Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

జ్ఞానేష్‌ కుమార్‌కు పదవిలో కొనసాగే నైతికత ఉందా?

Prajapaksham 26 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
జ్ఞానేష్‌ కుమార్‌కు పదవిలో కొనసాగే నైతికత ఉందా?

cec gyanesh kumar

భారత ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగం ద్వారా వ్యవస్థాపితమైన ఒక వ్యవస్థ తప్ప ఏ వ్యక్తికీ సంబంధించిన నిరంకుశాధికార కేంద్రం కాదు. అటువంటి ప్రమాదం నివారించేందుకు ఏకవ్యక్తి ఎన్నికల కమిషన్‌ త్రిసభ్య కమిషన్‌గా చట్టరీత్యా విస్తరించబడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాకచక్యంగా కమిషనర్‌ల నియామకాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. తమ నమ్మినబంటు జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. చట్టం, సాంప్రదాయం ప్రకారం ఆయన ముగ్గురు కమిషనర్‌లలో ప్రథముడు తప్ప సర్వాధికారి కాదు. కాని ఆయన తన యజమానుల ఆదేశాలను పాటిస్తూ సహ కమిషనర్‌ల అభిప్రాయాలను ఖాతరు చేయకుండా ఏకవ్యక్తి పాలన సాగిస్తున్నట్లు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది. కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు సహజమని, చివరకు నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకుంటున్నట్లు ఆయన తరఫున కమిషన్‌ అధికారులు ఇచ్చిన వివరణ, ఓటరు జాబితాల క్షాళనకోసం ‘ప్రత్యేక ముమ్మర సవరణ’కు సంబంధించి గత 10 మాసాల్లో 14 సార్లు సహ కమిషనర్‌లు తెలియజేసిన అభ్యంతరాలను సిఇసి త్రోసిపుచ్చి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న వాస్తవం ముందు వీగిపోయింది.
బిహార్‌లో ‘సర్‌’తో మొదలుపెట్టి, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌, హర్యానాలతో యావద్దేశానికి విస్తరించిన ‘సర్‌’ ప్రక్రియలో 13 కోట్లమంది ఓటర్లు జాబితాలనుంచి తొలగించబడ్డారు. ప్రతి వయోజనుడికీ ఓటు హక్కు కల్పించటం, ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించటం, తద్వారా ప్రజల ప్రజాస్వామిక తీర్పు ప్రకారం మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారం చేబట్టే క్రమానికి చట్టబద్ధ ప్రాతిపదిక కల్పించటం ఎన్నికల కమిషన్‌ విధి. అంతేకాని జ్ఞానేశ్‌కుమార్‌ ఎదుర్కొంటున్న ఆరోపణల్లాగా పాలక బిజెపిని లేదా మరోపార్టీని అధికారంలో కూర్చోబెట్టటం ఎన్నికల కమిషన్‌ పనికాదు. అది దానికున్న రాజ్యాంగ ఆదేశానికి ద్రోహం, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు. ఏకాభిప్రాయం ప్రకారం లేదా మెజారిటీతో కమిషన్‌ నిర్ణయాలు తీసుకోవాల్సిన పనితీరును కాదని తోటి కమిషనర్‌ల అభ్యంతరాలు తెలిపిన అంశాల్లో ఏకపక్షంగా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరికోసం తీసుకున్నారు అనే ప్రశ్నకు, సూటి జవాబు కావాలి. చాలా విషయాల్లో ఏకగ్రీవంగానే నిర్ణయాలు తీసుకున్నామనే సమాధానం మౌలిక ప్రశ్నను దాటవేసే లక్షణం.
