Skip to content
జాతీయం వార్తలు

Bankipur Bypoll: బంకిపూర్‌ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్.. బీజేపీ కంచుకోటలో పాగా వేయగలడా..

Prajapaksham 05 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Bankipur Bypoll: బంకిపూర్‌ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్.. బీజేపీ కంచుకోటలో పాగా వేయగలడా..

బంకిపూర్‌ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్

Bankipur Bypoll: ప్రముఖ ఎన్నికల రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. బీహార్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బంకిపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన స్వయంగా పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ చీఫ్ మనోజ్ భారతి ఆదివారం అధికారికంగా ప్రకటించారు. దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి (BJP) తిరుగులేని కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుండి ప్రశాంత్ కిశోర్ బరిలోకి దిగుతుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్రమైన సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బంకిపూర్ నియోజకవర్గం నుండి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్.. ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. తమ పార్టీ పూర్తి విశ్వాసంతో, శక్తులన్నింటినీ ఒడ్డి ఈ ఉపఎన్నికలో పోరాడుతుందని స్పష్టం చేశారు. బీహార్ రాష్ట్రంలో సరికొత్త ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఈ ఉపఎన్నిక విజయమే పునాది వేస్తుందని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు.

గత నాలుగేళ్లుగా జన్ సురాజ్ ప్రచారమే తన జీవితంగా మారిందని, బీహార్‌లో సమూల మార్పు తీసుకురావడమే తన ఏకైక ధ్యేయమని పీకే పేర్కొన్నారు. బంకిపూర్ ఉపఎన్నికలో పోటీ చేసే బాధ్యతను ఆ మార్పు దిశగా పడిన మొదటి అడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు. తనపై నమ్మకముంచి బరిలోకి దించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం.. బంకిపూర్ ఉపఎన్నికకు జూలై 30న పోలింగ్ జరగనుండగా.. ఆగస్టు 3న ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్‌కు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించింది. అయితే దశాబ్దాలుగా ఉన్న బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టే ఈ భారీ ప్రయత్నంలో బీహార్‌లోని ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతా దళ్ (RJD) కూడా పీకేకు మద్దతు ఇస్తుందా.. లేదా ఒంటరిగా బరిలోకి దిగుతుందా? అనే అంశంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఉపఎన్నిక ఫలితం బీహార్ భవిష్యత్తు రాజకీయ గమనాన్ని మార్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *