ, దాదాపు 25 శాతం మంది తమ నిర్ణయాన్ని మార్చుకుని ఈ మిడ్‌టర్మ్‌లలో డెమోక్రాట్లకు ఓటేయాలని భావిస్తున్నట్లు స్పష్టమైంది. మరోవైపు, గత ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు ఓటేసిన వారిలో అత్యధికంగా 96 శాతం మంది తమ పాత నిర్ణయానికే కట్టుబడి ఉంటూ డెమోక్రాట్ల వైపే నిలవడం విశేషం.
ప్రస్తుత ఎన్నికల్లో దక్షిణాసియా అమెరికన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాల్లో పెరుగుతున్న జీవన వ్యయం (Cost of Living) అగ్రస్థానంలో ఉందని 65 శాతం మంది తెలిపారు. ఆ తర్వాత వైద్య సంరక్షణ (53%), ఉద్యోగాలు-వేతనాలు (33%), విద్య (28%) వంటి రోజువారీ ఆర్థిక సవాళ్లు ఓటర్ల నిర్ణయాలను శాసిస్తున్నాయి. దీనికి తోడు ఇరాన్-పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా పెరిగిన ద్రవ్యోల్బణ భయాలు కూడా ప్రజలపై అదనపు భారాన్ని మోపాయి.
మరోవైపు.. ట్రంప్ హయాంలో తీసుకున్న వలస విధానాలు, వీసా నిబంధనలు తమ సమాజాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 90 శాతం మంది తాము లేదా తమకు తెలిసిన వారు అమెరికాలో జాతి వివక్షను (Discrimination) ఎదుర్కొన్నారని వెల్లడించారు.
టెక్సాస్, మిచిగాన్, జార్జియా, పెన్సిల్వేనియా , నార్త్ కరోలినా వంటి కీలక పోటాపోటీ (Battleground) రాష్ట్రాల్లో దక్షిణాసియా అమెరికన్ల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా మారాయి. ఉదాహరణకు మిచిగాన్‌లో 1.87 లక్షల మందికి పైగా దక్షిణాసియా నివాసితులు ఉండగా, టెక్సాస్‌లో 7 లక్షల మందికి పైగా ఈ వర్గం వారు ఉన్నారు. గత ఎన్నికలలో చాలా తక్కువ ఓట్ల తేడాతో సీట్లు ఖరారైన నేపథ్యాన్ని పరిశీలిస్తే, ప్రస్తుతం ట్రంప్ ఓటు బ్యాంకు నుంచి డెమోక్రాట్ల వైపు మళ్లుతున్న 25 శాతం ఓటర్లు , ముందస్తు ఓటింగ్‌లో పాల్గొంటున్న ప్రవాసులు రాబోయే కాంగ్రెస్ (అమెరికన్ పార్లమెంట్) ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.