Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

హే రామ్‌… సేవ్‌ ఆంధ్రప్రదేశ్… జర్నలిస్టు కేవీఆర్, యూట్యూబర్ రావణ్ అరెస్టుపై మాజీ సీఎం జగన్ స్పందన..

Prajapaksham 05 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
హే రామ్‌… సేవ్‌ ఆంధ్రప్రదేశ్… జర్నలిస్టు కేవీఆర్, యూట్యూబర్ రావణ్ అరెస్టుపై మాజీ సీఎం జగన్ స్పందన..

jagan mohan reddy (X.com)

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పైన స్పందించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ లేఖను పంచుకున్నారు. ఇందులో ఆయన రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు అలాగే యూట్యూబ్ రావణ్, జర్నలిస్టు కెవిఆర్ అరెస్టు పైన స్పందించారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందని హే రామ్ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అని తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. జగన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో పోలీసు యంత్రాంగం పూర్తిగా అదుపు తప్పిందని, అత్యంత ప్రమాదకర ధోరణిలో వెళుతోందని ఆయన విమర్శించారు.

రాజకీయంగా అణిచివేత కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకరమైన ధోరణి వైపు నడిపిస్తున్నారని ఆయన తన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని మొదలుపెట్టారని తద్వారా ప్రతి చోట విష విత్తనాలను నాటుతున్నారని అవి నేడు విషవృక్షాలుగా మారుతున్నాయని జగన్ విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో చిన్నారుల మిస్సింగ్ వ్యవహారం పైన దర్యాప్తు వేగవంతం లేకపోవడంతో పాటు మహిళలకు సంబంధించిన నేరాలు నమోదు కాకపోయినా ప్రభుత్వానికి కదలిక లేదని అదే సమయంలో సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతుకలను అరెస్టులు చిత్రహింసలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా అని జగన్ విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ లేఖలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇలా స్పందించారు. ” కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?

ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్‌ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.

సాయికృష్ణ లాకప్‌డెత్‌, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్‌ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్‌ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్‌, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.

వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్‌ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు లింక్‌ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసుల‌కు హుకుం జారీ చేసిన‌ట్లుగా స‌మాచారం వ‌స్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.

యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, ఉస్మానియా గోల్డ్‌మెడల్‌ జర్నలిస్ట్‌ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్‌ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.

యూట్యూబర్‌ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్‌ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్‌స్టేషన్లపై త‌మ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్‌స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.

చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్‌ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్‌ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్‌ వ్యవస్థ కావాలి.” జగన్మోహన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ట్యాగ్‌లు: andhra pradesh YS Jagan Mohan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *