సువేందు అధికారిపై నందిగ్రాం వేడి
Suvendu adhikari
నందిగ్రాం అసెంబ్లీ ఉప ఎన్నిక ఆసక్తిదాయకంగా, ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రతిష్టకు పరీక్షగా పరిణమించింది. ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంచిత ప్రధాన్ డేను బుజ్జగించి లేదా బెదిరించి పోటీ నుంచి తప్పించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మమతా బెనర్జీ తోడ్పాటు ప్రకటించగానే, ఎప్పుడో 2007లో లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన (దాని నాయకులు మమతా బెనర్జీ, సువేందు అధికారి అని గుర్తు చేసుకోవటం అవసరం) భూపోరాటంలో ఒక హత్యకేసును త్రవ్వితీసి దానిలో నిందితుడుగా ఉన్న మిలన్ ప్రధాన్‌ను అరెస్టు చేయటం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. ఆరునెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన బిజెపి పక్షాన ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి ఇటువంటి అనైతిక చర్యకు ఎందుకు పాల్పడినట్లు? మమతా టిఎంసి అభ్యర్థిని పోటీనుంచి తప్పించి ఆమెను నిరాయుధం చేశానని చంకలెగరేసిన ముఖ్యమంత్రికి, ఆయన పూర్వ అధినేత మమతా బెనర్జీ ఊహించని షాక్ ఇచ్చారు. అది ఆయనలో బెదురుపుట్టించి ఉంటుంది. తన బిజెపి అభ్యర్థి పొరపాటున ఓడిపోతే అది తను జాగ్రత్తగా నిర్మించుకున్న రాజకీయ భవిష్యత్‌కు ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఆ ఊహే భరించలేనిది. అందుకే కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా కటకటాల వెనుక కూర్చోబెట్టాడు. అయితే మమతా బెనర్జీ ఏమిటో, ఆమె పోరాట పటిమ, ప్రజాకర్షణ అధికారికి తెలుసు. చిత్రమేమంటే కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీతోపాటు బయటకు వచ్చి లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన అధికారి 2021 ఎన్నికల్లో నందిగ్రాంలో, 2026లో భవానీపూర్‌లో ఆమెను ఓడించి ప్రతిపక్ష నాయకుని స్థానం నుంచి ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగాడు. అది ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా భిక్ష. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన నాటినుంచీ అధికారి ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకమైన చర్యలతో బిజెపి అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడు కావటానికి అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మతో పోటీపడుతున్నాడు. ఇప్పుడు నందిగ్రాంలో రాజకీయ జూదానికి ఒడిగట్టాడు. బెడిసికొట్టిందో, అది నేరుగా మోదీ, షాలకు తగులుతుంది. ఆ దెబ్బ యావత్ దేశ రాజకీయాలపై పనిచేస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలన కాంగ్రెస్‌ను నామమాత్రావశిష్టం చేసింది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్‌రెడ్డి వైస్సార్ సిపి కాంగ్రెస్‌ను చావుదెబ్బతీసినట్లు! అయితే జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉంది. కాని మొన్నటి బెంగాల్ ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ అధికారం కోల్పోవటమేగాక, ఆమె పార్టీ పార్లమెంటరీ, శాసనసభ పక్షాలు రెండింటిలో తిరుగుబాట్లు జరిగి ఆమె మైనారిటీలోకి నెట్టబడి నిస్సహాయంగా రాజకీయ పోరాటం చేస్తోంది. పార్టీ పేరు, బ్యాంక్ ఖాతాలు, ఎన్నికల గుర్తు స్తంభనలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నందిగ్రాం ఉప ఎన్నికలో అత్యాశతో కూడిన ముఖ్యమంత్రి ఎత్తుగడలు మమతా బెనర్జీకి అనూహ్యమైన అవకాశం కలుగజేశాయి, ఆమె వెంటనే అందిపుచ్చుకుని రాజకీయ చాతుర్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ఆమె సన్నిహితమైనారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆమె వెంట కాంగ్రెస్ అభ్యర్థికి తోడ్పాటు ప్రకటించింది. ఆ విధంగా ఇండియా కూటమి నూతన జవసత్వాలు సంతరించుకుంది. రాజకీయ కక్ష సాధింపు, అధికార దుర్వినియోగం, బెదిరింపులు వంటి కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి ప్రతిపక్షానికి ఈ ఉప ఎన్నిక అవకాశం కల్పిస్తోంది. ఇది బిజెపి దూకుడును పటిష్టం చేస్తుందో లేక కొత్తగా ఒకటైన ప్రతిపక్షానికి మానసికంగా కీలకమైన మలుపుతెస్తుందో అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపుకోసం వేచిచూడాలి.
ఇదే సమయంలో, అసోంలో అక్టోబర్ 6న జరిగే నాగోం లోక్‌సభ ఉపఎన్నిక కూడా ఆసక్తిదాయకంగా మారింది. 2019,2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన ప్రద్యోత్ బర్డొలయ్ అసెంబ్లీ ఎన్నికల ముందు, బహుశా ముఖ్యమంత్రి శర్మ ఒత్తిడిపై బిజెపిలో చేరి దిస్పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావటంతో ఆ లోక్‌సభ స్థానం ఖాళీ ఏర్పడింది. 2023లో నియోజకవర్గాల హద్దుల పునర్విభజనలో 18లక్షల ఓటర్లతో నాగోం ముస్లిం మెజారిటీ నియోజకవర్గం గా మారింది. అత్తరు వ్యాపారవేత్త, అఖిల భారత యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ రంగంలో దిగటంతో ఈ ఉప ఎన్నిక ఆసక్తిదాయకంగా మారింది. కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా పరిణమించింది. సాధారణంగా ముస్లిం అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్ పార్టీ విధిగా జనరల్ అభ్యర్థిని పోటీకి దించాల్సిన స్థితిలోకి నెట్టబడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన 19 సీట్లలో 18చోట్ల ముస్లిం అభ్యర్థులే గెలిచారు. అంతేగాక కాంగ్రెస్ గెలుచుకున్న రెండవ లోక్‌సభ స్థానం దుబ్రి నుంచి ముస్లిం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేగాక ముస్లిం అభ్యర్థిని నిర్ణయిస్తే అది ముస్లిం ఓట్లలో చీలికకు దారితీసి బిజెపికి మేలు చేస్తుంది. అందువల్ల కాంగ్రెస్ మాజీ లెజిస్లేటర్ శివమణి బోరాను పోటీకి దించింది. కాగా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన అజ్మల్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అజ్మల్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు లేనప్పటికీ ముస్లింలు అత్యధికంగా బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. కాబట్టి అజ్మల్ ఉప ఎన్నికలోకి ఆకస్మికంగా దిగటంతో పోటీ ఆసక్తికరంగా తయారైంది.