ఎన్నికల కమిషనర్‌లు ఏ పార్టీకీ కనీసం ఆ పదవిలో నియామకం తదుపరి చెందరు. కాని జ్ఞానేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఎన్నికల కమిషన్‌ పాలక బిజెపి ఓట్ల చోరీకి సహకరిస్తోందని, పూర్తి పక్షపాతంతో పనిచేస్తోందని సంవత్సరం పైబడి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నప్పుడు, ఆయన్ను పదవినుంచి తొలగించాలని అభిశంసన నోటీసు సమర్పించినపుడు సైతం ఆయన తన వైఖరిని సరిదిద్దుకోలేదు. కేవలం పాలక పార్టీయే ఆయన్ను సమర్థిస్తున్నదంటే ఆయన పక్షపాతంతో ఆ పార్టీకి మేలు చేస్తున్నారని అర్థం కావటం లేదా? తాజా బట్టబయలుతో జ్ఞానేశ్‌కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. అభిశంసన నోటీసు మళ్లీ ఇచ్చే ఆలోచన చేస్తున్నాయి. అవి అట్టి నోటీసు ఇస్తే అది మూడవ నోటీసు అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆత్మాభిమానం కలిగిన ఏ అధికారీ పదవిని అంటిపెట్టుకోరు. 63 మంది రాజ్యసభ సభ్యులు, 130మంది లోక్‌సభ సభ్యుల సంతకాలతో కుమార్‌ తొలగింపును కోరుతూ 2026 మార్చి 12న 7ఆరోపణలతో తొలిసారి అభిశంసన నోటీసు అందజేయబడింది. అది ఏప్రిల్‌ 17న తిరస్కరణకు గురైంది. ఏప్రిల్‌ 24న ప్రతిపక్షం 73 సంతకాలతో రాజ్యసభలో మళ్లీ నోటీసు ఇచ్చింది. పాలక ఎన్‌డిఎ జ్ఞానేశ్‌కుమార్‌కు మద్దతుగా ఉంది కాబట్టి తిరిగి మరో అభిశంసన నోటీసు ఇచ్చినా అది తిరస్కరణకు గురవుతుంది. కాని ఆ ప్రయత్నం ప్రజాస్వామిక పోరాటంలో భాగమవుతుంది, జ్ఞానేశ్‌కుమార్‌, మోదీ, అమిత్‌షా అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, ఎన్నికల కమిషనర్‌ల నియామక చట్టాన్ని సవరించి, అందులోని ముగ్గురు సభ్యుల్లో (ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, తటస్థునిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి) ప్రధాన న్యాయమూర్తిని తొలగించి క్యాబినెట్‌ మంత్రిని చేర్చింది ప్రధాని మోదీయే. ఆ చట్టం సుప్రీంకోర్టులో సవాలు చేయబడి ఉండగానే క్యాబినెట్‌ మంత్రి స్థానాన్ని అమిత్‌ షాతో భర్తీ చేసిందీ, ఆ కమిటీ సమావేశాన్ని రాహుల్‌గాంధి బహిష్కరించగా, రిటైర్డ్‌ అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను సిఇసిగా నియమించిందీ మోదీ, అమిత్‌ షా లే. ఆ చట్టం ఇప్పటికీ సుప్రీంకోర్టు ముందుంది. ఈ లోపు ఓటర్ల జాబితాల్లో తారుమార్లు, 30 రాష్ట్రాలు, యుటిల్లో సర్‌ ప్రక్రియ అమలు, 13 కోట్లమంది ఓట్లు తొలగింపు జరిగిపోయాయి. ఓటు హక్కు పునరుద్ధరణ కోసం కోట్లమంది ఓటర్లు అవస్థలు పడుతున్నారు. వారిలో అత్యధికులు ఏ డాక్యుమెంట్లూ లేని దళితులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులని వేరుగా చెప్పనవసరం లేదు.
“స్వరాజ్‌లోని బహుముఖ అంశాల్లో కీలకమైనది వయోజన ఓటింగ్‌. అది అధికారంలోని వారికి వ్యతిరేకంగా ప్రజల ప్రత్యక్ష కార్యాచరణ”.
మహాత్మాగాంధి (యంగ్‌ ఇండియా) 1931 జూన్‌ 18.
“ఎన్నికల సూపరింటెండెన్స్‌, డైరెక్షన్‌, కంట్రోలు ఎన్నికల కమిషన్‌కు దఖలు అవుతాయి. ఎన్నికల జాబితాలు తయారు చేయటంలో ఎన్నికల కమిషన్‌ ఎటువంటి అన్యాయం చేయరాదు. తద్భిన్నమైన చర్య ఏదైనా ప్రజాస్వామిక ప్రభుత్వ మూల వేరునే కత్తిరిస్తుంది”.
బి.ఆర్‌.అంబేద్కర్‌, 1949 జూన్‌ 15. రాజ్యాంగ సభలో ఆర్టికల్‌ 289(ఇప్పుడు ఆర్టికల్‌ 324)ప్రతిపాదిస్తూ చెప్పిన మాట.
సిఇసి జ్ఞానేశ్‌కుమార్‌ ఏకపక్ష, రాజ్యాంగ విరుద్ధ చర్యలను పై ఇద్దరు మహానుభావుల అభిప్రాయాలతో పోల్చి చూస్తే మన ప్రజాస్వామ్యం విలువలు ఎంత దిగజారాయో విదితమవుతుంది. అందువల్ల జ్ఞానేశ్‌కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌ ఎంతో సమంజసం, న్యాయబద్ధం. తనుగా రాజీనామా చేయటం నైతిక ధర్మం!