Skip to content
తెలంగాణ వార్తలు

Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. భారీ వర్షాల అలర్ట్.. మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద

Prajapaksham 05 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. భారీ వర్షాల అలర్ట్.. మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం

Weather Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. భారత వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, చాంద్‌బలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్లు, అలాగే పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ-నైరుతిగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బాలాసోర్ సమీపంలో చాంద్‌బలి – దిఘా మధ్య ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటిన అనంతరం, ఇది మరో 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల వైపు పయనించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలలో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాయుగుండం కారణంగా సముద్రం తీవ్ర అలజడిగా మారనుంది. తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేట కోసం సముద్రంలోకి వెళ్లిన వారు తక్షణమే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక విపత్తు నిర్వహణ శాఖ, అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద.. 85 గేట్లు ఎత్తి నీటి విడుదల, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామం వద్ద ఉన్న లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) కు వరద ప్రవాహం భారీగా పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో బ్యారేజీ ఇన్ ఫ్లో ఒక్కసారిగా 90,580 క్యూసెక్కులకు చేరింది. దీంతో అప్రమత్తమైన భారీ నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజీకు ఉన్న మొత్తం 85 గేట్లను పూర్తిగా ఎత్తివేసి, వస్తున్న వరదను వచ్చినట్లే (90,580 క్యూసెక్కులు) గోదావరి దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు తగ్గకపోవడంతో బరాజ్‌కు వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నది వైపు వెళ్లవద్దని నీటిపారుదల మరియు రెవెన్యూ శాఖ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *